Share News

మాస్కోతో జీవీఎంసీ ఒప్పందం

ABN , Publish Date - Aug 04 , 2026 | 01:32 AM

‘స్మార్ట్‌ సిటీ-సుస్థిర నగరాభివృద్ధి భాగస్వామ్యం’పై రష్యాలోని మాస్కో నగరంతో గ్రేటర్‌ విశాఖపట్నం మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ) ఒప్పందం కుదుర్చుకుంది.

మాస్కోతో జీవీఎంసీ ఒప్పందం

రవాణా, సాంకేతిక అభివృద్ధికి సహకారం

స్మార్ట్‌ సిటీ-సుస్థిర నగరాభివృద్ధికి తోడ్పాటు

విశాఖపట్నం, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి):

‘స్మార్ట్‌ సిటీ-సుస్థిర నగరాభివృద్ధి భాగస్వామ్యం’పై రష్యాలోని మాస్కో నగరంతో గ్రేటర్‌ విశాఖపట్నం మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ) ఒప్పందం కుదుర్చుకుంది. మాస్కో నగరంలో జరుగుతున్న ఐదవ అంతర్జాతీయ రవాణా సదస్సులో ఈ మేరకు మాస్కో డిప్యూటీ మేయర్‌, రవాణా, రహదారుల మౌలిక వసతుల అభివృద్ధి శాఖాధిపతి మక్సిమ్‌ లిక్సుటోవ్‌తో జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ సోమవారం ఒప్పందం కుదుర్చుకున్నారు. విశాఖ ఎకనామిక్‌ రీజియన్‌ (వీఈఆర్‌)లో భాగంగా నగరంలో రవాణా వ్యవస్థను మెరుగుపరచడం, ఏఐ ఆధారిత సిగ్నల్స్‌ ద్వారా ట్రాఫిక్‌ నిర్వహణను స్మార్ట్‌గా తీర్చిదిద్దడం, కాలుష్యం తగ్గించడం, ప్రజలకు డిజిటల్‌ సేవలను సులభతరం చేయడం కోసం జీవీఎంసీ చాలాకాలంగా అధ్యయనాలు, పైలట్‌ ప్రాజెక్టులను నిర్వహిస్తోంది. అయినప్పటికీ కార్యరూపం దాల్చడంలో జాప్యం జరుగుతూ వస్తోంది. తాజాగా మాస్కో నగరంతో ఒప్పందం కుదుర్చుకోవడం వల్ల ఏఐ ఆధారిత ట్రాఫిక్‌ నిర్వహణ, రియల్‌ టైమ్‌ ట్రాఫిక్‌ మానటరింగ్‌కు సంబంధించిన ‘ప్రాజెక్టు సారథి’ని మరింత పక్కాగా అమలుచేయడం, ప్రజా రవాణా పట్ల ప్రజలను ఆకర్షితులను చేయడం, చెత్త సేకరణ మార్గాలు, తీరుతెన్నులను రియల్‌టైమ్‌ మానటరింగ్‌ ద్వారా పర్యవేక్షించడం, వీధి దీపాల నిర్వహణను గాడిలో పెట్టడం, నీటి సరఫరాలో లీకేజీలకు అడ్డుకట్టవేయడం, స్మార్ట్‌ సెన్సార్లు, ట్రాఫిక్‌ సాఫ్ట్‌వేర్‌, డిజిటల్‌ కంట్రోల్‌ సిస్టమ్‌, వివిధ ప్రాంతాల్లో పారిశుధ్యం, డ్రైనేజీల పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి స్మార్ట్‌ సిటీ కింద నిధులు తెచ్చుకోవడం, ప్రైవేటు సంస్థల నుంచి పెట్టుబడులను ఆకర్షించడానికి తాజాగా కుదిరిన ఒప్పందం ఉపయోగపడుతుందని జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఎంపీ శ్రీభరత్‌, మంత్రి పి.నారాయణ ఈ ఒప్పందం చారిత్రాత్మకమని పేర్కొన్నారు. ఈ ఒప్పందం వల్ల నగరంలో బస్సుల సమాచారాన్ని ప్రయాణికులు మొబైల్‌లోనే తెలుసుకోవచ్చునని, తద్వారా స్టాపుల్లో వేచివుండే సమయాన్ని తగ్గించవచ్చునన్నారు. స్మార్ట్‌ పార్కింగ్‌, సైక్లింగ్‌, ఆన్‌లైన్‌ ఫిర్యాదులు, పన్నుల చెల్లింపు సులభతరం అవుతాయన్నారు. నగరంలో ఐటీ, ఎలక్ర్టానిక్స్‌, లాజిస్టిక్స్‌ ఆటోమేషన్‌ రంగాలు అభివృద్ధికి దోహదపడుతుందన్నారు.

Updated Date - Aug 04 , 2026 | 01:32 AM