జీవీఎంసీ బడ్జెట్ 4,047.12 కోట్లు
ABN , Publish Date - Feb 05 , 2026 | 01:26 AM
మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ.4,047.12 కోట్ల బడ్జెట్‌ను ఏకగ్రీవంగా ఆమోదించింది.
ఆమోదించిన కౌన్సిల్
ఆదాయం రూ.3,814.41 కోట్లు
వస్తుందని అంచనా
కేటాయింపుల్లో ఇంజనీరింగ్ విభాగానికి పెద్దపీట
అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు రూ.1028.18 కోట్లు
ప్రజారోగ్యానికి రూ.455.94 కోట్లు
అర్బన్ ఛాలెంజింగ్ ప్రాజెక్టులకు రూ.650 కోట్లు
సాధారణ పరిపాలనకు రూ.365.82 కోట్లు
నీటి సరఫరాకు రూ.260.08 కోట్లు
విద్యుత్ విభాగానికి రూ.129.19 కోట్లు
విశాఖపట్నం, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి):
మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ.4,047.12 కోట్ల బడ్జెట్‌ను ఏకగ్రీవంగా ఆమోదించింది. బుధవారం మేయర్ పీలా శ్రీనివాసరావు అధ్యక్షతన బడ్జెట్ సమావేశం జరిగింది. సమావేశంలో బడ్జెట్ వివరాలను మేయర్ క్లుప్తంగా సభ్యులకు వివరించగా, చీఫ్ ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ వాసుదేవరెడ్డి ముసాయిదాలో పొందుపరిచిన ఆదాయం, ఖర్చుల అంచనాలను సభ్యులకు చదివి వినిపించారు. 2025 ఏప్రిల్ నుంచి సెప్టెంబరు వరకూ జీవీఎంసీకి వచ్చిన ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుని 2026-27 బడ్జెట్‌ను రూపొందించినట్టు వాసుదేవరెడ్డి పేర్కొన్నారు.
2026-27 ఆర్థిక సంవత్సరంలో ఆస్తి పన్ను ద్వారా రూ.550 కోట్లు, ఖాళీ స్థలాలపై పన్ను ద్వారా రూ.85 కోట్లు, స్థిరాస్తులపై స్టాంపు డ్యూటీ రూపంలో రూ.200 కోట్లు, మార్కెట్‌లు, షాపింగ్ కాంప్లెక్స్‌ల ద్వారా రూ.4.8 కోట్లు, ఫంక్షన్ హాళ్లు, కమ్యూనిటీ హాల్స్ నుంచి రూ.45 లక్షలు, ఆటస్థలాలు, స్విమ్మింగ్‌పూల్స్ నుంచి రూ.80 లక్షలు, ఇతర అద్దెలు రూ.14.5 కోట్లు, స్పాట్ ఫైన్‌ల ద్వారా రూ.80 లక్షలు, ఆస్తి బదలాయింపుపై చార్జీల ద్వారా రూ.పది కోట్లు, అద్దె భవనాల నుంచి రూ.15 కోట్లు, ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రూపేణా రూ.30 కోట్లు, ఆస్తి పన్ను చెల్లింపుపై వడ్డీ రూ.70 కోట్లు, పద్దులో లేని ఇతర ఆదాయం రూ.ఐదు కోట్లు, మూలధనపు జమలు రూ.246 కోట్లు మొత్తం...సాధారణ పరిపాలన నుంచి రూ.1232.6 కోట్లు ఆదాయం వస్తుందని అంచనా వేశారు. ఇక ఖర్చుల విషయానికి వస్తే సాధారణ ఖర్చులకు రూ.4.2 కోట్లు, పరిపాలనాపరమైన అంశాలకు రూ.34.85 కోట్లు, నిర్వహణాపరమైన ఖర్చులకు రూ.2.05 కోట్లు, రుణాలపై వడ్డీలు చెల్లింపునకు రూ.30 కోట్లు, స్థానిక సంస్థల ఎన్నికలు కోసం రూ.2.5 కోట్లు, వేసవి శిక్షణ శిబిరాలకు రూ.1.5 కోట్లు, ఇతర కార్యక్రమాల నిర్వహణకు రూ.1.77 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటుందని అంచనా వేశారు. లైబ్రరీ సెస్సు చెల్లింపునకు రూ.40 కోట్లు, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ కోసం రూ.200 కోట్లు, బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలపై అసలు తీర్చేందుకు రూ.35 కోట్లు, ఇలా మొత్తం సాధారణ పరిపాలన కోసం రూ.365.82 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. అలాగే ఇంజనీరింగ్ విభాగంలో రోడ్ల నిర్వహణ కోసం రూ.80 కోట్లు, రోడ్ల అన్యుటీ కోసం రూ.25 కోట్లు, గుంతలు పూడ్చేందుకు రూ.నాలుగు కోట్లు, వంతెనలు, కల్వర్టుల నిర్మాణానికి రూ.పది కోట్లు, వరదనీటి కాల్వల నిర్మాణానికి రూ.15 కోట్లు, ట్రాఫిక్ సిగ్నల్స్ నిర్వహణకు రూ.1.5 కోట్లు, మురుగునీటి కాలువలు కోసం రూ.15 కోట్లు, ట్రాఫిక్ ఐలాండ్స్, సెంట్రల్ మీడియన్‌ల నిర్వహణ కోసం రూ.31 కోట్లు, పార్కుల అభివృద్ధి కోసం రూ.36.13 కోట్లు, బీచ్‌ల నిర్వహణకు రూ.ఐదు కోట్లు, కమ్యూనిటీ భవనాల నిర్మాణానికి రూ.15 కోట్లు, కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్వహణకు రూ.పది కోట్లు, క్వాలిటీ కంట్రోల్ ఖర్చులకు రూ.ఐదు కోట్లు, ఆటస్థలాలు, స్టేడియాల నిర్వహణకు రూ.13 కోట్లు, మార్కెట్‌లు, షాపింగ్ కాంప్లెక్స్‌ల నిర్వహణకు రూ.11 కోట్లు, భవనాల నిర్వహణకు రూ.14 కోట్లు, కమ్యూనిటీ హాల్స్ నిర్వహణకు రూ.50 కోట్లు, రోడ్ల విస్తరణకు రూ.52 కోట్లు, వరదనీటి కాలువకు రూ.82 కోట్లు, సిమెంట్ రోడ్లకు రూ.92 కోట్లు, బీటీ రోడ్లకు రూ.83 కోట్లు, మరుగునీటి కాలువల నిర్వహణకు రూ.58 కోట్లు, శ్మశాన వాటికలకు రూ.20 కోట్లు, కల్వర్టులకు రూ.18 కోట్లు, అన్నిరకాల గ్రాంట్లు కలిపి ఇంజనీరింగ్ విభాగం ద్వారా రూ.1028.18 కోట్లు ఖర్చు చేయాలని అంచనా వేశారు. విద్యుత్ విభాగం ద్వారా వీధిదీపాలు, విద్యుత్‌స్తంబాలు, కేబుల్స్ ఏర్పాటుకు రూ.129.19 కోట్లు, వివిధ రకాల ప్రాజెక్టుల కోసం రూ.117.35 కోట్లు, టౌన్‌ప్లానింగ్ విభాగానికి రూ.23.93 కోట్లు, యూసీడీ విభాగం ద్వారా రూ.16.43 కోట్లు, విద్య కోసం రూ.2.25 కోట్లు, ప్రజారోగ్యం విభాగం ద్వారా రూ.455.94 కోట్లు, నీటి సరఫరా విభాగం ద్వారా రూ.260.08 కోట్లు, అమృత్ పథకం కోసం రూ.363 కోట్లు, ఇతర నిధులతో చేపట్టే ప్రాజెక్టులకు రూ.58 కోట్లు, ఆర్థిక సంఘం ద్వారా వచ్చే నిధుల నుంచి రూ.200 కోట్లు, అర్బన్ ఛాలెంజింగ్ ఫండ్ రూ.650 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని అంచనా వేశారు. అలాగే 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సవరించిన బడ్జెట్‌ను రూ.3,704.23 కోట్లతో కౌన్సిల్ ఆమోదించింది.