Share News

సీలేరు పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టుకు గ్రీన్‌సిగ్నల్‌

ABN , Publish Date - Jul 26 , 2026 | 11:13 PM

సీలేరులో భారీ పంప్డ్‌ స్టోరేజ్‌ ప్రాజెక్టు నిర్మాణానికి పూర్తిస్థాయి పర్యావరణ, అటవీశాఖ అనుమతులు రావడంతో ఈ ప్రాజెక్టు పనులు శరవేగంగా జరగనున్నాయి.

సీలేరు పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టుకు గ్రీన్‌సిగ్నల్‌
గురుకుల పాఠశాల వద్ద మెగా కంపెనీ కార్యాలయాలు, సిబ్బంది క్వార్టర్స్‌ నిర్మించే ప్రదేశం

పర్యావరణ, అటవీ అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన అటవీశాఖ ముఖ్య కార్యదర్శి

పనుల వేగవంతానికి మెగా ఇంజనీరింగ్‌ కంపెనీ చర్యలు

సీలేరు, జూలై 26 (ఆంధ్రజ్యోతి): సీలేరులో భారీ పంప్డ్‌ స్టోరేజ్‌ ప్రాజెక్టు నిర్మాణానికి పూర్తిస్థాయి పర్యావరణ, అటవీశాఖ అనుమతులు రావడంతో ఈ ప్రాజెక్టు పనులు శరవేగంగా జరగనున్నాయి. ఏడాది క్రితమే ఈ ప్రాజెక్టు మొదటి దశ(స్టేజ్‌ వన్‌) అనుమతులు మంజూరు కావడంతో నిర్మాణ పనులకు భూమి పూజ చేసి పనులు ప్రారంభించడానికి ప్రాజెక్టు టెండర్లు దక్కించుకున్న మెగా ఇంజనీరింగ్‌ కంపెనీ ప్రయత్నాలు చేసింది. దీంతో ఈ ప్రాంత నిర్వాసితులు ప్రాజెక్టుకు పూర్తిస్థాయి అనుమతులు రానిదే ఎలా పనులు ప్రారంభిస్తారని?, తమకు నష్టపరిహారం ఇచ్చిన తరువాతే పనులు ప్రారంభించాలని ఆందోళన చేయడంతో నిర్మాణ పనులు నిలిపివేశారు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం పర్యావరణ, అటవీశాఖ అనుమతులు ఏపీ జెన్‌కోకు లభించాయి.

పంప్డ్‌ స్టోరేజ్‌ ప్రాజెక్టు కోసం 128.61 హెక్టార్ల (వాస్తవానికి ప్రతిపాదించిన ప్రాంతం 193.01 హెక్టార్లు) అటవీశాఖ భూమిని అటవీయేతర వినియోగానికి కేటాయించారు. దీంతో ఆరు దశాబ్దాల చరిత్ర గల సీలేరు జల విద్యుత్‌ కేంద్రం ఇప్పుడు ఆధునిక సాంకేతికతతో సరికొత్త రూపు సంతరించుకోబోతుంది. కేవలం జల విద్యుదుత్పత్తికే పరిమితం కాకుండా రాష్ర్టాన్ని విద్యుత్‌ మిగులు దిశగా నడిపించేలా భారీ పంప్డ్‌ స్టోరేజ్‌ ప్రాజెక్టుగా రూపాంతరం చెందుతుంది. ఆరు దశాబ్దాల క్రితం స్విట్జర్లాండ్‌ సాంకేతికతతో మొదలై ఇప్పుడు స్వదేశీ బెల్‌ (బీహెచ్‌ఈఎల్‌) సహకారంతో ప్రపంచ స్థాయి పంప్డ్‌ స్టోరేజ్‌ టెక్నాలజీ వైపు అడుగులు వేస్తోంది. ఇది భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే రెండవ పెద్ద ప్రాజెక్టు. ఒక్కొక్కటి 150 మెగావాట్ల సామర్థ్యం కలిగిన తొమ్మిది వర్టికల్‌ ఫ్రాన్సిస్‌ రివర్సబుల్‌ పంపు టర్బైన్లు, సింక్రనైజ్డ్‌ మోటార్‌ జనరేటర్‌ సెట్లు ఏర్పాటు కానున్నాయి. 1,350 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యంతో కొత్త ప్రాజెక్టు అందుబాటులోకి రానుంది. పంప్డ్‌ స్టోరేజ్‌ ప్రాజెక్టు కోసం గుంటవాడ ఎగువ రిజర్వాయర్‌, డొంకరాయి దిగువ రిజర్వాయర్‌ను వినియోగిస్తారు. పగటి వేళల్లో పునరుత్పాదక విద్యుత్‌ అదనంగా ఉన్నప్పుడు ఎగువ రిజర్వాయర్‌కు నీటిని ఎత్తిపోసి పీక్‌ డిమాండ్‌ వేళల్లో ఆ నీటిని కిందకు వదులుతూ విద్యుదుత్పత్తి చేస్తారు. ఇందుకు సుమారు 1.70 టీఎంసీల నీరు అవసరం అవుతుంది. ఈ ప్రాజెక్టు 2029 సంవత్సరం నాటికి పూర్తి చేయాలన్నది లక్ష్యం. ఈ ప్రాజెక్టు ద్వారా ఏటా సుమారు 3,500 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ గ్రిడ్‌కు అందుతుందని అంచనా. మన్యంలో అధిక వర్షాలు పడుతూ ఉంటాయి. విద్యుదుత్పత్తికి అవసరమైన నీటి ప్రవాహం నిరంతరం ఉంటుంది. గుంటవాడ రిజర్వాయర్‌ మూడున్నర టీఎంసీల సామర్థ్యం కలిగి ఉంది. నూతనంగా నిర్మించబోయే పంప్డ్‌ స్టోరేజ్‌ ప్రాజెక్టు విద్యుదుత్పత్తికి 1.7 టీఎంసీల నీరు మాత్రమే వినియోగిస్తారు. మిగిలిన నీరు రిజర్వాయర్‌లోనే ఉంటుంది. ఈ నీటినే సీలేరు జల విద్యుత్‌ కేంద్రంలో విద్యుదుత్పత్తికి వినియోగిస్తారు. ప్రస్తుతం సీలేరు జల విద్యుత్‌ కేంద్రం ద్వారా ఏటా సుమారు 575 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ అందుతోంది. తొలి దశలో ఏర్పాటు చేసిన రెండు యూనిట్లు 1967-68లో ఏర్పాటయ్యాయి. ఈ యూనిట్లను స్విట్జర్లాండ్‌ టెక్నాలజీతో రూపొందించారు. 1994-95లో మరో రెండు యూనిట్లు ఏర్పాటు చేశారు. వీటిని భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌ వృద్ధి చేసింది. ఈ పంప్డ్‌ స్టోరేజ్‌ ప్రాజెక్టు పూర్తయితే ఉపాధి అవకాశాలు భారీగానే ఉంటాయి. సీలేరు జల విద్యుత్‌ కేంద్రం దిగువన ఉన్న పార్వతీనగర్‌ వద్ద ఈ ప్రాజెక్టును నిర్మించనున్నారు.

ఊపందుకోనున్న పనులు

మెగా ఇంజనీరింగ్‌ కంపెనీ వాహనాల ఇంధనం కోసం జల విద్యుత్‌ కేంద్రం వెనుక స్విచ్‌ యార్డుకు సమీపంలో ఒక పెట్రోల్‌ బంక్‌ను కూడా ఇప్పటికే సిద్ధం చేసింది. అలాగే అండర్‌ గ్రౌండ్‌ టన్నెల్‌ పనుల్లో భాగంగా ఇక్కడ కాంక్రీట్‌ పనుల కోసం అవసరమైన కాంక్రీట్‌ ప్లాంట్‌ సైలో పరికరాన్ని కూడా మెగా కంపెనీ సిద్ధం చేసింది. సీలేరు పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టుకు పూర్తిస్థాయి రెండవ దశ పర్యావరణ, అటవీ అనుమతులు లభించడంతో నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోయాయి. ప్రాజెక్టు పట్టాలెక్కుతుండడంతో సీలేరు ఖాతాలో మరో 1,350 మెగావాట్ల విద్యుదుత్పత్తి పెరగనుంది.

Updated Date - Jul 26 , 2026 | 11:13 PM