Share News

30 ప్రాజెక్టులకు భూమి పూజ

ABN , Publish Date - Oct 07 , 2026 | 01:02 AM

గంభీరంలోని ఐఐఎంలో బుధవారం జరగనున్న ఉత్తరాంధ్ర ప్రాంతీయ పెట్టుబడుల సదస్సులో రూ.4,249 కోట్ల విలువైన 30 ప్రాజెక్టులకు భూమి పూజ చేయనున్నారు. వీటి ద్వారా 23,256 మందికి ఉపాధి లభించనున్నది. బెర్రీ అల్లాయిస్‌ రూ.1,200 కోట్లతో విజయనగరం జిల్లాలో ప్లాంటు ఏర్పాటుచేయనున్నది.

30 ప్రాజెక్టులకు భూమి పూజ

రూ.4,249 కోట్ల పెట్టుబడులు

23,256 మందికి ఉపాధి

విజయనగరంలో జిల్లాలో రూ.1,200 కోట్లతో బెర్రీ ఎల్లాయిస్‌

రూ.1,008 కోట్లతో విశాఖలో ‘ఎకోబాక్స్‌ ఇండస్ట్రియల్స్‌’

మరో 30 ఒప్పందాలకు సంతకాలు

విశాఖపట్నం, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): గంభీరంలోని ఐఐఎంలో బుధవారం జరగనున్న ఉత్తరాంధ్ర ప్రాంతీయ పెట్టుబడుల సదస్సులో రూ.4,249 కోట్ల విలువైన 30 ప్రాజెక్టులకు భూమి పూజ చేయనున్నారు. వీటి ద్వారా 23,256 మందికి ఉపాధి లభించనున్నది. బెర్రీ అల్లాయిస్‌ రూ.1,200 కోట్లతో విజయనగరం జిల్లాలో ప్లాంటు ఏర్పాటుచేయనున్నది. అలాగే రూ.1,008 కోట్లతో ఎకోబాక్స్‌ ఇండస్ట్రియల్‌ అసెట్‌ ప్రైవేటు లిమిటెడ్‌ విశాఖ జిల్లాలో తన కార్యకలాపాలు ప్రారంభించనున్నది. గత ఏడాది నవంబరులో విశాఖలో జరిగిన పెట్టుబడుల సదస్సులో కుదిరిన ఒప్పందాలు, ఆ తరువాత అనుమతులు పొందిన మరికొన్ని మొత్తం 30 ప్రాజెక్టులకు భూమి పూజ చేయనున్నారు. విశాఖ జిల్లాలో రూ.1,873 కోట్లతో 12, అనకాపల్లి జిల్లాలో రూ.671 కోట్లు, శ్రీకాకుళం జిల్లాలో రూ.439 కోట్లతో ఎనిమిది చొప్పున, విజయనగరం జిల్లాలో రూ.1,266 కోట్లతో రెండు ప్రాజెక్టులు ఏర్పాటుకానున్నాయి. ఈ పరిశ్రమల ద్వారా విశాఖ జిల్లాలో 8,242 మందికి, అనకాపల్లి జిల్లా 9,443, శ్రీకాకుళంలో 4,638, విజయనగరం జిల్లాలో 933 మందికి ఉపాధి లభించనున్నది. గుర్రంపాలెం, అచ్యుతాపురం, కోడూరు, ఆమదాలవలస, కంటకాపల్లి, పూడి పారిశ్రామికవాడల్లో ఎక్కువ పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. దాదాపు రెండు మినహా మిగిలినవన్నీ మధ్యతరహా పరిశ్రమలు కావడంతో రెండు, మూడేళ్లలో ఉత్పత్తి ప్రారంభం కావచ్చునని అధికారులు అంచనా వేస్తున్నారు. భూమిపూజ జరగనున్న ప్రాజెక్టుల్లో ఎక్కువగా రసాయన, ఫెర్లో ఎల్లాయిస్‌, ఆటోమొబైల్‌, ప్లాస్టిక్‌, ఇంజనీరింగ్‌ ఉత్పత్తులు, ఆహార శుద్ధి పరిశ్రమలు ఉన్నాయి. కాగా ప్రాంతీయ సదస్సులో భాగంగా బుధవారం 30 పరిశ్రమల ఏర్పాటుకు ఒప్పందాలు జరగనున్నాయి. అయితే వీటి వివరాలు బుధవారం వెల్లడించనున్నారు.

Updated Date - Oct 07 , 2026 | 01:02 AM