1న జీవీఎంసీ ఎన్నిక
ABN , Publish Date - Oct 23 , 2026 | 01:21 AM
జీవీఎంసీ ఎన్నికల తేదీ మారింది. ఈ నెల 28న పోలింగ్ జరగాల్సి ఉండగా, వచ్చే నెల ఒకటో తేదీకి నిర్వహించాలని ఎన్నికల కమిషన్ గురువారం ఉత్తర్వులు జారీచేసింది.
మూడో తేదీన ఓట్ల లెక్కింపు
పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా 25న వెల్లడి
విశాఖపట్నం, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి):
జీవీఎంసీ ఎన్నికల తేదీ మారింది. ఈ నెల 28న పోలింగ్ జరగాల్సి ఉండగా, వచ్చే నెల ఒకటో తేదీకి నిర్వహించాలని ఎన్నికల కమిషన్ గురువారం ఉత్తర్వులు జారీచేసింది. జీవీఎంసీతోపాటు రాష్ట్రవ్యాప్తంగా వంద పట్టణ స్థానిక సంస్థలకు ఈనెల 28న పోలింగ్ జరిపేందుకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీచేసిన విషయం తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం ఇప్పటికే నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియలు పూర్తయ్యాయి. ఈనెల 21న పోటీలో నిలిచిన అభ్యర్థుల జాబితాను వెల్లడించి, ఆ మేరకు బ్యాలెట్ పేపర్లు ముద్రించేందుకు అధికారులు సమాయత్తమవుతుండగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల ప్రక్రియను తాత్కాలికంగా నిలుపుదల చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఆదేశాలు జారీచేశారు. పోటీలో నిలిచిన అభ్యర్థుల వివరాలను కూడా వెల్లడించవద్దని స్పష్టంచేశారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన పనులు నిలుపుదల చేయాలని ఆదేశించారు. కాగా నిలిచిపోయిన ఎన్నికల ప్రక్రియను 25 నుంచి తిరిగి ప్రారంభించాలని, నవంబరు ఒకటిన పోలింగ్, మూడున ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి చేపట్టాలని ఆదేశిస్తూ అన్ని జిల్లాల కలెక్టర్లకు గురువారం రాత్రి ఉత్తర్వులు జారీచేశారు. ఈ మేరకు జీవీఎంసీ ఎన్నికల బరిలో నిలిచినవారి వివరాలను 25వ తేదీన ప్రకటించనున్నారు. నవంబరు ఒకటో తేదీన పోలింగ్ నిర్వహిస్తారు. మూడున ఓట్ల లెక్కింపు చేపడతారు. ఇదిలావుండగా జీవీఎంసీ ఎన్నికల్లో మేయర్, కార్పొరేటర్ పదవులకు పోటీ చేస్తున్న అభ్యర్థులు మాత్రం తమ ప్రచారాన్ని కొనసాగించారు.
జడ్పీటీసీ అభ్యర్థులపై ఉత్కంఠ
ఇంకా ఖరారు చేయని కూటమి
నామినేషన్ల దాఖలుకు నేటితో ముగియనున్న గడువు
నాలుగు స్థానాల్లోనూ టీడీపీయే పోటీ?
నేడు పేర్లు ప్రకటించే అవకాశం
విశాఖపట్నం, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి):
జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్ల దాఖలు గడువు శుక్రవారంతో ముగియనున్నది. అయితే కూటమి నుంచి ఇప్పటివరకూ అభ్యర్థులను ప్రకటించలేదు. జిల్లాలో గల నాలుగు (భీమిలి, పద్మనాభం, ఆనందపురం, పెందుర్తి) జడ్పీటీసీ స్థానాల్లో మూడు భీమిలి నియోజకవర్గంలో ఉన్నాయి. ఆ మూడు స్థానాలకు అభ్యర్థులను ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఖరారు చేయాల్సి ఉంది. అదే సమయంలో జడ్పీ చైర్మన్ అభ్యర్థి ఎంపిక కూడా ఆయన నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.
భీమిలి నియోజకవర్గంలో గల మూడు జడ్పీటీసీ స్థానాల నుంచి టీడీపీ అభ్యర్థులే బరిలో ఉంటారని చెబుతున్నారు. ఎంపీటీసీ స్థానాల్లో కొన్నింటిని జనసేనకు ఇచ్చే అవకాశం ఉంది. జడ్పీటీసీ పదవులకు టీడీపీలో భారీ పోటీ ఉంది. ఎవరికి వారు తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు రోజులపాటు టీడీపీ అధిష్ఠానం ఐవీఆర్‌ఎస్ ద్వారా అభిప్రాయ సేకరణ చేపట్టింది. జడ్పీ చైర్మన్ పదవిని బీసీ జనరల్‌కు కేటాయించడంతో దాదాపు నాలుగు మండలాల నుంచి గెలవనున్న అభ్యర్థులు రేస్‌లో ఉంటారని ప్రచారం సాగుతుంది. కాగా జడ్పీటీసీ అభ్యర్థులకు బీ ఫారాలు పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు చోడే వెంకట పట్టాభి అందజేయనున్నారు. ఈ నేపథ్యంలో గురువారం భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఇంటి వద్ద పట్టాభితో కలిసి ఇన్‌చార్జి మంత్రి డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి సమావేశం నిర్వహించారు. నామినేషన్లకు శుక్రవారం గడువు ముగియనున్నందున అభ్యర్థుల ఎంపిక పూర్తి చేయాలని మంత్రి సూచించారు. చైర్మన్ అభ్యర్థి ఎంపికపై కూడా సమావేశంలో చర్చించారు.
భారీగా నామినేషన్లు
జడ్పీటీసీ స్థానాలకు 13,
ఎంపీటీసీ స్థానాలకు 138 దాఖలు
నేడు ఆఖరి రోజు
విశాఖపట్నం, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు గురువారం భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. దీంతో జడ్పీ, మండల పరిషత్ కార్యాలయాల వద్ద సందడి నెలకొంది. గురువారం జడ్పీటీసీ పదవులకు టీడీపీ నుంచి ఆరు, వైసీపీ నుంచి ఏడు, జనసేన నుంచి మూడు...మొత్తం 13 నామినేషన్లు దాఖలయ్యాయి. దీంతో ఇప్పటివరకూ దాఖలైన నామినేషన్ల సంఖ్య 16కు చేరింది. అలాగే ఎంపీటీసీ పదవులకు గురువారం 138 నామినేషన్లు దాఖలయ్యాయి. రెండు రోజుల్లో దాఖలైన నామినేషన్ల సంఖ్య 157కు చేరింది. గురువారం ఆనందపురం మండలంలో 47 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో టీడీపీ నుంచి 19 మంది, వైసీపీ నుంచి 16 మంది, జనసేన నుంచి ఆరుగురు, బీజేపీ నుంచి నలుగురు, ఇండిపెండెంట్లు నలుగురు ఉన్నారు. భీమిలిమండలంలో 15 నామినేషన్లు దాఖలు కాగా వాటిలో టీడీపీ నుంచి తొమ్మిది మంది, వైసీపీ నుంచి ఐదుగురు, జనసేన నుంచి నలుగురు ఉన్నారు. పద్మనాభం మండలంలో గురువారం 52 మంది నామినేషన్లు దాఖలు చేశారు. వారిలో వైసీపీ నుంచి 29 మంది, టీడీపీ నుంచి 25, జనసేన నుంచి ఐదుగురు, బీజేపీ నుంచి ముగ్గురు ఉన్నారు. పెందుర్తి మండలంలో 24 మంది నామినేషన్లు దాఖలు చేయగా వారిలో వైసీపీ నుంచి 10, టీడీపీ నుంచి ఏడుగురు, జనసేన నుంచి తొమ్మిది మంది, కాంగ్రెస్, ఇండిపెండెంట్‌ల నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. నామినేషన్లు దాఖలకు శుక్రవారంతో ఆఖరి రోజు కావడంతో భారీగా అభ్యర్థులు నామినేషన్లు వేయనున్నారు.