గురుకుల విద్యార్థి ఆత్మహత్య
ABN , Publish Date - Jul 03 , 2026 | 11:09 PM
చింతపల్లి గిరిజన సంక్షేమ శాఖ గురుకుల కళాశాలలో ప్రథమ సంవత్సరం ఎంపీసీ విద్యార్థి సిందేరి అనిల్ (17) వసతిగృహంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానిక సీఐ బి.సింహాచలం అందించిన వివరాలిలా ఉన్నాయి.
ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న అనిల్
చింతపల్లిలో జాయిన్ కావడానికి అయిష్టత
విద్యార్థి మృతిపై ఏటీడబ్యూవో విచారణ
చింతపల్లి, జూలై 3 (ఆంధ్రజ్యోతి): పెదబయలు మండలం లింగేటి పంచాయతీ మోయలగుర్మి గ్రామానికి చెందిన సీందేరి చలపతి, జానకి దంపతుల కుమారుడు అనిల్ పదో తరగతి వరకు అరకులోయలో చదివాడు. ఇంటర్మీడియట్ అరకులోయ ప్రాంతంలోనే చదువుతానని అనిల్ తల్లిదండ్రులకు చెప్పాడు. అయితే అతనికి చింతపల్లి గురుకుల కళాశాలలో సీటు వచ్చింది. ఇదే కళాశాలలో అనిల్ బావ చిక్కుడు శామ్యూల్ ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో చదువుతున్నాడు. బావబామ్మర్ధులు కలిసి చదువుకుంటారనే ఆశతో తల్లిదండులు చింతపల్లి కళాశాలలో జూలై 29న చేర్పించారు. విద్యార్థి కళాశాలలో చేరిన నాటి నుంచి అయిష్టతతోనే తరగతులకు హాజరవుతున్నాడు. గురువారం రాత్రి అనిల్ పడుకునే ముందు తాను చనిపోయిన ఏడవవద్దని బావ శామ్యూల్‌తో చెప్పాడు. ఎందుకు అలా మాట్లాడుతున్నావు.. బాగా చదువుకోవాలని చెప్పాడు. రాత్రి ఇద్దరు ఒకే మంచంపై పడుకున్నారు. శుక్రవారం నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని ఉదయం స్టడీ అవర్‌కు వెళ్లేందుకు ఇద్దరు సిద్ధపడ్టారు. వసతి గృహం నుంచి తరగతి గదికి నడిచి వెళుతుండగా కాసేపు ఆగి వస్తానని అనిల్ వెనక్కి వచ్చాడు. విద్యార్థులందరూ స్టడీ అవర్‌కి వెళ్లిపోయిన తరువాత వసతి గృహంలో టవల్‌తో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని కళాశాల సెక్యూరిటీ గమనించి ఉపాధ్యాయులకు చెప్పడంతో హుటాహుటిన ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి విద్యార్థి మృతి చెందాడని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నామని సీఐ సింహాచలం తెలిపారు.
విద్యార్థి మృతిపై సమగ్ర విచారణ : ఏటీడబ్ల్యూవో
గురుకుల కళాశాలలో విద్యార్థి అనిల్ ఆత్మహత్య చేసుకోవడంపై విచారణ చేపట్టామని స్థానిక ఏటీడబ్ల్యూవో జయనాగలక్ష్మి తెలిపారు. విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం అందిన వెంటనే ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ ఆదేశాల మేరకు ఆమె కళాశాలకు వచ్చారు. అధ్యాపకులు, విద్యార్థులు, నాన్ టీచింగ్, సెక్యూరిటీతో వేర్వేరుగా విచారించారు. విచారణ నివేదికను ఐటీడీఏ పీవోకి పంపిస్తానని జయనాగలక్ష్మి తెలిపారు. కాగా ఏరియా ఆస్పత్రి వద్ద విద్యార్థి మృతిపై సమగ్ర దర్యాప్తు చేయాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని గిరిజన సంఘం మండల కార్యదర్శి సాగిన చిరంజీవి, మాజీ ఎంపీపీ పాంగి బాబూరావు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి జీవన్ కృష్ణ మృతుడు కుటుంబ సభ్యులతో కలిసి ఆందోళన చేశారు.