పాతుకుపోయారు!
ABN , Publish Date - May 30 , 2026 | 12:50 AM
జీవీఎంసీ పరిపాలనా విభాగంలో కొందరు ఉద్యోగులు ఏళ్ల తరబడి ఒకే సీటులో కొనసాగుతున్నారు.
జీవీఎంసీ పరిపాలనా విభాగంలో కొందరు ఏళ్ల తరబడి తిష్ఠ
అది కూడా ఒకే సీటులో...
పదోన్నతులు వచ్చినా అదే సెక్షన్‌లో కొనసాగింపు
ఉన్నతాధికారులను ప్రసన్నం చేసుకోవడం వల్లేనని ప్రచారం
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
జీవీఎంసీ పరిపాలనా విభాగంలో కొందరు ఉద్యోగులు ఏళ్ల తరబడి ఒకే సీటులో కొనసాగుతున్నారు. రెండేళ్లకొకసారి బదిలీ చేయాల్సిన అధికారులు ఎందుకో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఏర్పాటైన కొత్త జోన్‌లకు కూడా అప్పుడే పదోన్నతి పొందిన వారిని బదిలీ చేశారు తప్ప...ఎప్పటి నుంచో తిష్ఠ వేసిన వారిని కదిలించకపోవడం చర్చనీయాంశంగా మారింది.
మినిస్టీరియల్ ఉద్యోగులను కనీసం రెండేళ్లకొకసారి ఒక సీటు నుంచి మరొక సీటుకు బదిలీ చేయాలి. దీనివల్ల అవినీతికి ఆస్కారం లేకుండా చేయడంతోపాటు ప్రజలకు పారదర్శకంగా సేవలు అందించడానికి అవకాశం ఉంటుంది. కానీ జీవీఎంసీలో కొందరు ఉద్యోగులు పైఅధికారులను ప్రసన్నం చేసుకుని ఏళ్ల తరబడి తమకు అనుకూలమైన విభాగంలో తిష్ఠ వేసుకుని ఉండిపోతున్నారు. ఎన్ని పదోన్నతులు వచ్చినా సరే...అదనపు ఆదాయం వచ్చే విభాగం/సీటును వదలకుండా పట్టుకుని వేలాడుతున్నారు. ఉన్నతాధికారులు సైతం వారికి అండగా నిలుస్తున్నారు. జీవీఎంసీలో మజ్దూర్‌గా ఉద్యోగంలో చేరిన ఒకరు 2013లో ప్రధాన కార్యాలయంలోని పరిపాలనా విభాగానికి బదిలీపై వచ్చారు. అక్కడే టైపిస్టుగా, తర్వాత సీనియర్ అసిస్టెంట్‌గా పదోన్నతి పొందారు. గత పదమూడేళ్లుగా సదరు ఉద్యోగి అదే విభాగంలో పనిచేస్తున్నారు. ప్రస్తుతం పరిపాలనా విభాగంలో సూపరింటెండెంట్ ఉన్న ఒకరు 2018లో ఆ విభాగానికి బదిలీపై వచ్చారు. జీవీఎంసీ ఉద్యోగుల బదిలీలు, పదోన్నతులకు సంబంధించిన వ్యవహరాల్లో ఉన్నతాధికారులకు ఆయన సహకరించాల్సి ఉంటుంది. అయితే సదరు ఉద్యోగి సైతం అదే సీటులో ఇప్పటికీ కొనసాగుతుండడం విశేషం. అకౌంట్స్ సెక్షన్‌లో విశ్రాంత ఉద్యోగుల ప్రయోజనాలను పర్యవేక్షించే సీనియర్ అసిస్టెంట్‌కు రెండేళ్ల కిందట సూపరింటెండెంట్‌గా పదోన్నతి కల్పిస్తూ నీటి సరఫరా విభాగానికి బదిలీ చేశారు. అయినప్పటికీ గతంలో పనిచేసిన విశ్రాంత ఉద్యోగుల ప్రయోజనాలను పర్యవేక్షించే విభాగంలోనే అదనపు బాధ్యతల పేరుతో కొనసాగుతున్నారు. సీనియర్ అసిస్టెంట్లు చాలామంది ఉన్నప్పటికీ ఉన్నతాధికారులతో లాలూచీ కారణంగా ఆ సీటులో వేరొకరికి పోస్టింగ్ ఇవ్వడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో ఉన్నారు.
జీవీఎంసీ పరిధిలోని ఎనిమిది జోన్‌లను పది జోన్‌లుగా కొన్నాళ్ల కిందట పునర్వ్యవస్థీకరించారు. కొత్తగా ఏర్పడిన జోన్‌లకు అనువజ్ఞులైన వారిని నియమిస్తే అక్కడ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అవకాశం ఉంటుంది. అయితే అధికారులు మాత్రం దీనికి భిన్నంగా కొత్తగా జూనియర్ అసిస్టెంట్‌లు, సీనియర్ అసిస్టెంట్లు, సూపరింటెండెంట్‌లుగా పదోన్నతి పొందినవారిని కొత్త జోన్‌లకు బదిలీ చేశారు. ఏళ్ల తరబడి ఒకే సెక్షన్‌లో ఒకే సీటులో తిష్ఠ వేసిన సీనియర్‌లను కదల్చకపోవడంపై మిగిలిన ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. కమిషనర్ కేతన్‌గార్గ్ ఇప్పటికైనా పరిపాలనా విభాగంలోని మినిస్టీరియల్ సిబ్బంది పోస్టింగ్‌లు, బదిలీలపై దృష్టిసారించాలని ఉద్యోగులు కోరుతున్నారు.