జీవీఎంసీ బడ్జెట్ రేపు
ABN , Publish Date - Feb 03 , 2026 | 01:21 AM
మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) 2026-27 బడ్జెట్ సమావేశం బుధవారం నిర్వహించనున్నట్టు కార్యదర్శి బీవీ రమణ తెలిపారు.
రూ.4,047.12 కోట్లతో ముసాయిదా
ఇప్పటికే స్టాండింగ్ కమిటీ ఆమోదం
వైసీపీ సభ్యుల హాజరుపై అనుమానం
విశాఖపట్నం, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి):
మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) 2026-27 బడ్జెట్ సమావేశం బుధవారం నిర్వహించనున్నట్టు కార్యదర్శి బీవీ రమణ తెలిపారు. మేయర్ పీలా శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కేవలం బడ్జెట్‌పై మాత్రమే చర్చ ఉంటుందన్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ.4,047.12 కోట్ల ముసాయిదా బడ్జెట్‌ను జీవీఎంసీ కమిషనర్‌తోపాటు స్టాండింగ్ కమిటీ ఇప్పటికే ఆమోదించిన విషయం తెలిసిందే.
జీవీఎంసీకి ఆస్తి పన్ను ద్వారా రూ.550 కోట్లు, ఖాళీ స్థలాల పన్ను ద్వారా రూ.85 కోట్లు, స్థిరాస్తుల బదలాయింపు ద్వారా రూ.200 కోట్లు, మార్కెట్‌లు, షాపింగ్ కాంప్లెక్స్‌ల వేలం ద్వారా రూ.4.8 కోట్లు, క్రీడా మైదానాలు, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు, ఫంక్షన్ హాల్స్ అద్దెల ద్వారా రూ.65 లక్షలు మొత్తం సాధారణ పరిపాలన ద్వారా రూ.123.26 కోట్లు ఆదాయం సమకూరుతుందని ముసాయిదాలో పొందుపరిచారు. అలాగే ఇంజనీరింగ్ నుంచి రూ.264.56 కోట్లు, ప్రాజెక్టుల కోసం రూ.550 కోట్లు, టౌన్‌ప్లానింగ్ ద్వారా రూ.543 కోట్లు, పార్కులు, లీజర్స్ ద్వారా రూ.30 కోట్లు, అమృత్ ద్వారా రూ.162 కోట్లు, డిపాజిట్లు, అడ్వాన్సుల ద్వారా రూ.382.79 కోట్లు మొత్తం మరో 3,814.41 కోట్లు ఆదాయం సమకూరుతుందని అంచనా వేశారు. ఇదిలావుండగా రోడ్లు, భవనాలు, డ్రైన్లు, కల్వర్టుల నిర్మాణం కోసం ఇంజనీరింగ్ విభాగం ద్వారా రూ.1018.18 కోట్లు, ప్రజారోగ్య విభాగానికి రూ.455.94 కోట్లు ఖర్చు చేయాలని అంచనా వేశారు. సాధారణ పరిపాలనా విభాగాలకు రూ.375.82 కోట్లు, నీటి సరఫరాకు రూ.260.08 కోట్లు, విద్యుత్ దీపాలకు రూ.12.91 కోట్లు, ప్రాజెక్టులకు రూ.67.35 కోట్లు, టౌన్‌ప్లానింగ్‌కు రూ.23.93 కోట్లు, యూసీడీకి రూ.16.43 కోట్లు, విద్యకు రూ.2.25 కోట్లు, పార్కులు, లీజర్స్, సెమిట్రీలకు రూ.36.14 కోట్లు మొత్తం రూ.4,047.12 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని ముసాయిదాలో పొందుపరిచారు. ఈ ముసాయిదాను ఇప్పటికే కమిషనర్, స్టాండింగ్ కమిటీ ఆమోదించడంతో కౌన్సిల్ ఆమోదానికి వచ్చింది. దీనిపై బుధవారం మేయర్ అధ్యక్షతన జరిగే సమావేశంలో చర్చించి సభ్యుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ఆమోదించి రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తారు.
అయితే బడ్జెట్ సమావేశానికి వైసీపీ కార్పొరేటర్ల హాజరు కావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈనెల 30న జరిగిన కౌన్సిల్ సమావేశంలో వైసీపీ, కూటమి కార్పొరేటర్లు బాహాబాహీకి దిగడంతో ఇరువర్గాలకు చెందిన పలువురు గాయపడ్డారు. తమ అభిప్రాయాలను పట్టించుకోకుండా మేయర్ పీలా శ్రీనివాసరావు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ వైసీపీ కార్పొరేటర్లు ఆరోపించారు. బడ్జెట్ సమావేశానికి హాజరవ్వడంపై మంగళవారం తమ పార్టీ నేతలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆ పార్టీ కార్పొరేటర్లు చెబుతున్నారు.