Share News

పెరుగుతున్న చలి

ABN , Publish Date - Jan 21 , 2026 | 11:13 PM

మన్యంలో బుధవారం ఉదయం పొగమంచు దట్టంగా కమ్మేసింది. పాడేరులో తెల్లవారుజాము నుంచి ఉదయం ఎనిమిది గంటల వరకు దట్టంగా పొగమంచు కురిసింది.

పెరుగుతున్న చలి
లంబసింగిలో పొగమంచు

హుకుంపేటలో 5.6 డిగ్రీలు

వణుకుతున్న మన్యం వాసులు

పాడేరు, జనవరి 21(ఆంధ్రజ్యోతి): మన్యంలో బుధవారం ఉదయం పొగమంచు దట్టంగా కమ్మేసింది. పాడేరులో తెల్లవారుజాము నుంచి ఉదయం ఎనిమిది గంటల వరకు దట్టంగా పొగమంచు కురిసింది. తాజా వాతావరణం పర్యాటకులు కనువిందు చేసేలా ఆహ్లాదకరంగా ఉంది. అలాగే అరకులోయ, వంజంగి, తాజంగి సందర్శనకు వచ్చే పర్యాటకులను మంచు అందాలు విశేషంగా ఆకర్షిస్తున్నాయి.

కొనసాగుతున్న కనిష్ఠ ఉష్ణోగ్రతలు

మన్యంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. హుకుంపేటలో బుధవారం 5.6, జి.మాడుగులలో 6.0, అరకులోయలో 6.4, పెదబయలులో 6.8, ముంచంగిపుట్టులో 6.9, చింతపల్లిలో 7.1, కొయ్యూరులో 11.0 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

చింతపల్లిలో మళ్లీ పెరిగిన చలి

చింతపల్లి: మండలంలో చలి తీవ్రత మళ్లీ పెరిగింది. రెండు రోజుల క్రితం ఐదు డిగ్రీల కంటే తక్కువగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో చలి తీవ్రతకు ప్రజలు గజగజ వణికిపోయారు. మంగళవారం 12.2 డిగ్రీలు నమోదు కాగా, చలి తీవ్రత తగ్గుతుందని స్థానికులు భావించారు. అయితే బుధవారం 7.1 డిగ్రీలు నమోదైంది. ఒకేసారి ఐదు డిగ్రీలు పడిపోవడంతో చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. ప్రస్తుతం చలికి ప్రజలు అవస్థలు పడుతున్నారు. అలాగే ఉదయం, రాత్రి వేళల్లో మంచు దట్టంగా కురుస్తున్నది. చలి వల్ల ప్రజలు 24 గంటలూ ఉన్నిదుస్తులు ధరించి కనిపిస్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో వీధుల్లో చలి మంటలు వేసుకుని ఉపశమనం పొందుతున్నారు. కాగా నెలాఖరు వరకు గిరిజన ప్రాంతంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Updated Date - Jan 21 , 2026 | 11:13 PM