Share News

ఈదురుగాలులు

ABN , Publish Date - May 23 , 2026 | 12:24 AM

జిల్లాలోని అనకాపల్లి, ఎలమంచిలి, పాయకరావుపేట, చోడవరం, మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గాల్లోని పలు మండలాల్లో శుక్రవారం రాత్రి ఈదురు గాలులతో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. గాలుల కారణంగా కొన్నిచోట్ల విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. వాతావరణం చల్లబడడంతో వేసవి తాపం నుంచి ప్రజలు ఒకింత ఉపశమనం చెందారు.

ఈదురుగాలులు
కె.కోటపాడులో వర్షం

ఉరుములతో పిడుగులు

విరిగిన చెట్ల కొమ్మలు, హోర్డింగులు

విద్యుత్‌ సరఫరా నిలిపివేత

పలు మండలాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం

వాతావరణం చల్లబడడంతో ఉపశమనం

అనకాపల్లి టౌన్‌/ చోడవరం/ కె.కోటపాడు/ ఎలమంచిలి/ నక్కపల్లి/ఎస్‌.రాయవరం, మే 22 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని అనకాపల్లి, ఎలమంచిలి, పాయకరావుపేట, చోడవరం, మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గాల్లోని పలు మండలాల్లో శుక్రవారం రాత్రి ఈదురు గాలులతో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. గాలుల కారణంగా కొన్నిచోట్ల విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. వాతావరణం చల్లబడడంతో వేసవి తాపం నుంచి ప్రజలు ఒకింత ఉపశమనం చెందారు.

అనకాపల్లి పట్టణంలో శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు వేడి వాతావరణం నెలకొంది. ఆ తరువాత ఉక్కపోత పెరిగింది. రాత్రి ఎనిమిది గంటల సమయంలో వాతావరణం మారిపోయింది. ఈదురుగాలులతో చల్లటి గాలులు వీచాయి. ఎనిమిదిన్నర గంటల తరువాత ఉరుములు, మెరుపులతో వర్షం మొదలైంది. విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. ఈదురు గాలులు, వర్షంతో ఫుట్‌పాత్‌ వ్యాపారులు ఇబ్బంది పడ్డారు. వర్షంతో వాతావరణం చల్లబడింది. రాత్రి పది గంటల తరువాత విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించారు.

చోడవరం రాత్రి ఎనిమిది గంటలకు ఈదురుగాలులు ప్రారంభమయ్యాయి. తరువాత ఉరుములు, మెరుపులతో కొద్దిసేపు వర్షం కురిసింది. ఈదురుగాలుల కారణంగా పలుచోట్ల కటౌట్‌లు, చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. అన్నవరం ఫీడర్‌ పరిధిలో విద్యుత్‌ లైన్లపై చెట్ల కొమ్మలు పడడంతో సరఫరా నిలిచిపోయింది. కె.కోటపాడు మండలంలోని పలు గ్రామాల్లో రాత్రి ఎనిమిది గంటల తరువాత సుమారు గంటపాటు వర్షం కురిసింది. అంతకుముందు ఈదురు గాలులు వీచాయి. వాతావరణం చల్లబడడంతో ప్రజలు ఊరటచెందారు.

ఎలమంచిలిలో శుక్రవారం రాత్రి 8.30 గంటల తరువాత భారీ ఈదురు గాలులు వీచాయి. ఆకాశంలో దట్టంగా మేఘాలు కమ్ముకున్నాయి. ఈదురు గాలుల కారణంగా విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. పట్టణంలో పలు చోట్ల ఫ్లెక్సీలు నేలకొరిగాయి. నక్కపల్లి, ఎస్‌.రాయవరం మండలాల్లో రాత్రి 8..45 గంటల నుంచి 10 గంటల వరకు ఈదురుగాలులు వీచాయి. వర్షం కురవకపోవడంతో దుమ్ము, ధూళి ఎగిసిపడింది. ముందు జాగ్రత్త చర్యగా ఈపీడీసీఎల్‌ అధికారులు విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు. మాడుగుల మండలంలోఉరుములు, మెరుపులతో తేలికపాటి వర్షం కురిసింది. అచ్యుతాపురం, బుచ్చెయ్యపేట, కోటవురట్ల, దేవరాల్లి, ముగనపాక, రాంబిల్లి మండలాల్లో కూడా ఈదురుగాలులతో వర్షం పడింది. విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.

Updated Date - May 23 , 2026 | 12:24 AM