Share News

జీడి పిక్కలకు జీఎస్టీ ఎగవేత

ABN , Publish Date - May 08 , 2026 | 01:41 AM

జిల్లాలో జీడి పిక్కల లావాదేవీలకు సంబంధించి వ్యాపారులు జీఎస్టీని ఎగవేస్తున్నారు.

జీడి పిక్కలకు జీఎస్టీ ఎగవేత

అధికారుల కళ్లకు వ్యాపారుల గంతలు

జిల్లాలో ఏటా రూ.60 కోట్లకుపైగా లావాదేవీలు

ఐదు శాతం జీఎస్టీ చొప్పున రావాల్సిన ఆదాయం రూ.3 కోట్లు

వసూలవుతున్నది రూ.1.8 కోట్లు మాత్రమే

కొరవడిన అధికారుల పర్యవేక్షణ, తనిఖీలు

(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

జిల్లాలో జీడి పిక్కల లావాదేవీలకు సంబంధించి వ్యాపారులు జీఎస్టీని ఎగవేస్తున్నారు. ఏటా అరవై కోట్ల రూపాయలకుపైగా వ్యాపారం జరుగుతుండగా, ఐదు శాతం జీఎస్టీ మేరకు మూడు కోట్ల రూపాయల ఆదాయం రావాల్సి వుంది. కానీ రెండు కోట్ల రూపాయలు కూడా రావడంలేదు. జీడి పిక్కల వ్యాపారుల అక్రమాలు, సంబంధిత అధికారుల నిఘా కొరవడడంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతున్నది.

జిల్లాలో అనకాపల్లి, అచ్యుతాపురంలో స్టేట్‌ జీఎస్టీ సర్కిల్‌ కార్యాలయాలు వున్నాయి. అనకాపల్లి సర్కిల్‌ పరిధిలో అనకాపలి టౌన్‌తోపాటు మండలం, సబ్బవరం, రావికమతం, బుచ్చెయ్యపేట, చోడవరం, కె.కోటపాడు, వి.మాడుగుల, దేవరాపల్లి, చీడికాడ మండలాలు ఉన్నాయి. అచ్యుతాపురం సర్కిల్‌ పరిధిలో పరవాడ, కశింకోట, రాంబిల్లి, ఎలమంచిలి, మునగపాక, అచ్యుతాపురం, కోటవురట్ల, పాయకరావుపేట, నక్కపల్లి, ఎస్‌.రాయవరం, నర్సీపట్నం, నాతవరం, గొలుగొండ, మాకవరపాలెం, రోలుగుంట మండలాలు వున్నాయి. అచ్యుతాపురం సర్కిల్‌ పరిధిలో జీడి పిక్కల లావాదేవీలు అధికంగా జరుగుతుంటాయి. నర్సీపట్నం, రోలుగుంట, రావికమతం మండలాల్లో జీడి పిక్కల ప్రాసెసింగ్‌ (జీడి పప్పు తయారీ) యూనిట్లు ఉన్నాయి. వ్యాపారులు (దళారులు) రైతుల నుంచి జీడి పిక్కలు కొనుగోలు చేసి ప్రాసెసింగ్‌ యూనిట్లకు విక్రయిస్తుంటారు. ఈ క్రమంలో రైతుల నుంచి కొనుగోలు చేసిన జీడి పిక్కల విలువపై ఐదు శాతం జీఎస్టీ చెల్లించాలి. జిలాల్లో ఏటా రూ.60 కోట్ల వరకు వ్యాపారం జరుగుతుంటుందని అంచనా. దీనిపై ఐదు శాతం చొప్పున రూ.3 కోట్లు ప్రభుత్వ ఖజానాకు జమకావాలి. కానీ అధికారుల ఉదాసీనత కారణంగా రూ.1.8 కోట్లకు మించి జీఎస్టీ వసూలు కావడం లేదు. జీడి పిక్కల లావాదేవీలకు సంబంధించిన రికార్డుల నిర్వహణలో వ్యాపారులు మాయాజాలాన్ని ప్రదర్శిస్తున్నారు. రైతుల నుంచి కొనుగోలు చేస్తున్న జీడి పిక్కల పరిమాణంలో సగం మాత్రమే లెక్కల్లో చూపుతున్నారు. కొంతమంది వ్యాపారులు ట్రేడ్‌ లైసెన్సు లేకుండా అనధికారికంగా జీడి పిక్కల వ్యాపారం చేస్తున్నారు. అధికారులు కార్యాలయానికికే పరిమితం కావడం, క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టకపోవడంతో ఇటువంటి అక్రమాలు యథేచ్ఛగా సాగిపోతున్నాయి. ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతున్నది. కొంతమంది వ్యాపారులు జీడి పిక్కలను కొనుగోలు చేసేటప్పుడు జీఎస్టీ పేరుతో రైతులకు చెల్లించాల్సిన సొమ్ము నుంచి ఐదు శాతాన్ని మినహాయించుకుంటున్నట్టు తెలిసింది.

కాగా జీడి పిక్కల వ్యాపారులు జీఎస్టీ ఎగవేతపై జాయింట్‌ కమిషనర్‌ శేషాద్రిని ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధి వివరణ కోరగా.. జీడి పిక్కల లావాదేవీలకు సంబంధించి జీఎస్టీ వసూలుకు లక్ష్యాలు ఉండవన్నారు. జీడి పిక్కల వ్యాపారుల నుంచి జీఎస్టీ వసూలు చేస్తున్నామన్నారు. వ్యాపారుల అక్రమాలపై ఫిర్యాదులు అందితే విచారణ జరిపి చర్యలు చేపడతామని చెప్పారు.

Updated Date - May 08 , 2026 | 01:41 AM