Share News

ఏసీబీ వలలో జీవీఎంసీ ఉద్యోగి

ABN , Publish Date - Jun 20 , 2026 | 01:04 AM

గ్రాట్యుటీ మంజూరుకు సంబంధించిన ఫైల్‌ను ప్రాసెస్‌ చేసేందుకు లంచం తీసుకుంటూ విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) జూనియర్‌ అసిస్టెంట్‌ శుక్రవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు.

ఏసీబీ వలలో జీవీఎంసీ ఉద్యోగి

చనిపోయిన ఉద్యోగి గ్రాట్యుటీ ఫైల్‌ను ప్రాసెస్‌ చేయడానికి రూ.30 వేలు డిమాండ్‌

విశాఖపట్నం, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి):

గ్రాట్యుటీ మంజూరుకు సంబంధించిన ఫైల్‌ను ప్రాసెస్‌ చేసేందుకు లంచం తీసుకుంటూ విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) జూనియర్‌ అసిస్టెంట్‌ శుక్రవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. వివరాలిలా ఉన్నాయి. పెందుర్తికి చెందిన అప్పలనారాయణ జీవీఎంసీలో పనిచేస్తూ అనారోగ్యంతో 2023 అక్టోబరులో మృతిచెందారు. ఆయనకు గ్రాట్యుటీ, తదితరాలు కలిపి సుమారు రూ.30 లక్షల వరకు రావలసి ఉంది. ఈ విషయంపై ఆయన భార్య అనేకమార్లు ఎన్‌ఏడీ జంక్షన్‌ సమీపంలోని గౌరీనగర్‌లో ఉన్న జీవీఎంసీ జోనల్‌ (పశ్చిమ) కార్యాలయానికి వెళ్లారు. ఆయా ఫైల్స్‌ను పైకి పంపాలంటే తనకు రూ.50 వేలు ఇవ్వాలని జూనియర్‌ అసిస్టెంట్‌ ఎం.శ్రీను డిమాండ్‌ చేశాడు. రూ.30 వేలకు బేరం కుదిరింది. లంచం ఇవ్వకూడదనే ఉద్దేశంతో ఆమె రెండు రోజుల కిందట ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటలకు జోనల్‌ కార్యాలయంలో అప్పలనారాయణ భార్య వద్ద శ్రీను 30 వేల రూపాయలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఏసీబీ అడిషనల్‌ డీఎస్‌పీ పి.హర్షిత మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచాలు అడిగితే 1064కు లేదా నేరుగా ఫిర్యాదు చేయవచ్చునన్నారు. డీఎస్పీ బి.వి.ఎస్‌.ఎస్‌.మూర్తి మాట్లాడుతూ శ్రీనుపై కేసు నమోదు చేశామని, శనివారం ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తామన్నారు. ఈ దాడిలో సి.ఐ.లు వెంకట్రావు, శ్రీనివాసరావు, లక్ష్మణరావు, సుప్రియ, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jun 20 , 2026 | 01:04 AM