రెన్యూ ఎనర్జీకి అంకురార్పణ
ABN , Publish Date - Apr 23 , 2026 | 01:29 AM
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గురువారం అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలో పర్యటించనున్నారు. ఉదయం 9.30 గంటలకు ఉండవల్లిలోని నివాసం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 11 గంటలకు రాంబిల్లి మండలం జడ్.చింతువ చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి ఏపీఐఐసీ సెజ్ ఫేజ్-2 వద్దకు చేరుకుంటారు.
రాంబిల్లి మండలం గజిరెడ్డిపాలెంలో ప్లాంటు నిర్మాణానికి నేడు భూమిపూజ
ముఖ్య అతిథిగా హాజరుకానున్న సీఎం నారా చంద్రబాబునాయుడు
పూర్తయిన ఏర్పాట్లు
శంకుస్థాపన అనంతరం సభ
1,400 మందితో పోలీస్ బందోబస్తు
అనకాపల్లి/రాంబిల్లి, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి):
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గురువారం అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలో పర్యటించనున్నారు. ఉదయం 9.30 గంటలకు ఉండవల్లిలోని నివాసం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 11 గంటలకు రాంబిల్లి మండలం జడ్.చింతువ చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి ఏపీఐఐసీ సెజ్ ఫేజ్-2 వద్దకు చేరుకుంటారు. రాంబిల్లి మండలం గజిరెడ్డిపాలెంలో రెన్యూ ఎనర్జీ గ్లోబల్ సంస్థ రూ.5,400 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్న గ్రీన్ ఎనర్జీ ఫొటో వాల్టాయిక్స్ పరిశ్రమ నిర్మాణానికి శంకుస్థాపన, భూమిపూజ చేస్తారు. ఆ తరువాత బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. 1.05 గంటలకు హెలికాప్టర్‌లో ఉండవల్లి బయలుదేరతారు.
పటిష్ఠ ఏర్పాట్లు
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటనకు జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొల్లు రవీంద్ర, కలెక్టర్ విజయకృష్ణన్, స్థానిక ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్ పర్యవేక్షణలో అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. సభావేదికకు సమీపంలో హెలిప్యాడ్ నిర్మించారు. సీఎం ఉండవల్లి నుంచి హెలికాప్టర్‌లో ఇక్కడకు చేరుకున్న తరువాత కొద్దిసేపు విశ్రాంతి తీసుకొనేందుకు ప్రత్యేక బస్సును సిద్ధం చేశారు. సభావేదిక, ప్రజలు కూర్చునేందుకు షెడ్డు నిర్మాణం బుధవారం సాయంత్రానికి దాదాపు పూర్తయ్యింది. సభకు సుమారు 20 వేల మంది హాజరయ్యే అవకాశం ఉండడంతో అందరూ కూర్చునేందుకు కుర్చీలను ఏర్పాటు చేశారు. విశాఖ రేంజి ఐజీ గోపీనాథ్ జట్టి, ఎస్పీ తుహిన్ సిన్హా నేతృత్వంలో ఇద్దరు ఏఎస్పీలు, తొమ్మిది మంది డీఎస్పీలు, 40 మంది సీఐలు, 110 మంది ఎస్‌ఐలు, 1,250 మంది పోలీసులతో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. సభకు హాజరయ్యే ప్రజల కోసం మొత్తం 300 బస్సులను అందుబాటులో ఉంచారు. వీటిలో 80 బస్సులు అనకాపల్లి, నర్సీపట్నం డిపోలకు చెందినవి కాగా, విజయనగరం, ఎస్.కోట డిపోల నుంచి 40 బస్సులు, విశాఖ జిల్లాలోని ఏడు డిపోల నుంచి 170 బస్సులను, తుని డిపో నుంచి పది బస్సులను కేటాయించారు. బస్సుల్లో వచ్చే వారికి ఆయా వాహనాల్లోనే మధ్యాహ్న భోజన సదుపాయం కల్పించనున్నారు.