Share News

మహా నిర్లక్ష్యం

ABN , Publish Date - May 19 , 2026 | 12:45 AM

జీవీఎంసీ రూ.కోట్లు వెచ్చించి చేపట్టిన ప్రాజెక్టుల నిర్వహణలో అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మహా నిర్లక్ష్యం

నిరుపయోగంగా ‘సౌర విద్యుదుత్పత్తి’ ప్రాజెక్టు

స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టులో భాగంగా 2019లో రూ.7.5 కోట్లతో ప్రారంభం

జీవీఎంసీ ప్రధాన కార్యాలయంతోపాటు పదకొండుచోట్ల ప్యానళ్ల ఏర్పాటు

నెలకు రూ.లక్షల్లో బిల్లు ఆదా

మూడేళ్లుగా మూలకు చేరిన వైనం

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

జీవీఎంసీ రూ.కోట్లు వెచ్చించి చేపట్టిన ప్రాజెక్టుల నిర్వహణలో అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సౌర విద్యుదుత్పత్తి కోసం స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టులో భాగంగా రూ.7.5 కోట్ల వ్యయంతో జీవీఎంసీకి చెందిన వివిధ ప్రాంతాల్లోని 11 భవనాలపై ఏర్పాటుచేసిన సోలార్‌ ప్యానళ్లు నిర్వహణలోపంతో మూలకు చేరాయి.

సంప్రదాయేతర విద్యుత్‌ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2018లో సోలార్‌ ఎనర్జీపై దృష్టిపెట్టాలని జీవీఎంసీకి సూచించింది. దీంతో స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టులో భాగంగా రూ.7.5 కోట్ల వ్యయంతో జీవీఎంసీ ప్రధాన కార్యాలయం ఆవరణతోపాటు అన్ని జోనల్‌ కార్యాలయాలు, టీఎస్‌ఆర్‌ కాంప్లెక్స్‌లోని భవన సముదాయంపై 1.6 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన సోలార్‌ ప్యానళ్లను ఏర్పాటుచేశారు. ఈ ప్యానళ్ల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను ఏపీఈపీడీసీఎల్‌ గ్రిడ్‌కు సరఫరా అయ్యేలా ఏర్పాట్లు చేశారు. అలా ఉత్పత్తి అయిన విద్యుత్‌ను మినహాయించుకుని మిగిలిన వినియోగానికి మాత్రమే జీవీఎంసీ బిల్లు చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు. ఈ ప్రాజెక్టు వల్ల జీవీఎంసీకి ప్రతి నెలా రూ.లక్షలు ఆదా అయ్యేది. అయితే ఈ ప్రాజెక్టును నిర్వహించే సంస్థ ఒప్పందం ముగియడంతో మూడేళ్ల కిందట బాధ్యతల నుంచి తప్పుకుంది. తర్వాత వేరొకరికి నిర్వహణ బాధ్యతలు అప్పగించకపోవడంతో సోలార్‌ ప్యానళ్లు మూలకు చేరిపోయాయి. ప్యానళ్లకు ఉన్న కేబుల్‌ వైర్లు ఊడిపోవడం, ఇతర సాంకేతిక పరికరాల్లో సమస్యలు తలెత్తడంతో షార్ట్‌ సర్క్యూట్‌ జరిగి ప్రధాన కార్యాలయంలో విద్యుత్‌ సరఫరాకు ఆటంకం ఏర్పడింది. దీంతో సోలార్‌ ప్యానల్స్‌ నుంచి ఈపీడీసీఎల్‌ గ్రిడ్‌కు అనుసంధానించిన కేబుళ్లను అధికారులు తప్పించాల్సి వచ్చింది. రూ.కోట్లు వెచ్చించి ఏర్పాటుచేసిన ప్రాజెక్టు అలా నిరుపయోగంగా మారింది. ఈ విషయం స్మార్ట్‌సిటీ ఇంజనీరింగ్‌ అధికారుల వద్ద ప్రస్తావించగా జీవీఎంసీ ప్రధాన కార్యాలయంతోపాటు మిగిలిన పదకొండుచోట్ల ఏర్పాటుచేసిన సోలార్‌ ప్యానళ్ల రిపేర్లు, నిర్వహణకు టెండర్ల ప్రక్రియ ప్రారంభించామని, త్వరలోనే ఖరారు చేసి పనులు ప్రారంభిస్తామన్నారు.

Updated Date - May 19 , 2026 | 12:45 AM