రైల్వే టెర్మినల్‌కు గ్రీన్ సిగ్నల్
ABN , Publish Date - Nov 17 , 2026 | 01:28 AM
రాష్ట్రానికి రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ మంజూరుచేసిన రెండు రైల్వే టెర్మినల్స్‌లో ఒకటి ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఏర్పాటుకానున్నది.
జగన్నాథపురంలో ఏర్పాటు
500 ఎకరాలు భూసేకరణ
కేంద్ర మంత్రి ఆమోదం
విశాఖపట్నం స్టేషన్‌పై ఒత్తిడి తగ్గించేందుకే...
మూడేళ్ల నుంచి ప్రయత్నాలు
విశాఖపట్నం నుంచి బయలుదేరి, తిరిగి ఇక్కడకు వచ్చే ప్రధాన రైళ్లలో అత్యధికం టెర్మినల్‌కు తరలింపు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
రాష్ట్రానికి రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ మంజూరుచేసిన రెండు రైల్వే టెర్మినల్స్‌లో ఒకటి ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఏర్పాటుకానున్నది. గత మూడేళ్లుగా దీని కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎట్టకేలకు సీఎం చంద్రబాబునాయుడు డిమాండ్ మేరకు మంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం గొల్లలపాలెం పంచాయతీలో జగన్నాథపురం గ్రామం ఉంది. విశాఖ నుంచి సుమారుగా 40 కి.మీ. దూరం. కొత్తవలస నుంచి అనకాపల్లి రెండు బైపాస్ లైన్లు వేయాలని మూడేళ్ల క్రితం ప్రతిపాదించారు. ఆ మార్గంలోనే ఈ జగన్నాథపురం ఉంది. అక్కడ భారీ రైల్వే కోచింగ్ యార్డు ఏర్పాటుచేయాలని మూడేళ్ల క్రితం సమగ్ర ప్రాజెక్టు నివేదిక తయారుచేసి కేంద్రానికి పంపారు. ఇప్పుడు అదే ప్రాంతంలో మెగా రైల్వే టెర్మినల్ ఏర్పాటుకు కేంద్రం అనుమతించింది.
టెర్మినల్ అంటే...?
రైల్వే స్టేషన్‌కు, రైల్వే టెర్మినల్‌కు చాలా తేడా ఉంది. ఏదైనా రైలు వచ్చి, ప్రయాణికులను దించేసి, అక్కడ మరికొంతమందిని ఎక్కించుకొని ఆ మార్గంలో ముందుకు వెళ్లిపోతే...ఆ ప్రాంతాన్ని రైల్వేస్టేషన్‌గా వ్యవహరిస్తారు. ఏదైనా రైలు వచ్చి అక్కడే ఆగిపోయి, ముందుకు వెళ్లడానికి అవకాశం లేకుండా, తిరిగి అక్కడి నుంచే బయలుదేరే ప్రాంతాన్ని ‘రైల్వే టెర్మినల్’గా పేర్కొంటారు. సాధారణంగా ప్రధాన నగరాల్లోని రైల్వే స్టేషన్‌పై రైళ్ల ఒత్తిడిని తగ్గించడానికి దూరంగా ఈ రైల్వే టెర్మినల్‌ను నిర్మిస్తారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌పై ఒత్తిడి తగ్గించేందుకు చర్లపల్లిలో ఇటీవల టెర్మినల్ నిర్మించారు. అక్కడి నుంచే ఎక్కువ రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. అదేవిధంగా ముంబైలో కూడా రైల్వే టెర్మినల్ నిర్మించారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో అమరావతి, విశాఖపట్నంలలో ఈ టెర్మినళ్ల నిర్మాణానికి కేంద్ర రైల్వే మంత్రి ఆమోదం తెలిపారు. విజయవాడ స్టేషన్‌పై ఒత్తిడి తగ్గించడానికి అమరావతిలో, విశాఖ స్టేషన్‌పై ఒత్తిడి తగ్గించడానికి జగన్నాథపురంలో టెర్మినల్ నిర్మిస్తారు.
ఏ సౌకర్యాలు ఉంటాయంటే...?
టెర్మినల్‌కు వచ్చే రైళ్లు అక్కడే ఆగిపోతాయి. తిరిగి అక్కడి నుంచే గమ్యస్థానాలకు బయలుదేరుతాయి. అంటే ఆయా రైళ్లు అన్నింటికీ సర్వీసింగ్, మెయింటెనెన్స్, రిపేర్లు చేయడానికి వసతులు ఉంటాయి. అలాగే కోచింగ్ యార్డు, సిబ్బందికి అవసరమైన మౌలిక వసతులు ఏర్పాటుచేస్తారు.
విశాఖపట్నం నుంచి బయలుదేరి, తిరిగి ఇక్కడకు వచ్చే ప్రధాన రైళ్లను టెర్మినల్ స్టేషన్‌కు తరలిస్తారు. ఆ విధంగా ఒత్తిడి తగ్గిస్తారు. జగన్నాథపురంలో మెగా రైల్వే కోచింగ్ యార్డ్ నిర్మాణానికి మూడేళ్ల క్రితం 500 ఎకరాల భూమి, నిర్మాణానికి రూ.2,887 కోట్లు అవసరమని ప్రతిపాదించారు. ఇప్పుడు దానిని రైల్వే టెర్మినల్‌గా మారిస్తే ఎంత ఖర్చు అవుతుందననేది అంచనాలు తయారు చేయాల్సి ఉందని రైల్వే వర్గాలు తెలిపాయి.