సింహాచలం దేవస్థానం ట్రస్ట్‌బోర్డు సభ్యులుగా జ్ఞానేశ్వరి, లక్ష్మీకుమారి
ABN , Publish Date - May 14 , 2026 | 11:31 PM
సింహాచలం వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ట్రస్ట్‌బోర్డు సభ్యులుగా టీడీపీ అరకు పార్లమెంట్ ఉపాధ్యక్షురాలు చల్లంగి జ్ఞానేశ్వరి, టీడీపీ అరఅరకులోయ క్లస్టర్ ఇన్‌చార్జి బేతల నీరజ లక్ష్మీకుమారిలను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
చింతపల్లి/అరకులోయ, మే 14 (ఆంధ్రజ్యోతి): సింహాచలం వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ట్రస్ట్‌బోర్డు సభ్యులుగా టీడీపీ అరకు పార్లమెంట్ ఉపాధ్యక్షురాలు చల్లంగి జ్ఞానేశ్వరి, టీడీపీ అరఅరకులోయ క్లస్టర్ ఇన్‌చార్జి బేతల నీరజ లక్ష్మీకుమారిలను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. సింహాచలం దేవస్థానం ట్రస్ట్‌బోర్డు చైర్మన్‌గా అశోక్‌గజపతిరాజుతోపాటు 16మంది సభ్యులను నియమించింది. పాడేరు నియోజకవర్గంలోని చింతపల్లికి చెందిన టీడీపీ సీనియర్ నాయకురాలు జ్ఞానేశ్వరికి ట్రస్ట్ బోర్డులో చోటు కల్పించారు. జ్ఞానేశ్వరి 2004లో ఉపాధ్యాయురాలు ఉద్యోగానికి రాజీనామా చేసి చింతపల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసి ఓటమిపాలయ్యారు. నాటి నుంచి నేటి వరకు జిల్లా, రాష్ట్ర స్థాయిలో పలు పార్టీ పదవుల్లో ఆమె క్రియాశీలక నాయకురాలుగా పనిచేశారు. ఈ సందర్భంగా జ్ఞానేశ్వరి విలేకరులతో మాట్లాడుతూ తనను ట్రస్ట్ బోర్డు సభ్యురాలుగా నియమించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేశ్, రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణికి కృతజ్ఞతలు తెలిపారు.
సింహాచలం వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ట్రస్ట్‌బోర్డు సభ్యురాలిగా టీడీపీ అరకులోయ క్లస్టర్ ఇన్‌చార్జి బేతల నీరజ లక్ష్మీకుమారిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్‌చార్జిగా అరకులోయలో ఆమె చురుకైన పాత్ర పోషిస్తున్నారు. తనను ట్రస్టు బోర్డు సభ్యురాలిగా నియమించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఐటీ, మానవవనరుల శాఖల మంత్రి నారా లోకేశ్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, టీడీపీ అరకులోయ నియోజకవర్గ ఇన్‌చార్జి సియ్యారి దొన్నుదొరలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. సింహాచలం దేవస్థానం ట్రస్ట్‌బోర్డు సభ్యురాలిగా నియమితులైన బేతల నీరజ లక్ష్మీకుమారికి పెదలబుడు తాజా మాజీ సర్పంచ్ పెట్టెలి దాసుబాబు, సీనియర్ మహిళా నాయకురాలు బూర్జ లక్ష్మి, అరకు మార్కెట్ కమిటీ చైర్మన్ బొరిబొరి లక్ష్మి, టీడీపీ నాయకులు నాగరాజు, దామోదర్, త్రినాథ్ అభినందనలు తెలిపారు.