Share News

మొక్కలపై మహా నిర్లక్ష్యం

ABN , Publish Date - Jun 16 , 2026 | 01:01 AM

జీవీఎంసీ హార్టీకల్చర్‌ విభాగం గాడితప్పింది.

మొక్కలపై మహా నిర్లక్ష్యం

వర్క్‌ఆర్డర్లు తీసుకున్నా పనులు ప్రారంభించని కాంట్రాక్టర్లు

జీవీఎంసీ హార్టికల్చర్‌ విభాగంలో ఇష్టారాజ్యం

ఈనెల ఒకటి నుంచి పనులు చేపట్టేలా టెండర్లు ఖరారు

ఇప్పటికీ 70 శాతం ప్రారంభించని కాంట్రాక్టర్లు

నీరు లేక ఎండిపోతున్న మొక్కలు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

జీవీఎంసీ హార్టీకల్చర్‌ విభాగం గాడితప్పింది. నగరంలో పచ్చదనం పెంచేందుకు ఈ విభాగం అధికారులు గతనెలలో పిలిచిన టెండర్లలో పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు ఇప్పటికీ పనులు ప్రారంభించలేదు. ఉన్న మొక్కలకు నీరుపోసే నాథుడు లేక ఎండలకు చనిపోతున్నాయి. మరోవైపు చనిపోయిన మొక్కల స్థానంలో కొత్తవి నాటి పచ్చదనం పెంచాల్సిన కాంట్రాక్టర్లు ఇంతవరకు ఒక్క మొక్కను కూడా నాటలేదు.

రాష్ట్ర ఆర్థిక రాజధానిగా, స్మార్ట్‌సిటీగా ఎదుగుతున్న నగరంలో పచ్చదనం పెంచేందుకు జీవీఎంసీ హార్టీకల్చర్‌ విభాగం ప్రత్యేకంగా పనిచేస్తోంది. ఒక డిప్యూటీ డైరెక్టర్‌ ఆధ్వర్యంలో ప్రతి జోన్‌కు ఒక అధికారి పర్యవేక్షణలో పనులు జరుగుతుంటాయి. బీచ్‌రోడ్డు, జాతీయరహదారితోపాటు నగరంలోని ప్రధాన రహదారుల సెంటర్‌మీడియన్లు, రోడ్డుకు ఇరువైపులా మొక్కలను పెంచడం, పార్కులు, ట్రాఫిక్‌ ఐలాండ్‌ల వద్ద లాండ్‌స్కేపింగ్‌, అంద మైన మొక్కలను నాటి వాటిని సంరక్షించడం, ట్రిమ్మింగ్‌, ప్రూనింగ్‌, చనిపోయిన మొక్కల స్థానంలో కొత్తవి నాటి పచ్చదనం పెంపొందించేందుకు ఈ విభాగం ఆధ్వర్యంలో ఏటా సుమారు రూ.50 కోట్ల వరకు ఖర్చుచేస్తుంటారు. ఇందులోభాగంగా ఈ ఏడాది జూన్‌ నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు నగరంలో ఇప్పుడున్న మొక్కలకు సమృద్ధిగా నీరుపెట్టి, కలుపుపెరగకుండా సంరక్షించడం, చనిపోయిన మొక్కలస్థానంలో కొత్తవి నాటి, పెంచడం, ఏపుగా పెరిగే మొక్కల కొమ్మలను ట్రిమ్మింగ్‌ చేయడం, వివిధప్రాంతాల నుంచి తెచ్చే అందమైన మొక్కలు చనిపోకుండా రసాయనాలతో ప్రూనింగ్‌ చేయడం కోసం రూ.20 కోట్లు ఖర్చయ్యేలా గతనెలలో టెండర్లు పిలిచారు. సుమారు 86 పనులకు కాంట్రాక్టర్లు బిడ్‌లు వేసి టెండర్లు దక్కించుకున్నారు. వారంతా జూన్‌ ఒకటి నుంచి పనులను ప్రారంభించాల్సి ఉన్నా ఇంతవరకు ప్రారంభించకపోవడంతో ఎండతీవ్రతకు పచ్చదనం మోడువారుతోంది.

వర్క్‌ఆర్డర్‌ తీసుకున్నా జాప్యం

హార్టీకల్చర్‌ టెండర్లు దక్కించుకున్నవారిలో కొద్దిమంది కాంట్రాక్టర్లు మినహా మిగిలినవారంతా ఇప్పటికే జీవీఎంసీతో ఒప్పందం చేసుకుని వర్క్‌ఆర్డర్లు తీసేసుకున్నారు. వెంటనే పనులు ప్రారంభించాల్సి ఉన్నప్పటికీ 15 రోజులు గడిచినా పట్టించుకోలేదు. మొక్కలకు నీరు పెట్టాలంటే ట్యాంకర్‌లను అద్దెకు తీసుకోవడం, కూలీల నియామకం, మొక్కల మొదళ్లవద్ద నీరు నిలబడేలా పాడి కట్టడం, కలుపు తీయడం వంటిపనులు చేయాలి. ఇందుకు భారీగా ఖర్చవుతుంది. అయితే వర్షాలు కురిసే జాప్యం చేస్తే తర్వాత ట్యాంకర్లతో నీరుపెట్టడం, కలుపుతీయడం, పాడికట్టే పనులుండవు. ఆగస్టు, సెప్టెంబరునాటికి వర్షాలు తెరిపినాస్తాయి. అప్పుడు మొక్కుబడిగా కూలీలతో కలుపు ఏరివేయించేస్తే సరిపోతుందన్నది కాంట్రాక్టర్ల భావన. అంతేకాకుండా చనిపోయిన మొక్కల స్థానంలో ఇప్పుడే కొత్తమొక్కలను నాటితే సంరక్షించేందుకు ప్రత్యేకంగా దృష్టి సారించాలి. ఒక్కరోజు నీరు పెట్టకపోయినా, ఎరువులు వేయకపోయినా చనిపోతాయి. వర్షాకాలం ప్రారంభమైతే నాటిన మొక్కలు చనిపోయాయని చెప్పి పనిచేయకుండానే బిల్లులు పొందవచ్చునని భావిస్తున్నట్టు కొందరు కాంట్రాక్టర్లే చెబుతున్నారు.

చోద్యం చూస్తున్న అధికారులు

వర్క్‌ఆర్డర్లు తీసుకున్న వెంటనే పనులు ప్రారంభించేలా కాంట్రాక్టర్లపై ఒత్తిడిచేయాల్సిన అధికారులు చోద్యంచూస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. హార్టీకల్చర్‌ విభాగంలోని కొంతమంది కాంట్రాక్టర్లు అధికారుల బలహీనతలను తమకు అనుకూలంగా మలచుకుని, బ్లాక్‌మెయిల్‌చేస్తూ బిల్లులకు ఢోకాలేకుండా చేసుకుంటున్నారనే విమర్శలున్నాయి. అధికారులు వారిని పనిచేయమని అడిగేసాహసం చేసే పరిస్థితి లేదని బహిరంగంగానే వాదన వినిపిస్తోంది. కాంట్రాక్టర్లు పనులు ప్రారంభించకపోయినా జూన్‌ ఒకటి నుంచే పనులు చేసినట్టు చూపించి, బిల్లులు డ్రా చేసుకుంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై హార్టీకల్చర్‌ ఏడీ వాసుకి వద్ద ప్రస్తావించగా కొంతమంది ఇంకా పనులు ప్రారంభించాల్సి ఉందని, వారందరితో సమావేశం ఏర్పాటుచేసి తక్షణం ప్రారంభించాలని ఆదేశించామన్నారు. పనులు చేయని కాలానికి బిల్లులు చెల్లించే ప్రసక్తే లేదన్నారు.

Updated Date - Jun 16 , 2026 | 01:01 AM