Share News

చేతివాటం

ABN , Publish Date - Aug 17 , 2026 | 12:10 AM

జీవీఎంసీ ప్రజారోగ్య విభాగంలోని ఒక అధికారి తీరు చర్చనీయాంశంగా మారింది.

చేతివాటం

చికెన్‌ వ్యర్థాల కాంట్రాక్టర్లతో జీవీఎంసీ ప్రజారోగ్య విభాగం అధికారి మిలాఖత్‌

వ్యర్థాలు చేపల చెరువులకు తరలించేందుకు భరోసా

ఉన్నతాధికారులకు ఇవ్వాలంటూ నెలకు రూ.8 లక్షలు డిమాండ్‌

చర్చనీయాంశంగా మారిన అధికారి వ్యవహారశైలి

(విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి)

జీవీఎంసీ ప్రజారోగ్య విభాగంలోని ఒక అధికారి తీరు చర్చనీయాంశంగా మారింది. చికెన్‌వ్యర్థాలను కాపులుప్పాడ తరలించేందుకు జీవీఎంసీ నుంచి టెండర్‌ దక్కించుకున్న కాంట్రాక్టర్ల అక్రమాలను చూడకుండా వదిలేయడానికి నెలవారీ మామూళ్లు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉన్నతాధికారులకు ఇవ్వాలం టూ కాంట్రాక్టర్ల నుంచి ప్రతి నెలా రూ.ఎనిమిది లక్షలు వసూలు చేస్తున్నట్టు ఆ విభాగంలోని సిబ్బందే ఆరోపిస్తుండడం అతని తీరుకు అద్దంపడుతోంది.

జీవీఎంసీ పరిధిలోని చికెన్‌దుకాణాల నుంచి వ్యర్థాలను కాపులుప్పాడలోని డంపింగ్‌యార్డుకు తరలించేందుకు జీవీఎంసీ రెండేళ్ల కిందట టెండర్లు పిలిచింది. తాము చెప్పిన వారికే ఖరారు చేయాలని ప్రజాప్రతినిధులు అధికారులపై ఒత్తిడి చేసిన విషయం తెలిసిందే. దీంతో అధికారులు నిబంధనల మేరకు టెండరు దాఖలుచేసినవారికి కాకుండా ప్రజాప్రతినిధులు సూచించినవారికి అడ్డదారిలో టెండర్లు కట్టబెట్టారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై బహిరంగ విమర్శలు వెల్లువెత్తడంతోపాటు, టెండరు దక్కించుకున్న కాంట్రాక్టర్లు చికెన్‌వ్యర్థాలను కాపులుప్పాడలోని డంపింగ్‌యార్డుకి కాకుండా చేపలచెరువులకు తరలించడం ప్రారంభించారు. అప్పట్లో కొందరు కార్పొరేటర్లు చేపల చెరువులకు చికెన్‌ వ్యర్థాలను తరలిస్తున్న వాహనాలను పట్టుకుని పోలీసులకు అప్పగించడంతో కేసులు నమోదుచేశారు. జీవీఎంసీ ప్రజారోగ్య విభాగం అధికారులు కొన్ని వాహనాలను సీజ్‌ చేశారు. దీంతో జీవీఎంసీ కమిషనర్‌ చికెన్‌వ్యర్థాల కాంట్రాక్టర్లు నిబంధనలకు విరుద్ధంగా చికెన్‌ వ్యర్థాలను చేపల చెరువులకు తరలిస్తున్నారని, ఆ చేపలు తిన్న ప్రజల ఆరోగ్యం పాడైపోతుందనే భావనతో టెండర్లను రద్దుచేశారు. దీనిపై కొందరు కాంట్రాక్టర్లు కోర్టుకు వెళ్లడంతో డిసెంబరు వరకు స్టే విధించింది. దీంతో కాంట్రాక్టర్లంతా కచ్చితంగా చికెన్‌వ్యర్థాలను కాపులుప్పాడలోని డంపింగ్‌యార్డుకి తరలించాల్సిందేనని కమిషనర్‌ ఆదేశించారు. అంతేకాకుండా చికెన్‌వ్యర్థాలను తరలించే వాహనాలకు జీపీఎస్‌ ఏర్పాటుచేసి వాటిని కాపులుప్పాడలో తనిఖీ చేసే బాధ్యతను కొందరు వార్డు శానిటేషన్‌ కార్యదర్శులకు అప్పగించారు. దీనివల్ల కొంతకాలం చేపలచెరువులకు తరలించే ప్రక్రియ నిలిచిపోయింది.

ఆదాయం కోల్పోవడంతో...

చికెన్‌ వ్యర్థాలను చేపల చెరువులకు విక్రయిస్తే రూ.లక్షల్లో వచ్చే ఆదాయానికి గండిపడిందని భావించిన కాంట్రాక్టర్లు ప్రజారోగ్యవిభాగంలో కీలక బాధ్యతలను చేజిక్కించుకున్న ఓ అధికారిని ప్రసన్నం చేసుకున్నారని చెబుతున్నారు. ఆ అధికారి సానుకూలంగా స్పందించారని, దీంతో గత కొద్ది నెలలుగా చికెన్‌ వ్యర్థాలను చేపలచెరువులకు తరలించి సొమ్ముచేసుకుంటున్నారని ప్రజారోగ్యవిభాగంలోని సిబ్బందే ఆరోపిస్తున్నారు.

ఉన్నతాధికారుల పేరుతో వసూలు

ప్రజారోగ్యం విభాగంలో పనిచేస్తున్న ఓ అధికారి కొన్నినెలల కిందటే కీలక బాధ్యతలను దక్కించుకున్నారు. తనకు అస్మదీయులైన అధికారులతో కమిషనర్‌కు రికమెండేషన్‌ చేయించుకుని ఆ బాధ్యతలను దక్కించుకున్నారనే ప్రచారం ఉంది. అంతేకాదు సీట్లో కుదరుకోగానే కాంట్రాక్టర్లను పిలిచి ఇకపై చికెన్‌వ్యర్థాలు వందశాతం కాపులుప్పాడ డంపింగ్‌యార్డుకు వెళ్లాల్సిందేనని, లేదంటే నిరంతర నిఘాపెట్టి చేపలచెరువులకు తరలించేవారిపై కఠినచర్యలు తీసుకుంటానని బెదిరించారు. ఆ సమయంలో సదరు అధికారి అంతర్గత ఉద్దేశాన్ని గుర్తించిన కొందరు కాంట్రాక్టర్లు ప్రసన్నం చేసుకోవడంలో సఫలమయ్యారు. అయితే తనకు లంచం ఇవ్వాల్సిన అవసరం లేదని, ఉన్నతాధికారులకు మాత్రం ఇవ్వాల్సి ఉంటుందంటూ ప్రతి నెలా రూ.ఎనిమిది లక్షలు చొప్పున వసూలుచేస్తున్నట్టు ఆ విభాగం సిబ్బందే ఆరోపిస్తున్నారు. అప్పటి నుంచి చికెన్‌ వ్యర్థాలను చేపల చెరువులకు తరలిస్తున్నా పట్టించుకోవడం లేదని, పైగా వార్డు శానిటేషన్‌ సెక్రటరీలను వాటిజోలికి వెళ్లవద్దని ఆదేశించినట్టు సిబ్బంది చెబుతున్నారు. ప్రజారోగ్య విభాగంలోని సదరు అధికారి వ్యవహారశైలిపై పెద్దఎత్తున చర్చ జరుగుతున్నా ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదంటున్నారు. దీనిపై కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ దృష్టిసారించి చికెన్‌ వ్యర్థాలను కాపులుప్పాడలోని డంపింగ్‌యార్డుకు తరలించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Updated Date - Aug 17 , 2026 | 12:30 AM