డోజ్కోకు గ్రీన్‌సిగ్నల్
ABN , Publish Date - Jan 10 , 2026 | 01:14 AM
ఎర్త్ మూవర్స్ యంత్రాలు, విభాగాలు తయారు చేసే ‘డోజ్కో’ కంపెనీకి మండలంలోని రాచపల్లి ప్రాంతంలో ప్రభుత్వం 150 ఎకరాలు కేటాయించింది. ఈ మేరకు గురువారం జరిగిన సమావేశంలో క్యాబినెట్ ఆమోదం తెలిపింది. రాచపల్లి రెవెన్యూలోని 737 సర్వే నంబరులో 1,620 ఎకరాల ప్రభుత్వ కొండపోరంబోకు భూమి ఉంది. మండలంలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇస్తున్న ప్రభుత్వం ఇందులో ఎరకన్నపాలెం, చినరాచపల్లి, రామన్నపాలెం, వెంకయ్యపాలెం గ్రామాల పరిధిలో వున్న 406.89 ఎకరాలను సాగుదారుల నుంచి తీసుకుంది.
రాచపల్లి రెవెన్యూలో 150 ఎకరాలు కేటాయింపు
రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం
రూ.1,234 కోట్లు పెట్టుబడులు
ఎర్త్ మూవర్స్ యంత్రాలు, విడిభాగాల ఉత్పత్తి
మాకవరపాలెం, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): ఎర్త్ మూవర్స్ యంత్రాలు, విభాగాలు తయారు చేసే ‘డోజ్కో’ కంపెనీకి మండలంలోని రాచపల్లి ప్రాంతంలో ప్రభుత్వం 150 ఎకరాలు కేటాయించింది. ఈ మేరకు గురువారం జరిగిన సమావేశంలో క్యాబినెట్ ఆమోదం తెలిపింది. రాచపల్లి రెవెన్యూలోని 737 సర్వే నంబరులో 1,620 ఎకరాల ప్రభుత్వ కొండపోరంబోకు భూమి ఉంది. మండలంలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇస్తున్న ప్రభుత్వం ఇందులో ఎరకన్నపాలెం, చినరాచపల్లి, రామన్నపాలెం, వెంకయ్యపాలెం గ్రామాల పరిధిలో వున్న 406.89 ఎకరాలను సాగుదారుల నుంచి తీసుకుంది. నిబంధనల మేరకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లిస్తుందని గ్రామసభలో అధికారులు ప్రకటించడంతో సాగుదారులు అంగీకరించారు. ఇందులో 150 ఎకరాలను తమకు కేటాయించాలని డోజ్కో కంపెనీ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. నవంబరు 20వ తేదీన కంపెనీ నిర్మాణానికి స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు శంకుస్థాపన చేశారు. గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో డోజ్కో కంపెనీకి ఎరకన్నపాలెం గ్రామానికి ఆనుకొని వున్న 150 ఎకరాలు కేటాయిస్తూ ఆమోదం తెలిపింది. ఇక్కడ రూ.1,234 కోట్ల పెట్టుబడితో ఎర్త్ మూవర్స్ యంత్రాలు, విడిభాగాల తయారీ పరిశ్రమను ఏర్పాటు చేయనున్నట్టు కంపెనీ జీఎం చంద్రశేఖర్ ఇటీవల ఇక్కడకు వచ్చినప్పుడు వెల్లడించారు. కాగా త్వరలో భూమి బదలాయింపు ప్రక్రియను పూర్తిచేస్తామని, అనంతరం కంపెనీ నిర్మాణ పనులు మొదలవుతాయని ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ నరసింహారావు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.