బీచ్ షాక్స్‌కు గ్రీన్‌సిగ్నల్
ABN , Publish Date - Jun 05 , 2026 | 12:43 AM
జిల్లాలోని బీచ్‌లలో షాక్స్ (చిన్న గుడిసె/పూరిపాకలు) ఏర్పాటుకు రాష్ట్ర మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
విశాఖలో పైలట్ ప్రాజెక్టు
రాష్ట్ర మంత్రివర్గంలో నిర్ణయం
విశాఖపట్నం, జూన్ 4 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలోని బీచ్‌లలో షాక్స్ (చిన్న గుడిసె/పూరిపాకలు) ఏర్పాటుకు రాష్ట్ర మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గోవా తరహాలో విశాఖలో కూడా బీచ్ షాక్స్ ఏర్పాటుచేస్తే పర్యాటకం పెరుగుతుంని ఏపీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అసోసియేషన్ ఎప్పటి నుంచో కోరుతోంది. బీచ్‌లలో తాటాకులు, ఈత ఆకులతో కుటీరాలు ఏర్పాటుచేస్తారు. అందులో వారికి అవసరమైనవన్నీ ఉంటాయి. ముఖ్యంగా వేసవిలో తాగడానికి బీర్లు వంటివి అందుబాటులో ఉంచుతారు. మద్యం కూడా లభిస్తుంది. అలాగే సముద్ర ఆహార ఉత్పత్తులైన రొయ్యలు, చేపలు వంటి పదార్థాలు పెడతారు. ఇవి విదేశీ పర్యాటకులను బాగా ఆకర్షిస్తాయి. ఈ బీచ్ షాక్స్‌ను విశాఖపట్నం, చీరాలలో రెండేసి చొప్పున పైలట్ ప్రాజెక్టు కింద పెడతారు. ఆదరణ బాగుంటే మిగిలిన బీచ్‌లలో కూడా పెట్టే అవకాశం ఉంది.
మధురవాడలో ఏపీటీడీసీకి 9.39 ఎకరాలు
మధురవాడలో పర్యాటక అభివృద్ధికి మంత్రి వర్గం కీలక నిర్ణయం తీసుకుంది. సర్వే నంబరు 426/3లో 9.39 ఎకరాల ప్రభుత్వ భూమిని ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థకు కేటాయించింది. దీని విలువ సుమారుగా రూ.200 కోట్లు. ఇది లీజుకు ఇస్తారు. అందులో స్టార్ హోటల్, రిసార్ట్‌లు, ఇతర పర్యాటక ప్రాజెక్ట్‌లు ఏర్పాటు చేస్తారు.
దుకాణంలో అగ్నిప్రమాదం
లోవోల్టేజీ సమస్య తలెత్తడంతో ఏసీ నుంచి మంటలు
భారీగా ఆస్తి నష్టం
గోపాలపట్నం, జూన్ 4 (ఆంధ్రజ్యోతి):
స్థానిక ప్రధాన రహదారిలోని హైదరాబాద్ పెరల్స్ అండ్ జ్యువెలరీ షాపులో గురువారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. ఘటనకు సంబంధించి దుకాణ యజమాని తెలిపిన వివరాలిలా ఉన్నాయి. స్థానికంగా నివాసం ఉంటున్న బడిసల హేమ ప్రధాన రహదారిలోని రామాలయం సమీపంలోని గల వ్యాపార సముదాయంలో హైదరాబాద్ పెరల్స్ అండ్ జ్యువెలరీ షాపు నిర్వహిస్తున్నారు. గురువారం రాత్రి 7.30 గంటల సమయంలో దుకాణంలో లోవోల్టేజీ సమస్య తలెత్తడంతో ఏసీ నుంచి పొగలు వచ్చి, ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో దుకాణ యజమాని హేమ, సిబ్బంది షాపులో నుంచి బయటకు పరుగులు పెట్టారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా, హుటాహుటిన చేరుకుని మంటలను అదుపుచేశారు. దుకాణంలో రూ.లక్షలు విలువైన సరుకుతో పాటు కొంత నగదు కూడా ప్రమాదంలో దగ్ధమైనట్టు దుకాణ యజమాని తెలిపారు.
బాధితులకు ఎమ్మెల్యే పరామర్శ
అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలియగానే పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలపై సమీక్షించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. దుకాణ నిర్వాహకులను పరామర్శించారు. వ్యాపార సముదాయాల్లో అగ్నిమాపక పరికరాలు తప్పనిసరిగా అందుబాటులో ఉంచుకోవాలని వర్తకులకు సూచించారు.
ఉడికిన నగరం
ఉక్కిరిబిక్కిరైన జనం
పద్మనాభంలో 41.9 డిగ్రీలు నమోదు
విశాఖపట్నం, జూన్ 4 (ఆంధ్రజ్యోతి):
పడమర దిశ నుంచి వీచిన వేడిగాలులకు నగరం గురువారం ఉడికిపోయింది. ఉదయం తొమ్మిది గంటలకే ఎండ తీవ్రత మొదలైంది. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు నగరం నిప్పులకొలిమిలా మారింది. రహదారులపై జన సంచారం తగ్గింది. ఇళ్లలో ఫ్యాన్ కింద ఉన్నా తట్టుకోలేనంతగా వాతావరణం వేడెక్కింది. సాయంత్రం ఐదు గంటల తరువాత కొద్ది సమయం చల్లని గాలులు వీచి నిలిచిపోయాయి. ఆ తరువాత మళ్లీ వేడి సెగలు వచ్చాయి. రాత్రి పది గంటలకు కూడా అదే పరిస్థితి. జిల్లాలోని పద్మనాభంలో 41.9, ఆనందపురంలో 40.3, పెందుర్తిలో 40.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న రెండు, మూడు రోజుల్లో ఎండతీవ్రత కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది.