Share News

జీవీఎంసీ ఎన్నికలు అత్యంత కీలకం

ABN , Publish Date - Sep 20 , 2026 | 01:08 AM

జీవీఎంసీ ఎన్నికలు అత్యంత కీలకమైనవని, అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకొనే అభ్యర్థులను ఎంపిక చేస్తామని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) అధ్యక్షుడు, పౌర సరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్‌ అన్నారు.

జీవీఎంసీ ఎన్నికలు అత్యంత కీలకం

అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని అభ్యర్థుల ఎంపిక

అధినేత చూపించిన మార్గమే అనుసరణీయం

అపోహలకు అవకాశం ఇవ్వవద్దు

కూటమి స్ఫూర్తిని నిలిపేలా నడుచుకోవాలి

జనసేన ఆత్మీయ సమావేశంలో పార్టీ పీఏసీ చైర్మన్‌, మంత్రి నాదెండ్ల మనోహర్‌

విశాఖపట్నం, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి):

జీవీఎంసీ ఎన్నికలు అత్యంత కీలకమైనవని, అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకొనే అభ్యర్థులను ఎంపిక చేస్తామని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) అధ్యక్షుడు, పౌర సరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్‌ అన్నారు. అక్కయ్యపాలెంలోని సాగరమాల కన్వెన్షన్‌ సెంటర్‌లో శనివారం నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ శనివారం నుంచి మళ్లీ పూర్తిగా విధులకు హాజరవుతున్నారని చెప్పారు. ఆయన మాటే అందరికీ శిరోధార్యమని, ఆయన చూపిన మార్గంలోనే నడవాలని సూచించారు. సోషల్‌ మీడియాలో అపోహలకు తావిచ్చేలా ఎటువంటి పోస్టులు పెట్టవద్దని సూచించారు. జీవీఎంసీ ఎన్నికల్లో బలాబలాలు అంచనా వేసుకొని, ఆపై రంగంలో దిగి 100 శాతం స్ట్రైక్‌ రేటు సాధించాలని ఉద్బోధించారు.

విశాఖపట్నం స్టీల్‌ ప్లాంటు ప్రైవేటీకరణ జరగకుండా ఆపింది పవన్‌కల్యాణేనని, నాడు అధికారంలో లేకపోయినా ఢిల్లీలో హోం మంత్రి అమిత్‌షాను కలిసి పరిస్థితి వివరించారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ సిద్ధాంతాలు, విధానాలు 50 శాతం ఓట్లు తెస్తే, మిగిలిన 50 శాతం ఓట్లు అభ్యర్థి వ్యక్తిగత ఇమేజ్‌పై ఆధారపడి ఉంటాయన్నారు. అన్నీ బేరీజు వేసి అభ్యర్థులను ప్రకటిస్తామని, ఆ తరువాత అంతా కలిసి పార్టీ విజయానికి కృషి చేయాలని సూచించారు. అంతా గోవిందమ్మను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. నోవాటెల్‌ హోటల్‌లో పవన్‌కల్యాణ్‌ను పోలీసులు నిర్బంధిస్తే ఆమె అర్ధరాత్రి చంటిబిడ్డతో కలిసి రోడ్డుపై ధర్నా చేశారని, అటువంటి పోరాట పటిమ ఉండాలన్నారు. ఇప్పటివరకూ ఎవరికీ ఏ సీట్లు ఖరారు కాలేదని, సోషల్‌ మీడియాలో పోస్టులు నమ్మవద్దని హెచ్చరించారు. ఈ సమావేశానికి పార్టీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు, పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు అధ్యక్షత వహించగా, విశాఖ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్‌, ఎమ్మెల్యేలు లోకం మాధవి, నిమ్మక జయకృష్ణ, ఎంఎస్‌ఎంఈ కార్పొరేషన్‌ చైర్మన్‌ టి.శివశంకర్‌, ఉత్తర నియోజకవర్గం ఇన్‌చార్జి ఉషాకిరణ్‌, జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.

Updated Date - Sep 20 , 2026 | 01:08 AM