రైల్వే జోన్‌కు గ్రీన్ సిగ్నల్
ABN , Publish Date - May 06 , 2026 | 01:15 AM
ఉత్తరాంధ్ర ప్రజల నలభై ఏళ్ల పోరాటం ఫలించింది. విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే జోన్ ఏర్పాటైంది.
జూన్ ఒకటో తేదీ నుంచి విశాఖ కేంద్రంగా ‘దక్షిణ కోస్తా రైల్వే జోన్’ కార్యకలాపాలు ప్రారంభం
గెజిట్ విడుదల చేసిన రైల్వే శాఖ
‘ది డెక్’లో తాత్కాలికంగా కార్యాలయం
నలభయ్యేళ్ల కల...నేటికి సాకారం
విశాఖపట్నం, మే 5 (ఆంధ్రజ్యోతి):
ఉత్తరాంధ్ర ప్రజల నలభై ఏళ్ల పోరాటం ఫలించింది. విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే జోన్ ఏర్పాటైంది. జూన్ ఒకటో తేదీ నుంచే కార్యకలాపాలు ప్రారంభించనున్నట్టు మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇది రాజకీయాలకు అతీతంగా ఈ ప్రాంత ప్రజలు సాధించిన విజయం. ఆపరేషన్ల ప్రారంభానికి వీలుగా గెజిట్ విడుదల చేయడంతో విశాఖపట్నంలో సంబరాలు మిన్నంటాయి. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు విశాఖపట్నం రైల్వే స్టేషన్ వద్దకు చేరుకుని సంబరాలు నిర్వహించారు. రైల్వే పరంగా విశాఖలో కొత్త శకం ప్రారంభం కానుందని నాయకులు ప్రకటించారు.
వాల్తేరు డివిజన్ పోయి విశాఖపట్నం డివిజన్
తూర్పు కోస్తా రైల్వే జోన్ పరిధిలో విశాఖపట్నం ‘వాల్తేరు డివిజన్’గా ఇన్నాళ్లూ కొనసాగింది. ఇప్పుడు విశాఖ కేంద్రంగా ‘దక్షిణ కోస్తా రైల్వే జోన్’ ఏర్పాటైంది. అందులో విజయవాడ, గుంటూరు, గుంతకల్‌తో పాటు నాలుగో డివిజన్‌గా విశాఖపట్నాన్ని చేర్చారు. ప్రస్తుతం ఉన్న వాల్తేరు డివిజన్‌ను రెండుగా విభజించి ఒక భాగంతో ‘రాయగడ డివిజన్’ను కొత్తగా ప్రకటించి తూర్పు కోస్తా రైల్వేలో కలిపారు. మిగిలిన భాగాలతో వాల్తేరు డివిజన్ స్థానే ‘విశాఖపట్నం డివిజన్’ ఏర్పాటు చేశారు.
ఇదీ విశాఖ డివిజన్ పరిధి
ఇచ్ఛాపురం-పలాస-విశాఖపట్నం-దువ్వాడ 270 కి.మీ.
విజయనగరం-కూనేరు 102 కి.మీ.
నౌపడ జంక్షన్- పర్లాకిమిడి 39 కి.మీ.
బొబ్బిలి జంక్షన్-సాలూరు 17 కి.మీ.
..వీటితో పాటు సింహాచలం నార్త్-దువ్వాడ బైపాస్, వడ్లపూడి-దువ్వాడ, విశాఖపట్నం-జగ్గయ్యపాలెం వరకు 35 కి.మీ. సెక్షన్లను విశాఖ డివిజన్‌లో ఉంచారు. దీనికి తోడు తూర్పు కోస్తా జోన్‌లోని ఖుర్దా డివిజన్‌లో ఉన్న పలాస-ఇచ్ఛాపురం సెక్షన్ 53 కి.మీ.ను విశాఖపట్నం డివిజన్‌లో కలిపారు. గతంలో దువ్వాడ వేరే డివిజన్, జోన్‌లో ఉండేది. ఇప్పుడు అది విశాఖలోనే కలిసింది.
సిరిపురంలో తాత్కాలిక కార్యాలయం
సిరిపురం జంక్షన్‌లో వీఎంఆర్‌డీఏ నిర్మించిన ‘ది డెక్’లో జూన్ ఒకటో తేదీ నుంచి దక్షిణ కోస్తా జోన్ కార్యాలయం కార్యకలాపాలు ప్రారంభించనుంది. ఇందులో ఆరు, ఏడు అంతస్థులు రైల్వే జోన్‌కు ఇచ్చారు. ముఖ్యమైన అధికారులకు ప్రత్యేక ఛాంబర్లు, సిబ్బందికి కార్యాలయాలు, కంప్యూటర్లు అన్నీ సిద్ధమైపోయాయి. సిబ్బందిని కేటాయించడమే మిగిలింది.
15 వేల మందికి ఉపాధి
పీవీఎన్ మాధవ్, రాష్ట్ర అధ్యక్షుడు, బీజేపీ
విశాఖపట్నం కేంద్రంగా కార్యకలాపాలు ప్రారంభించనున్న రైల్వే జోన్ వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా 15 వేల మందికి ఉపాధి లభిస్తుంది. రైల్వే జోన్ విషయంలో బీజేపీ ఇచ్చిన హామీ నిలుపుకుంది. ముడసర్లోవలో రూ.183 కోట్లతో నిర్మిస్తున్న భవనంలో డిజిటల్ మానటరింగ్ సిస్టమ్స్, సెంట్రల్ కంట్రోల్ రూమ్, ప్రయాణికుల సేవల పర్యవేక్షణ కేంద్రాలు వస్తాయి. జోన్ ఏర్పాటుతో వ్యవసాయ ఉత్పత్తులు, పోర్టులో ఎగుమతులు, దిగుమతులు వేగవంతంగా జరుగుతాయి.
టీడీపీ సంబరాలు
కేకు కట్ చేసిన నాయకులు
బాణసంచా కాల్చిన కార్యకర్తలు
విశాఖపట్నం, మే 5 (ఆంధ్రజ్యోతి):
విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో టీడీపీ నాయకులు మంగళవారం స్టేషన్ వద్ద సంబరాలు జరుపుకున్నారు. నాయకులు కేక్ కట్ చేశారు. కార్యకర్తలు బాణసంచా కాల్చారు. ఈ సందర్భంగా పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యుడు, ప్రభుత్వ విప్ పెతకంశెట్టి గణబాబు మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛ సాకారమైందన్నారు. జూన్ ఒకటి నుంచి కొత్త జోన్ అధికారిక కార్యకలాపాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఉత్తరాంధ్ర ప్రజల రైల్వే సమస్యలు త్వరితగతిన పరిష్కారమవుతాయన్నారు. జోన్ ప్రకటించిన తర్వాత ప్రధాన కార్యాలయ భవన నిర్మాణానికి భూమి కేటాయించేందుకు గత వైసీపీ ప్రభుత్వం మీనమేషాలు లెక్కించిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అందుకు అవసరమైన 52.2 ఎకరాలను వెంటనే అప్పగించడం జరిగిందన్నారు. జోన్ ఏర్పాటుతో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరగడమే కాకుండా పారిశ్రామికంగా ఉత్తరాంధ్ర జిల్లాలు అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు చోడే పట్టాభిరామ్, దక్షిణ నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి సీతంరాజు సుధాకర్, రైల్వే కార్మిక సంఘ నాయకుడు చలసాని గాంధీ, టీడీపీ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గెజిట్ విడుదల చేసి ప్రజల కలను నెరవేర్చిన ప్రధాని నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంతి పవన్‌కల్యాణ్‌లకు కృతజ్ఞతలు తెలిపారు.