రూ.4 వేల కోట్లతో జీవీఎంసీ బడ్జెట్
ABN , Publish Date - Jan 09 , 2026 | 01:12 AM
మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) అధికారులు 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.నాలుగు వేల కోట్లతో బడ్జెట్‌ను రూపొందించారు.
అన్ని మార్గాల ద్వారా రూ.2 వేల కోట్లు ఆదాయం వస్తుందని అంచనా
అంతకు రెట్టింపు ఖర్చు చేసేలా తయారీ
12న స్టాండింగ్ కమిటీ ముందుకు ముసాయిదా
విశాఖపట్నం, జనవరి 8 (ఆంధ్రజ్యోతి):
మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) అధికారులు 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.నాలుగు వేల కోట్లతో బడ్జెట్‌ను రూపొందించారు. దీనిపై చర్చించేందుకు మేయర్ పీలా శ్రీనివాసరావు అధ్యక్షతన స్టాండింగ్ కమిటీ ఈనెల 12న సమావేశం కానున్నది.
బడ్జెట్ ముసాయిదా జీవీఎంసీ ఆదాయ, వ్యయాలకు దగ్గరగా ఉండేలా రూపొందించాలని, ఎక్కువ అంచనాలను చేర్చి భారీ బడ్జెట్‌ను తయారుచేయడం సరికాదని ఫైనాన్స్ విభాగం అధికారులకు కమిషనర్ కేతన్‌గార్గ్ సూచించారు. దీంతో అధికారులు జీవీఎంసీకి వార్షిక ఆదాయం అన్ని మార్గాల ద్వారా రూ.1,500 కోట్లు వరకు వస్తుంది కాబట్టి, రూ.మూడు వేల కోట్లు ఖర్చుపెట్టేలా బడ్జెట్ ముసాయిదాను తయారుచేశారు. అదే సమయంలో బడ్జెట్‌ను తక్కువగా చూపించడం వల్ల భవిష్యత్తులో వివిధ హెడ్‌లకు కేటాయింపులు, రుణాలు, కేంద్ర ప్రభుత్వ గ్రాంట్లు పొందేందుకు ఇబ్బందిగా మారుతుందని కమిషనర్‌కు అధికారులు వివరించారు. దీంతో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే అవకాశం ఉన్న గ్రాంట్లు, పథకాలను గుర్తించి ఆ మేరకు బడ్జెట్‌లో చేర్చాలని కమిషనర్ చెప్పారు. జీవీఎంసీకి వివిధ మార్గాల ద్వారా వచ్చే ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.రెండు వేల కోట్ల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉందని, ఆ మొత్తానికి రెట్టింపు ఖర్చు చేసేందుకు అవకాశం ఉంటుందనే అంచనాలతో బడ్జెట్ ముసాయిదాను రూ.నాలుగు వేల కోట్ల అంచనాతో రూపొందించారు. దీనిని తుది మెరుగుల కోసం కమిషనర్‌కు పంపించారు. కమిషనర్ సంతృప్తి చెందితే ఈనెల 12న జరిగే స్టాండింగ్ కమిటీ ఆమోదానికి ముసాయిదాను పంపిస్తారు. ఒకవేళ మార్పులు, చేర్పులు సూచిస్తే, ఆ మేరకు చేసి స్టాండింగ్ కమిటీ ముందు పెడతారు. 2024-25 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌తో పోల్చితే తాజా బడ్జెట్ దాదాపు రూ.600 కోట్లు తక్కువ కావడం విశేషం.
నేడు డీఆర్సీ
అజెండాలో తొమ్మిది అంశాలు
ప్రధానంగా స్థలాల క్రమబద్ధీకరణతో పాటు వీఎంఆర్డీఏ, జీవీఎంసీ ప్రాజెక్టులపై చర్చ
టిడ్కో, హుద్‌హుద్ ఇళ్లు అప్పగింత, శివారు ప్రాంతాల్లో పేదల కోసం నిర్మిస్తున్న ఇళ్ల పురోగతిని ప్రస్తావించనున్న ఎమ్మెల్యేలు
విశాఖపట్నం, జనవరి 8 (ఆంధ్రజ్యోతి):
జిల్లా సమీక్షా సమావేశం శుక్రవారం ఉదయం ఇన్‌చార్జి మంత్రి డాక్టర్ డోల శ్రీబాలవీరాంజనేయస్వామి అధ్యక్షతన కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జరగనున్నది. తొమ్మిది అంశాలతో రూపొందించిన అజెండాపై సమావేశంలో చర్చించనున్నారు. వైద్య ఆరోగ్య, రెవెన్యూ, సంక్షేమం, విద్య, పంచాయతీరాజ్, పౌర సరఫరాలు, గృహ నిర్మాణ శాఖలు, వీఎంఆర్‌డీఎ, జీవీఎంసీకు సంబంధించిన అంశాలను అజెండాలో చేర్చారు.
సమావేశంలో తొలుత గతసారి చర్చించిన అంశాలపై తీసుకున్న చర్యల గురించి చర్చించనున్నారు. ఆ తరువాత అజెండాలో పేర్కొన్న అంశాలపై చర్చ జరుగుతుంది. రెవెన్యూ శాఖ పరిధిలో స్థలాల క్రమబద్ధీకరణపై ప్రధానంగా చర్చ జరగనున్నది. క్రమబద్ధీకరణకు ప్రభుత్వం 2024లో జారీచేసిన జీవో గడువు 2025 డిసెంబరు నెలాఖరుతో ముగిసింది. మరోసారి గడువు పొడిగించాలని కోరుతూ సమావేశం తీర్మానించనున్నది. అలాగే జీవీఎంసీ, వీఎంఆర్డీ చేపడుతున్న ప్రాజెక్టులపై పలువురు శాసనసభ్యులు కొంత అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ రెండు సంస్థలు చేపడుతున్న పథకాలు వేగంగా పూర్తిచేసేలా అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. హౌసింగ్‌లో ప్రధానంగా టిడ్కో, హుద్‌హుద్ ఇళ్లు అప్పగింత, బినామీ లబ్ధిదారులపై చర్యలు, శివారు ప్రాంతాల్లో పేదల కోసం నిర్మిస్తున్న ఇళ్ల పురోగతిపై చర్చ జరగనున్నది.
పూర్తి సమాచారంతో సిద్ధంకండి: కలెక్టర్
అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై గత డీఆర్సీ సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలపై కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిరప్రసాద్ గురువారం సమీక్షించారు. అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ శుక్రవారం జిల్లా సమీక్షా సమావేశం జరగనున్నదని, అందువల్ల ఆయా శాఖలకు సంబంధించి పూర్తి సమాచారంతో సిద్ధంగా ఉండాలన్నారు. భూముల క్రమబద్ధీకరణ జీవో అమలు గురించి అడిగి తెలుసుకున్నారు. వీఎంఆర్‌డీ, జీవీఎంసీ, రెవెన్యూ శాఖ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులు, అమలవుతున్న పథకాల తాజా స్థితిగతులపై సమీక్షించారు. సమీక్షలో జేసీ కె.మయూర్ అశోక్, ఆర్డీవోలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
చలికి గజగజ
పగటి పూట చల్లని వాతావరణం
అక్కిరెడ్డిపాలెంలో 12.1 డిగ్రీలు
విశాఖపట్నం, జనవరి 8 (ఆంధ్రజ్యోతి):
నగరంలో గడచిన రెండు రోజులుగా చలి గాలులు వీస్తున్నాయి. బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర వాయుగుండం దిశగా గాలులు పయనించడంతో చలి తీవ్రత పెరిగింది. పగటిపూట కూడా ఎండ పెద్దగా లేకపోవడంతో చలి ప్రభావం కొనసాగుతోంది. శివారు ప్రాంతాలైన పెందుర్తి, మధురవాడ, కొమ్మాది, సింహాచలం, అడవివరం, దువ్వాడ, ఆరందపురం, పద్మనాభం వంటి ప్రాంతాల్లో చలికి ప్రజలు వణుకుతున్నారు. గురువారం పెందుర్తి సమీపాన గల అక్కిరెడ్డిపాలెంలో 12.1 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. పద్మనాభంలో 14.9, సింహాచలంలో 15.9, ఎయిర్‌పోర్టులో 16.4 డిగ్రీలు నమోదయ్యాయి. శుక్రవారం నగరం, పరిసరాల్లో చలి కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది.