అధ్యయన యాత్రకు అంత ఒత్తిడెందుకో!?
ABN , Publish Date - Mar 07 , 2026 | 12:59 AM
కార్పొరేటర్ల అధ్యయన యాత్ర అంశంపై జీవీఎంసీలో తీవ్ర చర్చ జరుగుతోంది.
కార్పొరేటర్ల వెనుక కొందరు పెద్దలు
గతంలో మాదిరిగా విభాగాలు, కాంట్రాక్టర్లకు ఇండెంట్ పెట్టేందుకేనంటున్న జీవీఎంసీ అధికారులు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
కార్పొరేటర్ల అధ్యయన యాత్ర అంశంపై జీవీఎంసీలో తీవ్ర చర్చ జరుగుతోంది. పదవీకాలం మరో పది రోజుల్లో ముగుస్తుండగా, అధ్యయన యాత్ర కోసం కేరళ పంపించాలంటూ కార్పొరేటర్లు కొందరు కమిషనర్‌పై ఒత్తిడి చేస్తున్నారు. అయితే దీని వెనుక కౌన్సిల్‌లో కొంతమంది పెద్దల హస్తం ఉందని ప్రచారం జరుగుతోంది.
జీవీఎంసీ కార్పొరేటర్లను ఏడాదికి ఒకసారి అధ్యయన యాత్ర పేరుతో దేశంలోని వివిధ నగరాలకు తీసుకువెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. 2021లో ఈ పాలకవర్గం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకూ నాలుగుసార్లు పదేసి రోజులపాటు పలు నగరాల్లో అధ్యయన యాత్రకు వెళ్లారు. కరోనా కారణంగా 2021లో వెళ్లలేదు. ఆ ఏడాది తీసుకువెళ్లనందున దానికి బదులు ఇప్పుడు అనుమతివ్వాలంటూ కొందరు కార్పొరేటర్లు గత కొద్దిరోజులుగా మేయర్, కమిషనర్‌పై ఒత్తిడి చేస్తున్నారు. నగరంలో కీలకంగా వ్యవహరిస్తున్న కొందరు ప్రజా ప్రతినిధులను కలిసి కమిషనర్‌కు చెప్పించారు. అయితే ఈనెల 17తో పాలకవర్గం పదవీకాలం ముగుస్తున్నందున ఇప్పడు అధ్యయన యాత్రకు ప్రజాధనం మంజూరుచేస్తే తనపై విమర్శలు వచ్చే అవకాశం ఉందని సదరు ప్రజాప్రతినిధులకు కమిషనర్ చెప్పినట్టు తెలిసింది. అయినప్పటికీ కనీసం నాలుగు రోజుల యాత్రకైనా అనుమతించాలని కార్పొరేటర్లు కోరుతున్నారు. దీనివెనుక కౌన్సిల్‌లో కొందరు పెద్దలు ఉన్నారని అధికారులు అంటున్నారు.గతంలో అధ్యయన యాత్రకు వెళ్లినప్పుడల్లా ఖర్చులు, కార్పొరేటర్లందరికీ సర్దుబాటు చేయాల్సి ఉందంటూ వివిధ విభాగాలు, కాంట్రాక్టర్ల నుంచి డబ్బులు వసూలు చేసేవారని ఆరోపిస్తున్నారు. ఇప్పుడు కూడా అదే పెద్దలు తమ వ్యక్తిగత ప్రయోజనం కోసం తమ మాట వినే కార్పొరేటర్లను అధ్యయన యాత్రకు అనుమతివ్వాలంటూ కమిషనర్‌పైకి ఎగదోస్తున్నారని ఆరోపిస్తుండడం గమనార్హం.