హరహర మహాదేవ..
ABN , Publish Date - Feb 16 , 2026 | 12:57 AM
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శైవక్షేత్రాలకు భక్తులతో పోటెత్తారు. హరహరమహదేవ శంభోశంకర అంటూ భక్తుల శివ నామస్మరణతో ఆలయాలు మార్మోగాయి. శైవక్షేత్రాల్లో అర్చకులు తెల్లవారుజామున ప్రత్యేక పూజలు, పంచామృత అభిషేకాలు నిర్వహించి, అనంతరం సాధారణ భక్తులకు దర్శనాలు కల్పించారు. కుటుంబాల సమేతంగా భక్తులు ఆలయాలకు వచ్చి స్వామి, అమ్మవార్లను దర్శించుకుని పూజలు చేశారు.
శివనామ స్మరణతో మార్మోగిన శివాలయాలు
కల్యాణపులోవ, పంచదార్ల, ధారమఠం ఆలయాలకు పోటెత్తిన భక్తులు
ఇతర శైవక్షేత్రాలు సైతం భక్తులతో రద్దీ
ఘనంగా మహాశివరాత్రి వేడుకలు
కల్యాణపులోకు పోటెత్తిన భక్తజనం
పోతురాజుబాబు, పెద్టింటమ్మవార్లను దర్శించుకొని పూజలు
రిజర్వాయర్ స్నానఘట్టాలు కిటకిట
రావికమతం, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): భక్తజన కోటితో మండలంలోని కల్యాణపులోవ కిక్కిరిసిపోయింది. శివనామ స్మరణతో ఆలయ ప్రాంగణం, జలాశయం పరిసరాలు మార్మోగాయి. ఉమ్మడి జిల్లాతోపాటు ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. ఆలయంలో శివలింగం రూపంలో వున్న పోతురాజుబాబును, పెద్దింటమ్మవార్లను దర్శించుకోవడానికి బారులు తీరారు. వీరిలో అత్యధికులు తొలుత జలాశయంలో పుణ్యస్నానాలు ఆచరించారు. దీంతో స్నానఘాట్‌లు రద్దీగా మారాయి.
పోతురాజుబాబు, పెద్దింటమ్మను దర్శించుకోవడానికి మూడు రోజుల్లో మూడు లక్షల మంది భక్తులు తరలివస్తారన్న అంచనాతో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. వాహనాల నిలుపుదల కోసం ఆలయ పరిసరాల్లో 45 ఎకరాల మేర చదును చేశారు. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అసాధారణ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. స్నానఘాట్‌ల వద్ద గత ఈతగాళ్లను అందుబాటులో వుంచారు. క్యూలో నిల్చున్న తరువాత పోతురాజుబాబు, పెద్దింటమ్మను దర్శించుకోవడానికి రెండు నుంచి నాలుగు గంటల సమయం పట్టిందని భక్తులు చెబుతున్నారు. అనకాపల్లి డీస్పీ శ్రావణి పర్యవేక్షణలో కొత్తకోట సీఐ జి.కోటేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసులు ట్రాఫిక్ స్తంభించకుండా చర్యలు చేపట్టారు. శాసన సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు, అనకాపల్లి ఎంపీ రమేశ్, మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు, డీసీసీబీ పర్సన్ ఇన్‌చార్జి కోన తాతారావు, తదితరులు పోతురాజుబాబును, పెద్దింటమ్మవార్లను దర్శించుకొని పూజలుచేశారు.
పంచదార్ల క్షేత్రానికి భక్తుల తాకిడి
ఉమాధర్మలింగేశ్వరుడికి ప్రత్యేక పూజలు
ఆకాశధార వద్ద పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు
రాంబిల్లి, ఫిబ్రవరి 15: హరహర మహాదేవ శంభో శంకర అంటూ శివనామ స్మరణతో పంచదార్ల పుణ్యక్షేత్రం మార్మోగింది. మహాశివరాత్రి సందర్భంగా ఆదివారం పంచదార్ల ఆలయానికి ఉమ్మడి జిల్లా నలుమూలలు నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. తొలుత రాధామాధవస్వామి ఆలయ గర్భంలో ప్రవహిస్తున్న ఆకాశ ధార వద్ద భక్తులు పుణ్యస్నానాలు ఆచరించిన, అనంతరం ఫణిగిరిపై ఉమాధర్మలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అంతకు ముందు తెల్లవారుజామున ప్రధాన అర్చకులు ఆలయంలో ధర్మలింగేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం సాధారణ భక్తులకు దర్శనాలు ప్రారంభించారు. కాగా ఇదే క్షేత్రంలో ఉన్న కాశీవిశ్వేశ్వరస్వామిని, సహస్త్ర లింగేశ్వరస్వామిని, రాధామాధవస్వామిని దర్శించుకొని పూజలు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో ఉమాధర్మలింగేశ్వరస్వామిని దర్శించుకోవడానికి ఎక్కువ సమయం క్యూలో వుండాల్సి వచ్చిందని భక్తులు తెలిపారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవదాయ శాఖ ఈవో తేజ ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఉచిత ప్రసాద వితరణ చేశారు.