హరహర మహాదేవ
ABN , Publish Date - Feb 15 , 2026 | 11:16 PM
జిల్లాలోని శివాలయాలు ఆదివారం భక్తులతో కిటకిటలాడాయి. మహాశివరాత్రి సందర్భంగా వేకువజాము నుంచే భక్తులు స్వామివారి దర్శనానికి బారులుతీరారు.
శివనామ స్మరణతో మార్మోగిన శివాలయాలు
మత్స్యగుండానికి పోటెత్తిన భక్తులు
జిల్లాలో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు
పాడేరు, ఫిబ్రవరి 15(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని శివాలయాలు ఆదివారం భక్తులతో కిటకిటలాడాయి. మహాశివరాత్రి సందర్భంగా వేకువజాము నుంచే భక్తులు స్వామివారి దర్శనానికి బారులుతీరారు. మత్స్యగుండంలోని మత్స్యలింగేశ్వరస్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఐటీడీఏ పీవో శ్రీపూజ, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, అధికారులు స్వామివారిని దర్శించుకున్నారు. పాడేరులోని ఉమానీలకంఠేశ్వరస్వామి సమేత రాజరాజేశ్వరి ఆలయంలో అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. పాడేరులోని స్వయం భూ లింగేశ్వరస్వామి, త్రిముఖ లింగేశ్వరస్వామి ఆలయాలతో పాటు వంతాడపల్లి, నక్కలపుట్టు, వర్తనాపల్లి తదతర గ్రామాల్లోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. కొయ్యూరులోని భ్రమరాంబిక సహిత మల్లికార్జున స్వామి ఆలయం, చింతపల్లి మండలంలోని అంతర్ల, చిలకలమామిడి, బౌడ శివాలయాలు, జీకేవీధి మండలం సీలేరు, ధారకొండల్లో రాత్రి లింగోద్భవ కాలంలో ఏకాదశ రుద్రాభిషేకాలు, రుద్ర హోమం నిర్వహించారు. అరకులోయలోని శివాలయం, డుంబ్రిగుడ మండలంలోని డుంబ్రిగుడ, కించుమండ, కురిడి శివాలయాలు, ముంచంగిపుట్టు మండల కేంద్రంతో పాటు దారెల, చెరువుపాకల, డేగలపుట్టు, జోలాపుట్టు తదితర ప్రాంతాల్లో గల శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి.
మత్స్యగుండంలో..
హుకుంపేట: మత్స్యగుండంలోని మత్స్యలింగేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో ఆదివారం వేకువజాము నుంచే బారులుతీరారు. ఒడిశా నుంచి కూడా భక్తులు రావడంతో ఆలయం కిక్కిరిసిపోయింది. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా ఆలయ కమిటీ ప్రతినిధులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఐటీడీఏ పీవో శ్రీపూజ, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, ఆర్డీవో లోకేశ్వరరావు, సీఐ నాయుడు, ఎస్‌ఐ దుర్గాప్రసాద్, తహశీల్దార్ శ్రీనివాస్, ఎండీవో రమాదేవి, తదితరులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.