పాఠశాలల్లో పచ్చదనం
ABN , Publish Date - Jul 03 , 2026 | 12:39 AM
పర్యావరణ పరిరక్షణలో భాగంగా విద్యా సంస్థల్లో పచ్చదనం పెంపుతోపాటు విద్యార్థులకు సమృద్ధిగా ఆక్సిజన్ అందేలా చూడడానికి రాష్ట్ర ప్రభుత్వం ‘చిట్టడవుల’ పెంపకానికి శ్రీకారం చుట్టింది.
అనంత అరణ్యాల పేరుతో గురుకులాలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లలో మొక్కలు నాటే కార్యక్రమం
ఒక్కో పాఠశాలలో 1,600 మొక్కలు నాటాలని లక్ష్యం
పర్యావరణ పరిరక్షణతోపాటు విద్యార్థులకు పుష్కలంగా ప్రాణవాయువు
రెండేళ్లపాటు వీబీ-జీరామ్‌జీ కింద నిర్వహణ
రెండో విడతలో అన్ని పాఠశాలల్లో అమలు
చోడవరం, జూలై 2 (ఆంధ్రజ్యోతి): పర్యావరణ పరిరక్షణలో భాగంగా విద్యా సంస్థల్లో పచ్చదనం పెంపుతోపాటు విద్యార్థులకు సమృద్ధిగా ఆక్సిజన్ అందేలా చూడడానికి రాష్ట్ర ప్రభుత్వం ‘చిట్టడవుల’ పెంపకానికి శ్రీకారం చుట్టింది. వికసిత్ భారత్ - గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా గ్రామీణ్ (వీబీ-జీరామ్‌జీ) పథకం కింద ‘అనంత అరణ్యాలు’ పేరిట తొలిదశలో జిల్లాలోని అన్ని సాంఘిక సంక్షేమ శాఖ గురుకులాలు, మహాత్మా ఫూలే బీసీ గురుకులాలు, కేబీజీవీలు, మోడల్ స్కూళ్లతోపాటు ఎంపిక చేసిన ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో విరివిగా మొక్కలు నాటుతారు. కొన్ని పాఠశాలల్లో ఇప్పటికే మొక్కలు నాటే పనులు మొదలయ్యాయి. ఎక్కువమంది విద్యార్థులు ఉండే చోట వారికి అవసరమైన ఆక్సిజన్ పుష్కలంగా లభించేలా చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. మామిడి, జామ, కమల, నారింజ వంటి పండ్ల రకాల మొక్కలు, మునగ, కరివేపాకు ఔషధ గుణాలు వున్న మొక్కలు, పూలజాతికి చెందిన మందార, బంతి. చామంతితోపాటు తీగజాతి కూరగాయల మొక్కలు పెంచుతారు. మొత్తం మీద 80 రకాల మొక్కలను ఎంపిక చేశారు. ఆయా పాఠశాలలు, వసతిగృహాల ఆవరణల్లోని ఖాళీ స్థలాల్లో వీటిని పెంచుతారు. ప్రతి విద్యాసంస్థలో 1,600 మొక్కలు నాటాలని ప్రభుత్వం ఆదేశించింది. వీబీ-జీరామ్‌జీ పథకం కింద చేపట్టిన ఈ ‘అనంత అరణ్యాలు’ కార్యక్రమం.. రెండో విడతలో మిగిలిన అన్ని పాఠశాలల్లో అమలు చేస్తారు. వీబీ-జీరామ్‌జీ శ్రామికులు ఆయా పాఠశాలల ఆవరణల్లో గోతులు తీసి, మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించే బాధ్యత చేపడతారు. మొక్కల పెంపకాన్ని డ్వామా అధికారులతోపాటు, ఆయా గురుకులాల ప్రిన్సిపాళ్లు, హాస్టళ్ల వార్డెన్లు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పర్యవేక్షించాల్సి వుంటుంది. ‘అనంత అరణ్యాలు’ కార్యక్రమంలో భాగంగా పండించే కూరగాయలు, ఆకుకూరలను ఆయా వసతిగృహాల్లో వినియోగిస్తారు. క్రమపద్ధతిలో నాటే పూల మొక్కలు ఆయా విద్యా సంస్థలకు మరింత శోభను చేకూర్చే అవకాశం ఉంది.
రెండేళ్లపాటు నిర్వహణ బాధ్యతలు
పి.శ్రీనివాస్, డ్వామా ఏపీడీ, చోడవరం
అనంత అరణ్య పఽథకం కింద మొక్కల పెంపకం నిర్వహణకు అయ్యే ఖర్చును రెండేళ్లపాటు ప్రభుత్వమే భరిస్తుంది. మొక్కల సరఫరా దగ్గరనుంచి, వాటిని నాటించడం, నీరు పోయడం వంటి పనులను వీబీ-జీరామ్‌జీ శ్రామికులు (ఉపాధి కూలీలు) చేస్తారు.