Share News

ఉత్సాహంగా హ్యాపీ సండే!

ABN , Publish Date - Feb 23 , 2026 | 01:06 AM

ప్రజల్లో మానసిక ప్రశాంతత, శారీరక దారుఢ్యం పెంపొందించడం ద్వారా ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించే లక్ష్యంతో ‘హ్యాపీ సండే’ పేరుతో జీవీఎంసీ నగరంలో పలుచోట్ల నిర్వహించిన కార్యక్రమాలకు విశేషస్పందన లభించింది.

ఉత్సాహంగా హ్యాపీ సండే!

ఆరోగ్యకరమైన సమాజమే ధ్యేయం

ప్రభుత్వ కార్యాలయాలు, పార్కులు, అపార్టుమెంట్లలో యోగా, క్రీడా శిక్షణ, వ్యాయామం

ప్రభుత్వ ఆదేశాలతో నగరంలో పలుచోట్ల నిర్వహించిన జీవీఎంసీ

విశాఖపట్నం, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి):

ప్రజల్లో మానసిక ప్రశాంతత, శారీరక దారుఢ్యం పెంపొందించడం ద్వారా ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించే లక్ష్యంతో ‘హ్యాపీ సండే’ పేరుతో జీవీఎంసీ నగరంలో పలుచోట్ల నిర్వహించిన కార్యక్రమాలకు విశేషస్పందన లభించింది. ప్రభుత్వ కార్యాలయాలు, పార్కులు, గేటెడ్‌కమ్యూనిటీలు, అపార్ట్‌మెంట్‌ల వద్ద పతి నెలా రెండు, నాలుగు ఆదివారాల్లో ఉదయం ఆరు నుంచి పది గంటల మధ్య వ్యాయామం, కరాటే, క్రీడలను నిర్వహించాలని ఇటీవల మునిసిపల్‌, పట్టణాభివృద్ధిశాఖ ఆదేశాలు జారీచేసింది.

కార్యక్రమాల్లో మహిళలు, చిన్నారులు, వృద్ధులతోపాటు అన్నివర్గాల వారిని భాగస్వాములను చేయడంతోపాటు జీవీఎంసీ అదనపు కమిషనర్లు, జోనల్‌ కమిషనర్లు, యూసీడీ సిబ్బంది పాల్గొనాలని సూచించింది. ఈ మేరకు జీవీఎంసీ అధికారులు ఆదివారం భీమిలిజోన్‌ తోటవీధి కార్యాలయం ఆవరణలో వాలీబాల్‌ ఆడించారు. మధురవాడ జోన్‌ కార్యాలయంలో యోగా, ఈస్ట్‌జోన్‌ పరిధిలోని జేఆర్‌నగర్‌లో కరాటే, యోగా, స్వచ్ఛప్రతిజ్ఞ చేయించారు. వెస్ట్‌జోన్‌ పరిధిలోని ఏపీ ఎస్‌ఈబీకాలనీలో యోగా, సౌత్‌ జోన్‌ పరిధి బీచ్‌రోడ్డులో యోగా, పెందుర్తి జోన్‌ పరిధి బీఆర్‌టీఎస్‌రోడ్డు పాతగోశాల జంక్షన్‌లో కరాటే, కార్యాలయం ఆవరణలో యోగా, సీనియర్‌ సిటిజన్లతో సమావేశం నిర్వహించారు. గాజువాక జోన్‌ పరిధిలో కరాటే, యోగా, అగనంపూడిలో సాంస్కృతిక కార్యక్రమాలు, అనకాపల్లి జోన్‌ పరిధిలో స్కేటింగ్‌, యోగా, వినోద కార్యక్రమాలు నిర్వహించారు. ఈస్ట్‌ జోన్‌ పరిధి జేఆర్‌నగర్‌ నివాసితులతో నిర్వహించిన యోగా కార్యక్రమానికి అదనపు కమిషనర్‌ పి.నల్లనయ్య హాజరయ్యారు.

Updated Date - Feb 23 , 2026 | 01:06 AM