వేరుశనగ, అల్లం ధరలు పతనం
ABN , Publish Date - Jul 12 , 2026 | 12:45 AM
వేరుశనగ, అల్లం ధరలు పతనం
వేరుశనగ బస్తా రూ.2 వేలు నుంచి రూ.1600లకు..
హైబ్రీడ్ అల్లం కిలో రూ.160 నుంచి
రూ.110లకు పడిపోయిన ధరలు
గిరిజన రైతుల ఆవేదన
హుకుంపేట, జూలై 11 (ఆంధ్రజ్యోతి):
రైతులు పండించిన వేరుశనగ, అల్లం పంటల ధరలు పతనమయ్యాయి. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. ప్రతి శనివారం హుకుంపేటలో జరిగే వారపు సంతకు గిరిజన రైతులు పండించిన పంటలను తీసుకువస్తుంటారు. గత రెండు వారాలు మంచి ధరలు పలికిన వేరుశనగ, అల్లం పంటలకు ఈ వారం ధరలు భారీగా పతనమయ్యాయి. రెండు వారాలు 45 కిలోల వేరుశనగ బస్తా రూ.1800 నుంచి రూ. 2 వేలకు వ్యాపారులు కొనుగోలు చేశారు. ఈ లెక్కన కిలో వేరుశనగ కాయలు రూ.40 నుంచి రూ.43 పడుతుంది. అయితే ఈ శనివారం సంతలో వేరుశనగ 45 కిలోల బస్తా రూ.1600లకు వ్యాపారులు కొనుగోలు చేశారు. ధర తగ్గించి కొనుగోలు చేయడంతో గిరిజన రైతులు గగ్గోలు పెడుతున్నారు. వేరుశనగ కిలో రూ.33 పడుతున్నదని, కిలోకి పది రూపాయలు తగ్గించేశారని రైతులు వాపోతున్నారు.
అలాగే గత రెండు వారాలు కంటే ఈ వారం సంతలో అల్లం ధరలు తగ్గాయి. గత రెండు వారాలు హైబ్రీడ్ రకం కిలో 160 రూపాయలకు వ్యాపారులు కొనుగోలు చేయగా.. ఈ వారం 110 రూపాయలకు కొనుగోలు చేశారు. అలాగే చిన్న అల్లం కిలో గత రెండు వారాలు 130 రూపాయలకు కొనుగోలు చేయగా.. ఈ వారం 90 రూపాయలకు వ్యాపారులకు కొనుగోలు చేశారు. ధర తగ్గించి కొనుగోలు చేయడంతో తాము నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ కష్టానికి తగిన ఫలితం రావడం లేదని గిరిజన రైతులు వాపోతున్నారు.