Share News

మహా నిర్లక్ష్యం

ABN , Publish Date - Jun 29 , 2026 | 01:01 AM

అక్రమార్కులకన్నుపడితే చాలు... చెరువులు, వాగులు, గెడ్డలు అన్యాక్రాంతమైపోవాల్సిందే.

మహా నిర్లక్ష్యం

చెరువులో అపార్టుమెంట్‌ నిర్మాణం

అడ్డుకోవడంలో విఫలమైన జీవీఎంసీ అధికారులు

సర్వేలో చెరువు పోరంబోకుగా నిర్ధారణ

కోర్టు నుంచి ఇంజక్షన్‌ అర్డర్‌ తెచ్చుకున్న యజమాని

కౌంటర్‌ దాఖలు చేయడంలో తాత్సారం

(విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి)

అక్రమార్కులకన్నుపడితే చాలు... చెరువులు, వాగులు, గెడ్డలు అన్యాక్రాంతమైపోవాల్సిందే. అడ్డుకోవాల్సిన రెవెన్యూ, జీవీఎంసీ టౌన్‌ప్లానింగ్‌ అధికారులు కనీసం పట్టించుకోవడం లేదు. దీంతో వారి పనితీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పైగా కోర్టు ఉత్తర్వుల పేరుతో కబ్జాలవైపు కన్నెత్తి చూడడంలేదు. గతంలో బక్కన్నపాలెంలోని ప్రభుత్వభూమిని ఆక్రమించి అపార్టుమెంట్‌ నిర్మించగా, తాజాగా పరదేశిపాలెం చెరువులో అపార్టుమెంటు నిర్మితమవుతోంది. మరోచోట పట్టా భూమిలో నిర్మాణానికి అనుమతి తెచ్చుకుని చెరువులో పనులు చేపట్టినా అధికారులు అడ్డుచెప్పకపోవడం చర్చనీయాంశంగా మారింది.

జీవీఎంసీ మధురవాడ జోన్‌ ఐదోవార్డు పరిధి పరదేశిపాలెం సర్వేనంబరు 21లో 16.3 ఎకరాల ప్రభుత్వభూమి ఉంది. రెవెన్యూ విలేజ్‌ రికార్డుల్లో ఇది చెరువు పోరంబోకుగా నమోదైవుంది. ఆ భూమిలోని కొంతభాగంలో చాలాకాలం కిందట జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం ఇళ్లు నిర్మించగా, మరికొంతభూమిలో హుద్‌హుద్‌ ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. మిగిలిన భూమి ప్రస్తుతం జీవీఎంసీ ఆధీనంలో ఉంది. ప్రభుత్వ అవసరాలకు వినియోగించాల్సిన ఆభూమిపై కొందరు కబ్జాదారులు కన్నేశారు. అధికారులను ప్రసన్నంచేసుకుని రికార్డులు ట్యాంపరింగ్‌ చేసి, మరోచోట ఉన్న సర్వేనంబర్లతో అనుమతులు తెచ్చుకుని చెరువులో నిర్మాణాలు చేపట్టారు. తాజాగా సర్వేనంబరు 21కి సమీపంలో ఉన్న సర్వేనంబరు 9/1పీలోని పట్టానంబరు 145లో 220 గజాల భూమిలో జీ+2 భవన నిర్మాణం కోసం గత ఏడాది జూన్‌లో యజమానికి జీవీఎంసీకి దరఖాస్తుచేసుకున్నారు. పరిశీలించి ప్లాన్‌ జారీ చేయాల్సిన అధికారులు పెండింగ్‌లో ఉంచేశారు. దీంతో ఆఫైల్‌ డీమ్డ్‌ అప్రూవుల్‌ అయింది. దీనిని ఆసరాగా చేసుకుని భవన నిర్మాణ పనులు ప్రారంభించారు. చెరువుపోరంబోకులో అపార్టుమెంట్‌ నిర్మిస్తుండడంతో స్థానికులు జీవీఎంసీ అధికారులకు ఫిర్యాదుచేశారు. వారు స్పందించి డీమ్డ్‌ అప్రూవ్‌ అయిన ఫైల్‌ను ఆర్‌టీఎస్‌ ద్వారా వెనక్కితెచ్చారు. తర్వాత ఆఫైల్‌పై రిమార్కులు రాసేందుకు సర్వేకు ఆదేశించారు. మధురవాడ జోన్‌ టౌన్‌సర్వేయర్‌ సర్వేచేసి ప్లాన్‌కోసం దరఖాస్తులో చూపించిన స్థలం, నిర్మాణం జరుగుతున్న స్థలం ఒకటి కాదని, చెరువులో భవనాన్ని నిర్మిస్తున్నారని ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చారు. దీంతో ఆ భవనానికి జారీచేసిన ప్లాన్‌ను రద్దుచేయాలని అధికారులు సిఫారసు చేసినప్పటికీ అప్పటికే తాత్సారం జరగడంతో ఆఫైల్‌ మళ్లీ డీమ్డ్‌ అప్రూవుల్‌ అయిపోయింది. దీంతో నిర్మాణ పనులు ఆపేయాలని టౌన్‌ప్లానింగ్‌ అధికారులు ఆదేశించగా భవన నిర్మాణదారుడు కోర్టును ఆశ్రయించాడు. కోర్టు ఇంజక్షన్‌ ఆర్డర్‌ ఇచ్చింది. ఆతరువాత అతడు నిర్మాణం కొనసాగిస్తుండడంతో అధికారులకు మళ్లీ ఫిర్యాదు అందింది. అయితే కోర్టు ఉత్తర్వులు ఉన్నందున జోక్యంచేసుకోలేమని వారు తేల్చేశారు. దీంతో నిర్మాణపనులు జోరుగా సాగుతున్నాయి.

కౌంటర్‌ దాఖలులో నిర్లక్ష్యం

ప్రభుత్వభూమి, అందునా చెరువులో నిర్మాణాలను ఉపేక్షించరాదని తెలిసినప్పటికీ, అధికారులు కోర్టులో కౌంటర్‌దాఖలు చేయకపోవడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పైగా ఒకచోట ప్లాన్‌కు అనుమతి తీసుకుని చెరువులో నిర్మిస్తున్నారని టౌన్‌సర్వేయర్‌ నిర్ధారించినప్పటికీ ఆ విషయాన్ని కోర్టుకు ఎందుకు నివేదించడం లేదని ప్రశ్నిస్తున్నారు. నిర్మాణం పూర్తిచేసిన తరువాత అందులో ఎవరైనా నివసిస్తే చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉండదు కాబట్టి, అంతవరకు నిర్మాణదారుడికి సహకరిస్తున్నారని కొందరు ఆరోపిస్తున్నారు. మధురవాడ జోన్‌లో ప్రభుత్వ భూములు, పార్కులను కబ్జా చేసి నిర్మాణాలు సాధారణంగా మారిపోయిందని, అక్కడ టౌన్‌ప్లానింగ్‌లో పనిచేసే ఓ అధికారి వైఖరే దీనికి కారమణమనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Updated Date - Jun 29 , 2026 | 01:02 AM