Share News

మేయర్‌ సీటుపై పట్టు

ABN , Publish Date - Oct 11 , 2026 | 12:39 AM

విశాఖపట్నం మహా నగరం. రాష్ట్రంలో చాలా ప్రధానమైనది.

మేయర్‌ సీటుపై పట్టు

కూటమిలో తీవ్రమైన పోటీ

తాము చాలా బలంగా ఉన్నామంటున్న టీడీపీ

2019లో రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ గెలిచినా నగరంలో నాలుగు సీట్లూ గెలుచుకున్న విషయాన్ని గుర్తుచేస్తున్న నేతలు

‘విశాఖ’ తమకు కేటాయించాలని కోరుతున్నట్టు స్వయంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌ వెల్లడి

జనసేన ఆశిస్తున్నట్టు తాజాగా ప్రచారం

ఏ పార్టీకి దక్కేనో అవకాశం?

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విశాఖపట్నం మహా నగరం. రాష్ట్రంలో చాలా ప్రధానమైనది. ఇక్కడ రాజకీయంగా బలంగా ఉండాలని ప్రతి పార్టీ కోరుకుంటుంది. ఈసారి జీవీఎంసీ మేయర్‌ పదవికి ప్రత్యక్ష ఎన్నిక నిర్వహిస్తుండడంతో మరింత ప్రాధాన్యం ఏర్పడింది. ఆ సీటుకు తగిన వ్యక్తిని పోటీలో దించాల్సిన బాధ్యత పార్టీలపై పడింది. కూటమిలో మూడు రాజకీయ పార్టీలు ఉన్నాయి. మేయర్‌గా పోటీ చేసే అవకాశం ఏ పార్టీకి దక్కుతుందనేది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

స్థానికంగా ఉండే బలాన్ని బట్టి సీటును ఆశించాలి. అయితే మూడు పార్టీల (టీడీపీ, బీజేపీ, జనసేన) నేతలు ఎవరికి వారు విశాఖలో తాము బలంగా ఉన్నామని చెబుతున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ రాష్ట్రం అంతటా గెలిచినా విశాఖలో మాత్రం ఓడిపోయింది. నగరంలోని నాలుగు స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. 2024 ఎన్నికల్లో సైతం నాలుగు స్థానాల్లో విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థులకు భారీ మెజారిటీలు వచ్చాయి. అందువల్ల టీడీపీ నుంచే మేయర్‌ అభ్యర్థి ఉంటారని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. ఆ కోణంలో ప్రస్తుత నాయకుల వారసులు అంతా మేయర్‌ స్థానం కోసం పోటీ పడుతున్నారు. మరికొందరు నేతలు కోసం మేయర్‌ అభ్యర్థిత్వం ఆశిస్తున్నారు.

ఇక బీజేపీ విషయానికి వస్తే తాము విశాఖపట్నం మేయర్‌ స్థానాన్ని అడుగుతున్నామని స్వయంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవే చెబుతున్నారు. విశాఖపట్నం అభివృద్ధిలో బీజేపీ పాత్ర చాలా ఉందని ఆయన అంటున్నారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న రైల్వే జోన్‌ ఇచ్చారని, స్టీల్‌ ప్లాంటుకు ఆర్థిక సాయం చేశారని, గూగుల్‌ డేటా సెంటర్‌, సెమీ కండక్టర్‌ పరిశ్రమ రావడానికి సహకరించామని ఆ విధంగా మేయర్‌గా బీజేపీ అభ్యర్థిని గెలిపించాల్సిందిగా విశాఖ ప్రజలను అడిగే అర్హత తమకు ఉందని అంటున్నారు. దానికి తగ్గట్టుగానే ఆ పార్టీ నుంచి కొందరు పోటీకి ఉత్సాహం చూపిస్తున్నారు.

ఇదిలావుండగా విశాఖ మేయర్‌ సీటును జనసేన పార్టీ కోరుతున్నట్టు తాజాగా ప్రచారం జరుగుతోంది. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఈ మాట వినపడుతోంది. జనసేన పార్టీ విశాఖపై ఎప్పుడూ ప్రత్యేకమైన దృష్టి పెడుతూ పనిచేస్తోంది. స్టీల్‌ ప్లాంటు ప్రైవేటీకరణ ఆగిందంటే...అది తమ నాయకుడు పవన్‌కల్యాణ్‌ ఢిల్లీలో చేసిన సంప్రతింపులే కారణమని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. గతంలో డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ప్రైవేటీకరణ కూడా తమ వల్లనే ఆగిందని చెబుతున్నారు. ఈ మూడు పార్టీల్లో ఏ పార్టీ నుంచి మేయర్‌ అభ్యర్థిని బరిలో దించినా కేవలం రాజకీయ నేపథ్యం ఒక్కటే కాకుండా ప్రజా సమస్యలపై అవగాహన, నగరాన్ని అభివృద్ధి చేయగలిగిన వారైతే బాగుంటుందని ఎక్కువ మంది ప్రజలు ఆశిస్తున్నారు. ఎవరికి అవకాశం దక్కుతుందో చూడాలి మరి.

Updated Date - Oct 11 , 2026 | 12:39 AM