Share News

శ్రీకాకుళం- తిరుపతి హంసఫర్‌ రైలుకు ఎలమంచిలిలో హాల్ట్‌

ABN , Publish Date - Apr 14 , 2026 | 01:19 AM

శ్రీకాకుళం- తిరుపతి మధ్య కొత్తగా ప్రవేశపెట్టిన ‘హంసఫర్‌’ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు ఎలమంచిలి స్టేషన్‌లో కూటమి నేతలు, కార్యకర్తలు, స్థానికులు ఘన స్వాగతం పలికారు.

శ్రీకాకుళం- తిరుపతి హంసఫర్‌ రైలుకు ఎలమంచిలిలో హాల్ట్‌

ప్రారంభోత్సవ రైలుకు ఘనస్వాగతం పలికిన నేతలు, ప్రజలు

ఎలమంచిలి, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి):

శ్రీకాకుళం- తిరుపతి మధ్య కొత్తగా ప్రవేశపెట్టిన ‘హంసఫర్‌’ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు ఎలమంచిలి స్టేషన్‌లో కూటమి నేతలు, కార్యకర్తలు, స్థానికులు ఘన స్వాగతం పలికారు. శ్రీకాకుళంలో సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు జెండా ఊపి ప్రారంభించిన ఈ రైలు... సాయంత్రం ఆరు గంటలకు ఎలమంచిలి స్టేషన్‌కు చేరింది. ఇక్కడ హాల్ట్‌ కల్పించినట్టు తెలియడంతో స్థానిక నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో స్టేషన్‌కు తరలివచ్చారు. ఎలమంచిలి స్టేషన్‌కు చేరుకున్న హంసఫర్‌ రైలుకు రాష్ట్ర రహదారుల అభివృద్ధి కార్పొరేషన్‌ చైర్మన్‌ ప్రగడ నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు, జనసేన పార్టీ ఉత్తరాంధ్ర ప్రతినిధి సుందరపు సతీశ్‌కుమార్‌, బీజేపీ జాతీయ కౌన్సిల్‌ సభ్యురాలు పిల్లా రమాకుమారి, తదితరులు స్వాగతం పలికారు. అనంతరం రైలులో ప్రయాణిస్తున్న వారికి పుష్పగుచ్ఛాలు అందించారు. ఈ సందర్భంగా ప్రగడ నాగేశ్వరరావు మాట్లాడుతూ, శ్రీకాకుళం- తిరుపతి హంసఫర్‌ వీక్లీ రైలుకు ఎలమంచిలిలో హాల్ట్‌ కల్పించడం వల్ల నియోజకవర్గం నుంచి తిరుపతి వెళ్లే వారికి ఎంతో ఉపయోగకరంగా వుంటుందని అన్నారు. సుమారు ఐదు నిమిషాల అనంతరం రైలు ఇక్కడి నుంచి బయలుదేరింది.


దిమిలి పీహెచ్‌సీలో అగ్నిప్రమాదం

ఆపరేషన్‌ థియేటర్‌లో షార్ట్‌సర్క్యూట్‌

దగ్ధమైన పలు పరికరాలు

రూ.5 లక్షల మేర ఆస్తి నష్టం

రాంబిల్లి, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి): మండలంలోని దిమిలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అగ్నిప్రమాదం సంభవించింది. సోమవారం సాయంత్రం 4.15 గంటల ప్రాంతంలో ఆపరేషన్‌ థియేటర్‌లో విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా మంటలు చెలరేగాయి. దీంతో ఖరీదైన వైద్య పరికరాలు, ఏసీలు, బెడ్లు, విద్యుత్‌ వైరింగ్‌ పూర్తిగా కాలిపోయాయి. పీహెచ్‌సీ సిబ్బంది ఎలమంచిలి అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. ఈలోగా స్థానికులతో కలిసి తమ వంతు ప్రయత్నం చేసి మంటలను అదుపు చేశారు. అగ్నిప్రమాదం కారణంగా సుమారు రూ.5 లక్షల ఆస్తి నష్టం వాటిల్లి వుంటుందని ఆస్పత్రి వైద్యాధికారి వెంకటేశ్‌ చెప్పారు. పీహెచ్‌సీలో జరిగిన అగ్నిప్రమాదం గురించి డీఎంహెచ్‌వోకు, ఇతర అధికారులకు తెలియపరిచినట్టు ఆయన చెప్పారు.

Updated Date - Apr 14 , 2026 | 01:19 AM