Share News

జీవీఎంసీ వార్డుల పునర్విభజన పూర్తి

ABN , Publish Date - May 17 , 2026 | 12:41 AM

జీవీఎంసీ పరిధిలో వార్డుల సంఖ్యను 98 నుంచి 120కి పెంచుతూ టౌన్‌ ప్లానింగ్‌ విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన వార్డుల పునర్విభజన ప్రక్రియ పూర్తయింది.

జీవీఎంసీ వార్డుల పునర్విభజన పూర్తి

నేటి సాయంత్రం ముసాయిదా విడుదల?

వార్డులు 98 నుంచి 120కి పెంపు

ప్రతి వార్డులో సగటున 15,840 మంది ఉండేలా విభజన

వార్డుల సంఖ్య 150కి పెంచాలని మరోవైపు ప్రజా ప్రతినిధులు పట్టు

ముసాయిదా విడుదల తరువాత కూడా మార్పులు చోటుచేసుకునే అవకాశం లేకపోలేదనే అభిప్రాయాలు

విశాఖపట్నం, మే 16 (ఆంధ్రజ్యోతి):

జీవీఎంసీ పరిధిలో వార్డుల సంఖ్యను 98 నుంచి 120కి పెంచుతూ టౌన్‌ ప్లానింగ్‌ విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన వార్డుల పునర్విభజన ప్రక్రియ పూర్తయింది. ముసాయిదా ప్రతులను చీఫ్‌ సిటీప్లానర్‌ ఎ.ప్రభాకరరావు శనివారం సాయంత్రం కమిషనర్‌ కేతన్‌గార్గ్‌కు అందజేశారు. ఆయన పరిశీలించి కొన్ని సూచనలు చేశారు. ఆ మేరకు మార్పులు చేసి, 120 వార్డుల సరిహద్దులతో కూడిన ముసాయిదాను ఆదివారం సాయంత్రం విడుదల చేసి అన్ని జోనల్‌, తహశీల్దార్‌, సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు, జీవీఎంసీ ప్రఽధాన కార్యాలయం, జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంచనున్నారు.

జీవీఎంసీ పరిధిలోని వార్డుల సంఖ్యను 2011 జనాభా లెక్కల ప్రకారం 120కి పెంచుతూ పునర్విభజన చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం గత నెల ఒకటిన జీవీఎంసీ అధికారులను ఆదేశించింది. ఆ లెక్కల ప్రకారం నగర జనాభా 19 లక్షలు కావడంతో ఒక్కో వార్డులో సగటున 15,840 మంది ఉండేలా పునర్విభజన చేపట్టారు. వార్డుల పునర్విభజనకు తొలుత ఏప్రిల్‌ తొమ్మిది వరకు గడువు ఇచ్చిన ప్రభుత్వం ఆ తర్వాత రెండుసార్లు పొడిగించింది. మే 17 నాటికి వార్డుల పునర్విభజన ముసాయిదాను ప్రజలకు అందుబాటులో ఉంచాలని స్పష్టం చేయడంతో అధికారులు ఆ మేరకు ప్రక్రియను పూర్తిచేశారు. శనివారం ముసాయిదాను కమిషనర్‌ పరిశీలనకు పంపారు. ఆయన ఆమోదం అనంతరం ఆదివారం సాయంత్రం డ్రాఫ్ట్‌ను విడుదల చేసి ప్రజల నుంచి అభ్యంతరాలను ఈనెల 24 వరకు స్వీకరిస్తారు. అభ్యంతరాలు, సలహాలు, సూచనలను పరిగణనలోకి తీసుకుని మార్పులు, చేర్పులు చేపట్టిన తర్వాత 25వ తేదీ నుంచి జూన్‌ ఐదో తేదీ మధ్య ఫైనల్‌ డ్రాఫ్ట్‌ను సీడీఎంఏకి పంపించాల్సి ఉంటుంది. ఆ డ్రాఫ్ట్‌ను సీడీఎంఏ పరిశీలించిన తర్వాత జూన్‌ 12 నుంచి 23 మధ్యలో వార్డుల విభజనకు సంబంధించి తుది నోటిఫికేషన్‌ జారీచేస్తారు.

ఇదిలావుండగా జీవీఎంసీ పరిధిలోని వార్డుల సంఖ్యను 120 నుంచి 150కి పెంచాలంటూ నగరానికి చెందిన ప్రజా ప్రతినిధులు ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నారు. ప్రజా ప్రతినిధుల ఒత్తిడికి తలొగ్గిన ప్రభుత్వ పెద్దలు వారి విజ్ఞాపనను పరిశీలించాలని జీవీఎంసీ కమిషనర్‌కు సూచించినట్టు సమాచారం. అందువల్లనే శనివారం అర్ధరాత్రి వరకు వార్డుల పునర్విభజన ముసాయిదా ప్రాథమిక నోటిఫికేషన్‌ విడుదల విషయంలో కమిషనర్‌ తర్జనభర్జన పడినట్టు ప్రచారం జరిగింది. అయితే ప్రస్తుతానికి వార్డుల పునర్విభజన ముసాయిదాపై ప్రాథమిక నోటిఫికేషన్‌ ఇచ్చినప్పటికీ, తర్వాత మార్పులు, జీవీఎంసీ పరిధిలో కొత్తప్రాంతాల విలీనం వంటి అవకాశాలను కొట్టివేయలేమని అధికారులు చెబుతుండడం విశేషం.

Updated Date - May 17 , 2026 | 12:41 AM