Share News

అరవిరిసిన ముగ్గులు

ABN , Publish Date - Jan 05 , 2026 | 01:24 AM

ఏటా మాదిరిగా సంక్రాంతి పండగను పురస్కరించుకుని ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌’ ఆధ్వర్యంలో నిర్వహించిన ముత్యాల ముగ్గుల పోటీలకు మహిళల నుంచి విశేష స్పందన లభించింది.

అరవిరిసిన ముగ్గులు

  • ‘ఆంధ్రజ్యోతి - ఏబీఎన్‌’ ముత్యాల ముగ్గుల పోటీలకు విశేష స్పందన

  • ఉత్సాహంగా పాల్గొన్న 135 మంది మహిళలు

  • కుటుంబసభ్యులతో సహా హాజరైన అతివలు

  • శ్రీప్రకాష్‌ ప్రాంగణానికి సంక్రాంతి శోభ

  • ముగ్గురు విజేతలకు నగదు బహుమతులు

  • మరో ముగ్గురికి కన్సొలేషన్‌, పాల్గొన్న వారందరికీ ప్రత్యేక బహుమతుల ప్రదానం

విశాఖపట్నం, జనవరి 4 (ఆంధ్రజ్యోతి):

ఏటా మాదిరిగా సంక్రాంతి పండగను పురస్కరించుకుని ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌’ ఆధ్వర్యంలో నిర్వహించిన ముత్యాల ముగ్గుల పోటీలకు మహిళల నుంచి విశేష స్పందన లభించింది. ఈ పోటీలకు నగర పరిధిలోని అనేక ప్రాంతాల నుంచి భారీగా మహిళలు హాజరై రంగవల్లులను తీర్చిదిద్దారు. ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌’.. నిర్వహిస్తున్న సంతూర్‌ ముత్యాల ముగ్గుల పోటీలు.. పవర్డ్‌ బై: ‘సన్‌ఫీస్ట్‌’ మ్యాజిక్‌ మామ్స్‌ బిస్కెట్‌, టేస్ట్‌ పార్టనర్‌ ’స్వస్తిక్‌’ మసాలా, ప్రేయర్‌ పార్టనర్‌ పరిమళ్‌ మందిర్‌ భారత్‌వాసి అగర్‌బత్తీ’ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం నగరంలోని సీతమ్మధార టీపీటీ కాలనీలో గల శ్రీప్రకాష్‌ విద్యానికేతన్‌ స్కూల్‌ ప్రాంగణంలో ముత్యాల ముగ్గుల పోటీలను నిర్వహించారు.

ఈ పోటీలకు 135 మంది మహిళలు హాజరై సంక్రాంతి థీమ్‌తో విభిన్నమైన ముగ్గులను తీర్చిదిద్దారు. మహిళలు కుటుంబ సభ్యులతో సహా రావడంతో ప్రాంగణంలో సందడి నెలకొంది. సంక్రాంతి థీమ్‌తో వేసిన ముగ్గులు ఆహూతులను అలరించాయి. హరివిల్లును తలపించాయి.

సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేలా..

సంక్రాంతి పండగ అంటే తెలుగు ప్రజల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక. వీటిని ప్రాధాన్యమిచ్చేలా ముగ్గుల పోటీలను నిర్వహించారు. అందుకు తగ్గట్టుగానే ప్రతి ముగ్గులో సంక్రాంతిని తలపించే అనేక అంశాలు సాక్షాత్కరించాయి. గుమ్మానికి తోరణాలు, ఇళ్ల ముందు పశువులు సందడి, పసుపు రాసిన పూర్ణ కుంభం, పాలు పొంగే సిరులు, నవధాన్యాలు, పిండి వంటలు, చెరకు గడలు, డూడూ బసవన్నలు, హరిదాసు కీర్తనలు స్ఫురించేలా నిర్వాహకులు, న్యాయ నిర్ణేతలను అబ్బురపరిచేలా రంగవల్లులను తీర్చిదిద్దిరు.

విజేతలు వీరే..

ముత్యాల ముగ్గుల పోటీల విజేతలను ఎంపిక చేసే బాధ్యతను ఎన్‌ఎస్‌ఎస్‌ జిల్లా నోడల్‌ ఆఫీసర్‌ ఈపీఎస్‌ భాగ్యలక్ష్మి, విశాఖ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ (విమ్స్‌) ప్రిన్సిపాల్‌ యు.లారెన్స్‌కు అప్పగించారు. వీరి వారు ఒక్కో ముగ్గును పలుమార్లు పరిశీలించి అనేక అంశాలను బేరీజు వేసి, విజేతలను ఎంపికచేశారు. థీమ్‌, రంగుల వినియోగం, చుక్కలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. పోటీల్లో ఎన్‌ఏడీ ఎన్‌ఎస్‌టీఎల్‌ ప్రాంతానికి చెందిన కె.నాగమణి ప్రథమవిజేతగా నిలిచి రూ.6 వేలు నగదు బహుమతి అందుకోగా, పెదవాల్తేరు ప్రాంతానికి చెందిన ఆర్‌.ప్రవీణ ద్వితీయస్థానంలో నిలిచి రూ.4 వేలు, ఓల్డ్‌ డైరీఫారం ప్రాంతానికి చెందిన వి.లక్ష్మి తృతీయ స్థానంలో నిలిచి రూ.3 వేలు నగదు బహుమతి అందుకున్నారు. అందమైన రంగవల్లులు తీర్చిదిద్దిన కె.మంగ, ఎం.లక్ష్మీదేవి, ఎ.సంతోషి ఉన్నారు. రూ.వెయ్యి చొప్పున కొన్సలేషన్‌ బహమతులు అందుకున్నారు.

ప్రాంగణంలో పండగ వాతావరణం..

ముత్యాల ముగ్గుల పోటీలకు చాలా మంది కుటుంబసభ్యులతో సహా హాజరుకావడంతో పండగ వాతవారణం కనిపించింది. పోటీలు అనంతరం మహి ళలు, చిన్నారులు నృత్యాలతో సందడి చేయగా, మరికొందరు సంప్రదాయబద్ధమైన పాటలతో అలరించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ ‘ఆంధ్రజ్యోతి’ నిర్వహించే ముత్యాల ముగ్గుల పోటీల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంటామన్నారు. కొన్ని వారాలు ముందు నుంచే ప్రాక్టీస్‌ చేస్తుంటామని పేర్కొన్నారు. పోటీల్లో పాల్గొన్న ప్రతి మహిళకు ప్రత్యేక బహుమతులను ముఖ్య అతిథుల చేతులమీదుగా అందించారు.

Updated Date - Jan 05 , 2026 | 01:24 AM