Share News

అధ్వానంగా గుర్తేడు-గుమ్మిరేవుల రోడ్డు

ABN , Publish Date - Sep 06 , 2026 | 12:40 AM

రెండు జిల్లాలను అనుసంధానం చేసే గుర్తేడు-గుమ్మిరేవుల రోడ్డు అధ్వానంగా మారింది. ఎనిమిది ఏళ్ల క్రితం నిర్మించిన 32 కిలోమీటర్ల రహదారి గోతులమయమైంది. దీంతో రాకపోకలకు ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

అధ్వానంగా గుర్తేడు-గుమ్మిరేవుల రోడ్డు
మాదిగమల్లు వద్ద అధ్వానంగా మారిన రహదారి

పాడైన రెండు జిల్లాలను అనుసంధానం చేసే రహదారి

32 కిలోమీటర్ల మేర గోతులమయం

వర్షం కురిస్తే ప్రయాణం నరకం

కొయ్యూరు, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): అల్లూరి జిల్లా నుంచి పోలవరం జిల్లాను అనుసంధానం చేస్తూ నిర్మించిన గుర్తేడు-గుమ్మిరేవుల రోడ్డు పూర్తిగా పాడైంది. అడుగుకో గొయ్యి ఏర్పడింది. రోడ్డు వేసిన తర్వాత కనీసం మరమ్మతులు చేపట్టలేదు. మాదిగమల్లు వద్ద కొండ వాగుపై నిర్మించిన వంతెన శిథిలమైంది. దీంతో వంతెనపై ఆటోలు, ద్విచక్ర వాహనాలు మాత్రమే రాకపోకలు సాగిస్తున్నాయి. అదే వర్షం కురిస్తే రోడ్డుపై మోకాలు లోతు బురద ఏర్పడి ద్విచక్ర వాహన ప్రయాణం నరకంగా మారుతున్నది. 2017లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అల్లూరి జిల్లా గుమ్మిరేవుల నుంచి మఠంభీమవరం పంచాయతీ పోతవరం మీదుగా పోలవరం జిల్లా గుర్తేడుకు 32 కిలోమీటర్ల బీటీ రోడ్డు వేశారు. ఈ రహదారిలో 20 కొండవాగులపై వంతెనలు, కల్వర్టులు నిర్మించి రహదారిని పూర్తి చేశారు. ఈ రహదారి అందుబాటులోకి రావడంతో వై.రామవరం, కొయ్యూరు, జీకేవీధి, పోలవరం జిల్లాకు చెందిన మరో 20 గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం ఏర్పడింది. ఆయా గ్రామాలకు బస్సులు వేశారు. పోలవరం జిల్లాకు చెందిన ప్రజలకు గుర్తేడు నుంచి మఠంభీమవరం, గుమ్మిరేవుల మీదుగా జీకేవీధి మండలం ధారకొండ ధారాలమ్మ ఆలయ దర్శనానికి వెళ్లేందుకు ఉపయోగకరంగా ఉండేది. అయితే భారీ వర్షాల కారణంగా రోడ్డుపై గోతులు ఏర్పడ్డాయి. రోడ్డుకు మరమ్మతులు చేయాలని వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆయా గ్రామాల ప్రజలు అధికారులకు, పాలకులకు ఎన్నో వినతులు ఇచ్చినా ప్రయోజనం లేకపోయింది. దీంతో 32 కిలోమీటర్లు రహదారి ధ్వంసమైంది. ఈ రోడ్డుపై కనీసం రెండు నిమిషాల ప్రయాణం కూడా సాఫీగా సాగని పరిస్థితి నెలకొంది. అలాగే మాదిగమల్లు సమీపంలో వంతెన ధ్వంసమవ్వడంతో గుమ్మిరేవుల వరకు తిరిగే బస్సు సర్వీసు ధారకొండకే పరిమితమైంది. రంపచోడవరం నుంచి మారేడుమిల్లి, వాలుగూడెం, పోతవరం పాతకోట, గుర్తేడు మీదుగా ధారకొండ వెళ్లే బస్సు సర్వీసు గుర్తేడుకే పరిమితమైంది. ఇక పోలవరం జిల్లా వాసులు ధారకొండ అమ్మవారిని దర్శించుకోవాలంటే అదనంగా 200 కిలోమీటర్లు ప్రయాణించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. మాదిగమల్లు వంతెన పునఃనిర్మాణం ప్రారంభించి ఏడాది దాటినా నిర్మాణాలు నేటికి అసంపూర్తిగానే ఉన్నాయి. ఈ రహదారికి పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయించాలని గిరిజనులు కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Updated Date - Sep 06 , 2026 | 12:40 AM