Share News

స్వచ్ఛ సర్వేక్షణ్‌కు జీవీఎంసీ సమాయత్తం

ABN , Publish Date - Apr 29 , 2026 | 01:02 AM

స్వచ్ఛ సర్వేక్షణ్‌-2026కు జీవీఎంసీ సమాయత్తమవుతోంది.

స్వచ్ఛ సర్వేక్షణ్‌కు జీవీఎంసీ సమాయత్తం

సిటిజన్‌ ఫీడ్‌ బ్యాక్‌పై నగరవాసులకు అవగాహన

సచివాలయ సిబ్బందితో ప్రత్యేక ప్రచారం

సర్వేలో ప్రశ్నలపై ముందుగానే అవగాహన

మెరుగైన మార్కుల సాధనే ధ్యేయం

విశాఖపట్నం, ఏప్రిల్‌ 28 (ఆంధ్రజ్యోతి):

స్వచ్ఛ సర్వేక్షణ్‌-2026కు జీవీఎంసీ సమాయత్తమవుతోంది. పట్టణాల్లో పారిశుధ్యం మెరుగుపరచడంతోపాటు ప్రజల్లో పరిశుభ్రతపై చైతన్యం పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ సర్వేక్షణ్‌ పేరుతో 2016 నుంచి పోటీ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. 2016లో 73 నగరాలు పోటీలో పాల్గొనగా, 2025 నాటికి ఆ సంఖ్య 4,589కి చేరింది. 2026 స్వచ్ఛసర్వేక్షణ్‌ పోటీలో 4,600 నగరాలు పాల్గొంటున్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ నగరాలను జనాభా ఆధారంగా ఐదు కేటగిరీలుగా విభజించి పోటీ నిర్వహించనున్నారు.

క్షేత్రస్థాయిలో పారిశుధ్య నిర్వహణతో పాటు స్థానిక సంస్థ పనితీరుపై ప్రజాభిప్రాయానికి 10,500 మార్కులు, గార్బేజ్‌ ఫ్రీసిటీ సర్టిఫికెట్‌కు వెయ్యి మార్కులు, బహిరంగ మలమూత్ర విసర్జన రహిత నగరం, మురుగునీటి శుద్ధి వంటి సర్టిఫికెట్లకు మరో వెయ్యి మార్కుల చొప్పున కేటాయించారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ప్రజాభిప్రాయానికి పెద్దపీట వేయడంతో వచ్చే నెలలో ఏ క్షణంలోనైనా ఢిల్లీ నుంచి కేంద్ర ప్రభుత్వం నియమించిన బృందం నగరానికి వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జీవీఎంసీ అధికారులు అప్రమత్తమతయ్యారు. కేంద్ర కమిటీ ప్రజల వద్దకు వెళ్లి ఇంటింటి నుంచి ప్రతిరోజూ చెత్తసేకరణ జరుగుతోందా?, తడి-పొడి చెత్త విభజన చేపడుతున్నారా?, పారిశుధ్యానికి సంబంధించి ఫిర్యాదు చేస్తే జీవీఎంసీ సకాలంలో స్పందిస్తోందా?, వాణిజ్య ప్రాంతాలు, దుకాణాల నుంచి చెత్తసేకరణ జరుగుతోందా?, మార్కెట్లు, కూడళ్లలో పరిశుభ్రత ఉందా?...వంటి 12 అంశాలపై ప్రశ్నలు సంధిస్తుంది. వాటిపై ప్రజలకు అవగాహన కల్పించి, స్వచ్ఛసర్వేక్షణ్‌లో జీవీఎంసీకి మంచి ర్యాంకు వచ్చేలా అధికారులు చర్యలు ప్రారంభించారు. వార్డు సచివాలయ సిబ్బందితోపాటు క్లాప్‌ వాహనాల అనౌన్స్‌మెంట్‌ ద్వారా స్వచ్ఛ సర్వేక్షణ్‌లో అడిగే ప్రశ్నలను ప్రచారం చేస్తున్నారు. ఫీడ్‌బ్యాక్‌లో మెరుగైన మార్కులు సాధించగలిగితే పది లక్షలు జనాభా దాటిన నగరాల కేటగిరీలో జీవీఎంసీకి అత్యుత్తమ ర్యాంకు లభిస్తుంది.


పెట్రోల్‌, డీజిల్‌ పుష్కలం

కొరత వదంతులు నమ్మొద్దు

అవసరం మేరకే కొనుగోలు చేయాలి

కలెక్టర్‌ అభిషిక్త్‌ కిశోర్‌

విశాఖపట్నం, ఏప్రిల్‌ 28 (ఆంధ్రజ్యోతి):

జిల్లాలో పెట్రోల్‌, డీజిల్‌కు కొరత లేదని, వినియోగదారులకు సరిపడా ఇంధన నిల్వలున్నాయని కలెక్టర్‌ ఎం.అభిషిక్త్‌ కిశోర్‌ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో 120 పెట్రోల్‌, 118 డీజిల్‌ బంకులకు హెచ్‌పీపీఎల్‌, బీపీసీ, ఐవోసీ మార్కెటింగ్‌ విభాగాల ద్వారా ఇంధనం సరఫరా జరుగుతుందన్నారు. కొరత ఉందనే ప్రచారంతో వినియోగదారులు అవసరానికి మించి ఇంధనం కొనుగోలు చేయడంతో బంకుల వద్ద తాత్కాలిక రద్దీ ఏర్పడిందన్నారు. కొన్నిచోట్ల ఉదయం పూట తాత్కాలికంగా నిల్వలు తగ్గినప్పటికీ వెంటనే అందుబాటులో ఉంచామన్నారు. మంగళవారం సాయంత్రానికి జిల్లాలో 2,200 కిలోలీటర్ల పెట్రోల్‌, 2,677 కిలోలీటర్ల డీజిల్‌ నిల్వలు ఉన్నాయన్నారు. వాహనదారులు ఆందోళన చెందవద్దన్నారు. అవసరమైన మేరకు మాత్రమే ఇంధనం కొనుగోలుచేయాలని విజ్ఞప్తిచేశారు. ఇంధనం సరఫరాపై నిరంతరం సమీక్షించడానికి కలెక్టరేట్‌లో 0891-2590100, 0891-2590102నంబర్లతో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటుచేశామన్నారు. రెవెన్యూ, పౌరసరఫరాలు, పోలీసులు ప్రతి బంకుల వద్ద పర్యవేక్షణ చేస్తున్నారని వెల్లడించారు.

Updated Date - Apr 29 , 2026 | 01:02 AM