యాపిల్ కంటే జామకాయలే ప్రియం
ABN , Publish Date - Oct 06 , 2026 | 01:14 AM
నగరంలో జామకాయలకు కరువు వచ్చింది. ధర కూడా రెట్టింపు అయింది.
కిలో రూ.120-150
కొందామన్నా కరువు
డిమాండ్‌కు తగినట్టుగా సరుకు రాకపోవడమే కారణం
విశాఖపట్నం, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి):
నగరంలో జామకాయలకు కరువు వచ్చింది. ధర కూడా రెట్టింపు అయింది. కిలో రూ.120 నుంచి రూ.150 వరకు అమ్ముతున్నారు. అయినా కొన్ని ప్రాంతాల్లో లభించడం లేదు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే జామకాయల కంటే యాపిల్ పండ్లే చౌకగా లభిస్తున్నాయి. ఇది అన్‌సీజన్ కావడం వల్లే జామకాయలు రావడం లేదని వ్యాపారులు చెబుతున్నారు. వన్‌టౌన్‌లో హోల్ సేల్ పండ్ల వ్యాపారులు జామకాయలను రాజమహేంద్రవరం, షోలాపూర్‌ల నుంచి తెప్పించి రిటైల్ వ్యాపారులకు విక్రయిస్తారు. ఇప్పుడిప్పుడే కొత్త పంట మొదలైందని, రాజమహేంద్రవరంలోనే కిలో రూ.100 ధర పడుతోందని చెబుతున్నారు. ఇండెంట్ పెట్టినంత సరకు రాకపోవడంతో రిటైలర్లకు వేలం పెట్టి ఎవరు ఎక్కువ ధర ఇస్తే వారికే ఇస్తున్నారు. దాంతో వారు కిలో రూ.150 వరకు అమ్ముతున్నారు. సిమ్లా యాపిల్ కిలో రూ.130కే ఇస్తున్నారు. వంద రూపాయలు ఇస్తే యాపిల్ పండ్లు ఆరు నుంచి ఏడు వస్తుండగా, అదే జామకాయలైతే ఐదు మాత్రమే ఇస్తున్నారు.
జామకు డిమాండ్
నాలుగు యాపిల్ పండ్లు తింటే ఎన్ని పోషకాలు, విటమిన్లు లభిస్తాయో ఒక జామకాయ తింటే అన్ని దొరుకుతాయని వైద్యులు చెబుతున్నారని చాలామంది వాటిని రోజూ తీసుకుంటున్నారు. షుగర్ పేషెంట్లకు కూడా మంచిదని చెబుతుండడం వల్ల రైతుబజార్లకు వచ్చే వారిలో అత్యధికులు జామకాయలు కొని తీసుకువెళుతుంటారు. ఇంతకుముందు కిలో రూ.40కే లభించేవి. ఇప్పుడు కూడా దేశవాళీ రకం రూ.70 ధరే పెట్టారు. కానీ లభించడం లేదు. ప్రస్తుతం తైవాన్ రకం చిన్న సైజు వస్తున్నాయి. వాటిని వంద రూపాయలకు ఐదు, కిలో లెక్కన అయితే రూ.150కి అమ్ముతున్నారు. వచ్చే నెల నుంచి పంట చేతికి వస్తుందని, అప్పుడు రాజమహేంద్రవరం సరకు వస్తుందని, ధరలు తగ్గుతాయని వ్యాపారులు చెబుతున్నారు.
8 నుంచి 12 వరకు కిరండూల్ ఎక్స్‌ప్రెస్ రద్దు
కిరండూల్ పాసింజర్ కోరాపుట్ వరకే...
విశాఖపట్నం, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): రాయగడ డివిజన్‌లోని మలిగుర-చత్రిపుట్ స్టేషన్ల మధ్య కొండ చరియలు విరిగిపడినందున విశాఖ-కిరండూల్-విశాఖ (18515/18516) ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఈ నెల 8 నుంచి 12 వరకు రద్దు చేశారు. విశాఖ-కిరండూల్-విశాఖ పాసింజర్ రైళ్లు (58501/58502) ఈ నెల 8 నుంచి 12 వరకు విశాఖ నుంచి కోరాపుట్ వరకు, కోరాపుట్ నుంచి విశాఖ వరకు నడుస్తాయి. కోరాపుట్-కిరండూల్ మధ్య రాకపోకలను రద్దు చేశారు. అలాగే భువనేశ్వర్-జగదల్‌పూర్ ఎక్స్‌ప్రెస్ (18447) ఈ నెల 8 నుంచి 12 వరకు రద్దు కాగా, తిరుగు ప్రయాణంలోని జగదల్‌పూర్-భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్ (18448)ను ఈ నెల 9 నుంచి 12 వరకు రద్దు చేశామని రైల్వే అధికారులు ప్రకటించారు.
గిరి ప్రదక్షిణ భోజన బిల్లుపై ఫిర్యాదు
దర్శనాలు, గదుల కేటాయింపులోనూ సిబ్బంది చేతివాటం
విశాఖపట్నం, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి):
గత జూలైలో జరిగిన సింహగిరి ప్రదక్షిణ సందర్భంగా విధులకు హాజరైన సిబ్బంది భోజనాలకు రూ.83.83 లక్షలు అయినట్టు బిల్లు పెట్టడంపై దేవదాయ శాఖ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. దీనిపై ‘ఆంధ్రజ్యోతి’ రెండు రోజులు వరుసగా కథనాలు ప్రచురించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకోవాలని దేవదాయ శాఖ కమిషనర్‌కు సోమవారం ట్రస్టు బోర్టు మాజీ సభ్యురాలు దాడి దేవి ఫిర్యాదు చేశారు. ఇది మాత్రమే కాకుండా స్వామి దర్శనాల విషయంలో, గదుల కేటాయింపులో సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారని ఆమె ఆరోపించారు. కొండపై పెళ్లిళ్లు చేసే కాంట్రాక్టర్లకు అనుకూలంగా గదులను ముందుగానే బ్లాక్ చేసి, సిబ్బంది వారికే కేటాయిస్తున్నారని, దీనిపై విచారణ జరపాలని కోరారు. దేవస్థానం భూములను కూడా కొందరు అధికారులే బినామీల ద్వారా ఆక్రమిస్తున్నారని ఆరోపించారు.
ట్రస్టు బోర్డుతో అధికారుల సమావేశం
భోజనాల కాంట్రాక్టుపై విమర్శలు వెల్లువెత్తుతుండడంతో వివరణ ఇచ్చేందుకు దేవస్థానం అధికారులు సోమవారం సాయంత్రం ట్రస్టు బోర్డుసభ్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ కాంట్రాక్టు విషయం జూన్‌లో సభ్యులకు చెప్పామని, అయితే ఎంత మొత్తం అనేది ముందుగా తెలియకపోవడం వల్ల అప్పట్లో వెల్లడించలేకపోయినట్టు వివరించారు. ఈసారి ఎక్కువ మంది విధులకు హాజరు కావడం వల్ల ఖర్చు పెరిగిందని, అందులో పోలీసులకే ఎక్కువ ఖర్చు చేశామని పేర్కొన్నారు. భోగాపురంలో నిర్వహించిన ఒక కార్యక్రమానికి పోలీసులు హాజరయ్యారని, ఆ ఖర్చు కూడా దేవస్థానమే భరించాల్సి వచ్చిందని చెప్పినట్టు తెలిసింది. అన్నదానానికి ముందుకు వచ్చిన స్వచ్ఛంద సంస్థకు అనుమతి ఇవ్వకపోవడం తమ నిర్ణయం కాదని, పోలీసులు తొక్కిసలాట జరుగుతుందని వద్దన్నారని, అందుకే అనుమతి ఇవ్వలేదని బోర్డు సభ్యులకు ఉన్నతాధికారి వివరించినట్టు సమాచారం.
ఉక్కులో పదోన్నతులపై యాజమాన్యం కెవియట్ పిటిషన్
విశాఖపట్నం, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి):
స్టీల్ ప్లాంటు యాజమాన్యం హైకోర్టులో కెవియట్ పిటిషన్ వేసింది. పదోన్నతులకు సంబంధించి తాము అనుసరించే విధానాలపై ఎవరైనా కేసులు వేస్తే వారికి స్టే ఇవ్వొద్దని కోరుతూ ఈ పిటిషన్ దాఖలు చేసింది. గత ఆరేళ్లుగా పదోన్నతులు ఇవ్వడం లేదని, నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని, ప్లాంటు లాభాలతో పదోన్నతులు ముడిపెడుతున్నారని పేర్కొంటూ స్టీల్ ఎగ్జిక్యూటివ్స్ అసోసొయేషన్ హైకోర్టులో కేసు వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పదోన్నతులు ఇస్తున్నామని ఇటీవల యాజమాన్యం హైకోర్టుకు తెలియజేసింది. ఉద్యోగులకు కూడా ఆ విషయం తెలిపింది. అందులోను మతలబులు ఉన్నాయని ఆరోపణలు వచ్చాయి. ఎప్పటి నుంచి పదోన్నతులు ఆపారో అప్పటి నుంచి కాకుండా వేరే విధంగా లెక్కలు వేస్తున్నారని, దాని వల్ల సీనియర్లకు అన్యాయం జరుగుతుందని కొందరు ఆందోళన వ్యక్తంచేశారు. దీనిపై కొందరు కోర్టును ఆశ్రయించాలని నిర్ణయించారు. ఒకవేళ అలా ఎవరైనా పిటిషన్ వేస్తే పదోన్నతుల ప్రక్రియ ఆగిపోతుందని, అది మరింత ఇబ్బందికరమని భావిస్తూ యాజమాన్యం కెవియట్ పిటిషన్ వేసింది. స్టే కోరుతూ ఎవరైనా పిటిషన్ వేస్తే తమ వాదన కూడా వినాలని, ఆ తరువాతే నిర్ణయం తీసుకోవాలని హైకోర్టును కోరింది. దీనిపై ఉక్కు అధికారుల సంఘం నాయకులు మాట్లాడుతూ, యాజమాన్యం పదోన్నతుల పాలసీలో తప్పులు ఉన్నాయి గనుకే దానిని ఎవరూ అడ్డుకోకుండా పిటిషన్ వేసిందని ఆరోపించారు.
ప్రాంతీయ పెట్టుబడుల సదస్సు రేపు
ఐఐఎంలో ఏర్పాట్లు పరిశీలించిన జేసీ
విశాఖపట్నం, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి):
ఆనందపురం మండలం గంభీరంలోని ఐఐఎంలో ఈనెల ఏడో తేదీన ఉత్తరాంధ్ర స్థాయి పెట్టుబడుల సదస్సు నిర్వహించనున్నారు. ఉత్తరాంధ్ర పరిధిలోని అన్ని జిల్లాల నుంచి పారిశ్రామికవేత్తలు, ఔత్సాహికులు సదస్సులో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో జాయింట్ కలెక్టర్ జి.విద్యాధరి సోమవారం సాయంత్రం ఐఐఎంను సందర్శించి అక్కడ ఏర్పాట్లు పరిశీలించారు. ప్రధానవేదిక, ఇతర సమావేశాల కోసం సిద్ధం చేసిన హాళ్లు, ఎగ్జిబిషన్ ప్రాంగణం, ఏపీ పెవెలియన్‌తోపాటు పార్కింగ్, రిజిస్ట్రేషన్, తదితర ఏర్పాట్లు పరిశీలించారు. సదస్సు నిర్వహణ అత్యంత కీలకమని వివిధ విభాగాల అధికారులు, ఈవెంట్ ఏజెన్సీ ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రతి అంశానికి సంబంధించి బాధ్యతలు స్పష్టంగా కేటాయించాలని, అప్పగించిన పనులను నిర్ణీత గడువులోగా పూర్తిచేయాలని ఆదేశించారు.