గ్రీన్ వైజాగ్, హెల్తీ వైజాగ్
ABN , Publish Date - Jun 13 , 2026 | 12:51 AM
విశాఖను పచ్చదనం, ఆరోగ్యకర జీవనశైలి, పర్యావరణం, రవాణా, వారసత్వ పరిరక్షణకు ఆదర్శ నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో జీవీఎంసీ వినూత్న కార్యక్రమాలను చేపడుతోందని జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
జీవీఎంసీ ప్రత్యేక కార్యాచరణ
సాగర్‌నగర్, ఆరిలోవల్లో సైకిల్ ట్రాక్‌లు
వెంకోజీపాలెం, జూన్ 12(ఆంధ్రజ్యోతి):
విశాఖను పచ్చదనం, ఆరోగ్యకర జీవనశైలి, పర్యావరణం, రవాణా, వారసత్వ పరిరక్షణకు ఆదర్శ నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో జీవీఎంసీ వినూత్న కార్యక్రమాలను చేపడుతోందని జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. నగరంలో 60 థీమ్ పార్కులు, సైక్లింగ్ ట్రాక్‌లు, హెరిటేజ్ వాకింగ్ ట్రాక్‌ను అభివృద్ధి పరచనున్నట్టు పేర్కొన్నారు. జీవీఎంసీ పరిధిలో ప్రస్తుతం 174 పార్కులు ఉన్నాయని, అందులో కొన్నింటిని రూ.10.97 కోట్లతో ప్రత్యేక థీమ్ పార్కులుగా అభివృద్ధి చేయనున్నామన్నారు.
ప్రతి సోమవారం సైక్లింగ్ డే
ప్రజల ఆరోగ్య పరిరక్షణ, కాలుష్య నియంత్రణ, ఇంధన పొదుపు లక్ష్యాలతో జీవీఎంసీ పరిధిలో ప్రతి సోమవారాన్ని సైక్లింగ్ డేగా స్వచ్ఛందంగా ఆచరించాలని నిర్ణయించామని కమిషన్ తెలిపారు. ఈ మేరకు అన్ని శాఖాధిపతులు, జోనల్ కమిషనర్లకు ఆదేశాలు జారీచేశామని, అధికారులు, ఉద్యోగులు, కార్యాలయాలకు వీలైనంత మేర సైకిళ్లపై రావాలని సూచించామన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఆచరించాలన్నారు. సైక్లింగ్ వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడడం, మానసిక ఉల్లాసం పెరగడం వంటి అనేక లాభాలు ఉన్నాయన్నారు.
ప్రత్యేక సైకిల్ ట్రాక్‌లు
సాగర్‌నగర్ బీచ్ సమీపంలో 10 అడుగులు వెడల్పు, 700 మీటర్లు పొడవున రూ.2 కోట్లతో సైక్లింగ్ ట్రాక్ అభివృద్ధి చేస్తామన్నారు. అలాగే ఆరిలోవ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ పరిసర ప్రాంతంలో 2.7 మీటర్లు వెడల్పు, 5.20 కిలోమీటర్లు పొడవునా సుమారు రూ.3 కోట్లతో సైక్లింగ్ ట్రాక్‌లను అభివృద్ధి చేస్తామన్నారు. నగర వారసత్వ సంపదను చేరువ చేయడానికి జీవీఎంసీ దక్షిణ జోన్‌లో హెరిటేజ్ వాకింగ్ ట్రాక్‌ను పూర్ణామార్కెట్ నుంచి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ వరకు 1.2 కిలోమీటర్లు పొడవునా 7.5 అడుగులు వెడల్పుతో అభివృద్ధి చేస్తామన్నారు. ఇందుకు రూ.42 లక్షలు వెచ్చిస్తామన్నారు. థీమ్ పార్కులు, సైక్లింగ్, హెరిటేజ్ వాకింగ్ వంటి కార్యక్రమాల్లో అధికారులు, ఉద్యోగులు, ప్రజలందరూ పాలుపంచుకోవాలని, గ్రీన్‌వైజాగ్-హెల్తీ వైజాగ్ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరుతున్నామని కమిషనర్ పిలుపునిచ్చారు.
తెరుచుకున్న బడులు
కొత్తగా చేరిన పిల్లలకు చాక్లెట్లు, పువ్వులతో స్వాగతం
తొలి రోజు 35 శాతం మంది హాజరు
విశాఖపట్నం, జూన్ 12 (ఆంధ్రజ్యోతి):
వేసవి సెలవులు అనంతరం శుక్రవారం పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి, ఆరో తరగతుల్లో చేరినవారికి విద్యార్థులు, ఉపాధ్యాయలు చాక్లెట్లు, పువ్వులు ఇచ్చి స్వాగతం పలికారు. తొలిరోజు పాఠశాలకు వచ్చిన విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, యూనిఫాం పంపిణీ చేశారు. మధ్యాహ్నం భోజనం పెట్టారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 65 వేల మంది విద్యార్థులకుగాను తొలిరోజు 22 వేల మంది (35 శాతం) హాజరయ్యారు. ఈనెల 16న అమావాస్య కావడంతో ఎక్కువ మంది 17వ తేదీ...బుధవారం నుంచి పాఠశాలలకు వచ్చే అవకాశం ఉంది. కాగా జిల్లా విద్యాశాఖాధికారి ఎన్.ప్రేమకుమార్ నగరంలో పలు పాఠశాలలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు.
వారాంతాల్లో అప్పన్న అంతరాలయ దర్శనాలు రద్దు
సింహాచలం, జూన్ 12 (ఆంధ్రజ్యోతి):
వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానంలో శని, ఆదివారాలు అంతరాలయ దర్శనాలు రద్దు చేసినట్టు కార్యనిర్వాహణాధికారి జల్లేపల్లి వెంకటరావు ప్రకటించారు. ఈ మేరకు సింహగిరిపై పీఆర్‌ఓ కార్యాలయం వద్ద ప్రత్యేక బోర్డులను ఏర్పాటుచేశారు. ఆయా రోజుల్లో అంతరాలయ ప్రవేశాలను పూర్తిగా నిలిపివేసి, భక్తులందరికీ నీలాద్రి గుమ్మం నుంచి మాత్రమే స్వామివారి దర్శనాలు కల్పించనున్నట్టు పేర్కొన్నారు.