రైల్వే జోన్ ఆపరేషన్స్‌కు గ్రీన్‌సిగ్నల్
ABN , Publish Date - Feb 17 , 2026 | 01:48 AM
ఉత్తరాంధ్ర ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కొత్త రైల్వే జోన్ (దక్షిణ కోస్తా) కార్యాలయం ఏప్రిల్ నుంచి పనిచేసే సూచనలు కనిపిస్తున్నాయి.
ఏప్రిల్ 1 నుంచి కార్యకలాపాలు
నాలుగు రోజుల క్రితం మూడు జోన్ల జీఎంలతో రైల్వే బోర్డు సమావేశం
విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా జోన్ కార్యాలయం పనిచేసేలా సూత్రప్రాయంగా నిర్ణయం
గెజిట్ నోటిఫికేషన్‌కు సన్నాహాలు
తాత్కాలికంగా సిరిపురం జంక్షన్‌లోని ‘ది డెక్’లో ఆఫీస్ ప్రారంభం
విశాఖపట్నం, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి):
ఉత్తరాంధ్ర ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కొత్త రైల్వే జోన్ (దక్షిణ కోస్తా) కార్యాలయం ఏప్రిల్ నుంచి పనిచేసే సూచనలు కనిపిస్తున్నాయి. విశాఖకు కేంద్రం కొత్త రైల్వే జోన్ ప్రకటించినా, పూర్తిస్థాయిలో పనిచేసే విధంగా ఆదేశాలు ఇవ్వడంలో తాత్సారం చేస్తూ వస్తోంది. విశాఖ కేంద్రంగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు జనరల్ మేనేజర్‌గా సందీప్ మాధుర్‌ను గత ఏడాది జూన్‌లో నియమించారు. ఆయన పనిచేయడానికి సిరిపురంలో వీఎంఆర్‌డీఏ డెక్‌లో రెండు అంతస్థులు అద్దెకు తీసుకున్నారు. ఆఫీస్ మొత్తం సిద్ధమైపోయింది. పదుల సంఖ్యలో అధికారులను కూడా నియమించారు. మరోవైపు ముడసర్లోవలో శాశ్వత జోన్ కార్యాలయం పనులు రూ.172 కోట్లతో జరుగుతున్నాయి. అయితే ఈ కొత్త జోన్ ఆపరేషన్ మొదలు కావాలంటే గెజిట్ నోటిఫికేషన్ రావాలి. దానిని జారీ చేయడంలో రైల్వే బోర్డు జాప్యం చేస్తోంది. విశాఖ ఎంపీ శ్రీభరత్ పార్లమెంటు సమావేశాలకు ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కలిసి జోన్ కార్యకలాపాలు ప్రారంభించాలని కోరుతున్నారు. విజయదశమి అని ఒకసారి, సంక్రాంతి అని మరోసారి తేదీలు ప్రకటించారు. కానీ గెజిట్ నోటిఫకేషన్ రాలేదు. కొద్దిరోజుల క్రితం సీఎం చంద్రబాబునాయుడు ఢిల్లీ వెళ్లినప్పుడు రైల్వేజోన్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. దాంతో రైల్వే బోర్డు అధికారులు మూడు రోజుల క్రితం అంటే శుక్రవారం సాయంత్రం మూడు రైల్వే జోన్ల (తూర్పు కోస్తా, దక్షిణ మధ్య, దక్షిణ కోస్తా-విశాఖపట్నం) జనరల్ మేనేజర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. కొత్తజోన్ ఏర్పాటు నేపథ్యంలో కొత్త డివిజన్ల ఏర్పాటు, సిబ్బంది సర్దుబాటు, బదిలీలు, నియామకాలపై చర్చించారు. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి విశాఖలో దక్షిణ కోస్తా జోన్ కార్యాలయం పనిచేసే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని సూచనప్రాయంగా తెలియజేశారు. ఈ జోన్‌పై కేంద్రం వద్ద ఉన్న సమగ్ర ప్రాజెక్టు నివేదిక ప్రకారం రైల్వే లైన్లు, స్టేషన్ల మార్పు, అధికారులు, సిబ్బంది బదిలీలు జరగనున్నాయి. అధికారుల కొరత ఉండడంతో తూర్పు కోస్తా రైల్వే అధికారులు గత కొద్దికాలంగా పదవీ విరమణ చేసిన వారిని తిరిగి ఉద్యోగాల్లోకి రావాలని ఆహ్వానిస్తున్నారు. రైల్వేలో 65 ఏళ్ల వరకు పనిచేసే అవకాశం ఉండడంతో కనీసం ఏడాది పనిచేసే అవకాశం ఉన్నవారందరినీ తీసుకోవడానికి యత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే నెలలో గెజిట్ నోటిఫికేషన్ వస్తుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. విశాఖ కేంద్రంగా పనిచేసే జోన్‌లో వాల్తేరు డివిజన్ విశాఖపట్నం డివిజన్‌గా పేరు మార్చుకుని కొనసాగుతుంది. దాంతో పాటు విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లు ఉంటాయి. ఒడిశాకు చెందిన ప్రాంతాలన్నీ కొత్తగా ఏర్పాటుచేసే రాయగడ డివిజన్ (తూర్పు కోస్తా)లోకి వెళ్లిపోతాయి. కొత్తవలస నుంచి అరకులోయ వరకూ మార్గం అంతా రాయగడ డివిజన్‌లో చేర్చారు.