గంజాయిని ధ్వంసం చేసిన సాగుదారులు
ABN , Publish Date - Oct 09 , 2026 | 11:27 PM
గంజాయిని సాగు చేసిన గిరిజనులే తోటను నరికి ధ్వంసం చేసి తగులబెట్టిన సంఘటన శుక్రవారం ఆంధ్ర-ఒడిశా సరిహద్దు ప్రాంతంలో జరిగింది.
ఒడిశా పోలీసులు అవగాహన కల్పించడంతో పరివర్తన
సీలేరు (అల్లూరి సీతారామరాజు జిల్లా), అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): గంజాయిని సాగు చేసిన గిరిజనులే తోటను నరికి ధ్వంసం చేసి తగులబెట్టిన సంఘటన శుక్రవారం ఆంధ్ర-ఒడిశా సరిహద్దు ప్రాంతంలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఒడిశా రాష్ట్రంలో గల మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ బ్లాక్‌లో విచ్చలవిడిగా గంజాయి సాగు, రవాణా జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఈగల్ టీమ్‌లు ఎక్కడెక్కడ గంజాయి సాగు, స్టాకు ఉందో సమాచారం సేకరించి ఒడిశా పోలీసులకు అందించాయి. ఆయా గ్రామాల్లో మల్కన్‌గిరి జిల్లా పోలీసులు సదస్సులు నిర్వహించారు. గంజాయి సాగు, రవాణాపై నిషేధం ఉందని, వాటితో ఎవరికి సంబంధం ఉన్నా చట్టపరంగా శిక్షిస్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో పప్పర్లమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో గల సిలిమేట గ్రామస్థులు తాము సాగు చేస్తున్న గంజాయి తోటలను శుక్రవారం స్వయంగా నరికి పోగులు పెట్టి, దహనం చేశారు. వారిని పోలీసులు అభినందించారు. తమను ప్రభుత్వం అదుకోవాలని, ఒక ఏడాదిపాటు సంప్రదాయ పంటల సాగుకు విత్తనాలు ఉచితంగా పంపిణీ చేయాలని గిరిజనులు విజ్ఞప్తి చేశారు.