పల్లె పండుగ బిల్లులకు మోక్షం
ABN , Publish Date - May 12 , 2026 | 01:38 AM
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మెటీరియల్ కాంపోనెంట్ కింద చేపట్టిన పల్లె పండుగ-2.0 పనులకు ఎట్టకేలకు బిల్లుల చెల్లింపులు మొదలయ్యాయి.
జిల్లాకు రూ.23 కోట్లు విడుదల
జనవరిలోగా పూర్తయిన పనులకు చెల్లింపులు
ఇంకా రూ.130 కోట్లకుపైగా పెండింగ్
(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మెటీరియల్ కాంపోనెంట్ కింద చేపట్టిన పల్లె పండుగ-2.0 పనులకు ఎట్టకేలకు బిల్లుల చెల్లింపులు మొదలయ్యాయి. జిల్లాలో రూ.156 కోట్ల వరకు బిల్లులు పెండింగ్‌లో వుండగా, ఇటీవల కేంద్రం ఇటీవల రాష్ట్రానికి విడుదల చేసిన నిధుల్లో జిల్లాకు రూ.23 కోట్లు కేటాయించింది. జనవరి నెలాఖరు వరకు పూర్తయిన పనులకు బిల్లుల చెల్లింపులు జరుగుతున్నాయి.
పల్లె పండుగ-2 కార్యక్రమం కింద గత ఆర్థిక సంవత్సరం (2025-26)లో ఉపాధి హామీ పథకం మెటీరియల్ కాంపోనెంట్ నిధులతో జిల్లాలో 1,830 పనులు చేపట్టేందుకు అధికారులు గత ఏడాది అక్టోబరులో ప్రతిపాదించారు. సిమెంటు రహదారులకు రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు మంజూరుచేసి, పీఆర్ ఇంజనీర్ల ఆధ్వర్యంలో నిర్మాణ పనులు చేపట్టారు. దీంతో పలు గ్రామాల్లో అధ్వానంగా వున్న రహదారులు కొత్త రూపును సంతరించుకున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి చివరిలోగా పూర్తిచేసి, బిల్లులు అప్‌లోడ్ చేసిన పనులకు మార్చి నెలాఖరునాటికి బిల్లులు చెల్లిస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ వెల్లడించారు. దీంతో ఫిబ్రవరి నాటికి పూర్తిచేసిన 1,384 సీసీ రోడ్లు, 26 బీటీ రోడ్లు, గిరిజన గ్రామాల్లో ఆరు కచ్చా రహదారుల నిర్మాణ పనులు కలిపి మొత్తం 1,416 పనులకు సంబంధించి రూ.156 కోట్ల మేర బిల్లులను అప్‌లోడ్ చేశారు. కానీ ఏప్రిల్ నాటికి రెండు నెలలు గడిచినప్పటికీ నిధులు విడుదల కాలేదు. దీంతో మిగిలిన 414 పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడంలేదు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న ఉపాధి హామీ పథకం నిధుల్లో ఎక్కువ శాతం సొమ్మును కూలీలకు కేటాయించడం వల్ల మెటీరియల్ కాంపోనెంట్ కింద చేపట్టిన బిల్లుల చెల్లింపుల్లో జాప్యం అవుతున్నట్టు తెలిసింది. బిల్లుల పెండింగ్‌పై ‘ఆంధ్రజ్యోతి’లో గత నెల 29వ తేదీ ‘పనులయ్యాయి.. బిల్లులు ఏవీ?’ అనే శీర్షికతో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. వారం, పది రోజుల్లో బిల్లులు మంజూరవుతాయని అధికారులు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం కేంద్ర ప్రభుత్వానికి పలుమార్లు లేఖలు రాసింది. దీంతో స్పందించిన కేంద్ర ప్రభుత్వం.. మెటీరియల్ కాంపోనెంట్ పనులకు బిల్లుల చెల్లింపు కోసం రాష్ట్రానికి నిధులు విడుదల చేసింది. ఇందులో రూ.23 కోట్లు అనకాపల్లి జిల్లాకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ ఏడాది జనవరి నెలాఖరు వరకు పూర్తయిన పనులకు బిల్లులు చెల్లింపులు మొదలయ్యాయి. తరువాత మిగిలిన పనులకు దశల వారీగా బిల్లుల చెల్లింపు జరుగుతుందని డ్వామా పీడీ సీహెచ్ నిర్మాలాదేవి ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.