వాహనచోదకులకు గ్రీన్‌షెల్టర్
ABN , Publish Date - May 08 , 2026 | 01:30 AM
ఎండలు మండిపోతున్నాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
విశాఖపట్నం, మే 7 (ఆంధ్రజ్యోతి):
ఎండలు మండిపోతున్నాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎండ నుంచి వాహనదారులకు ఉపశమనం కల్పించేందుకు జీవీఎంసీ అధికారులు ముఖ్యమైన కూడళ్ల వద్ద గ్రీన్ షెల్టర్ (హరిత ఆశ్రయం) ఏర్పాటుచేస్తున్నారు. సిగ్నల్ పడినప్పుడు గ్రీన్ షెల్టర్ కింద ఆగే వాహన చోదకులపై నీటి తుంపర్లు పడేలా ఏర్పాటుచేశారు. డాబాగార్డెన్స్ వైపు నుంచి ద్వారకా నగర్ వైపు వచ్చే మార్గంలో ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని ట్రాఫిక్ సిగ్నల్ వద్ద మాత్రమే ప్రస్తుతం దీనిని ఏర్పాటుచేశారు. మిగిలిన రూట్లతోపాటు ముఖ్యమైన ఇతర కూడళ్లలో కూడా ఏర్పాటుచేయాలని భావిస్తున్నారు.
పెరుగుతున్న టమాటా ధర
రైతుబజార్‌లలో కిలో రూ.32
స్థానికంగా సీజన్ ముగియడంతో ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి
గోపాలపట్నం, మే 7 (ఆంధ్రజ్యోతి):
ఉత్తరాంధ్ర జిల్లాల్లో దేశవాళీ టమాటా సీజన్ ముగియడంతో ధర పెరుగుతోంది. డిసెంబరు నుంచి సుమారు నాలుగు నెలల పాటు ఉత్తరాంధ్రలో టమాటా సాగు విస్తారంగా సాగుతుంది. దీంతో ఏప్రిల్ వరకూ టమాటాలు విరివిగా లభిస్తాయి. టమాటా పంట ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోనే అధికంగా ఉండడంతో నగరంలోని అన్ని రైతుబజారుల్లో తక్కువ ధరకే లభిస్తాయి. సీజన్‌లో టమాటా ధర కిలో రూ.10కి చేరుతుంది. ఒకానొక సందర్భంగా రూ.10 కంటే తక్కువకు కూడా లభిస్తాయి. దేశవాళీ టమాటా సీజన్ మూడు వారాల క్రితమే ముగిసింది. దీంతో నగరానికి టమాటా దిగుమతి మొదలైంది. ప్రస్తుతం చిత్తూరు, మదనపల్లితో పాటు కర్ణాటక నుంచి టమాటా దిగుమతి జరుగుతుంది. దీంతో ధర కూడా పెరుగుతూ పోతుంది. ప్రస్తుతం రైతుబజార్‌లలో టమాటా కిలో రూ.32కి విక్రయిస్తున్నారు. ఈ ధర మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. మరొక ఎనిమిది నెలల పాటు ఇతర ప్రాంతాల నుంచి టమాటా దిగుమతి చేసుకోవాల్సి పరిస్థితి ఉంటుంది. ఈ సమయంలో టమాటా ధర అసాధారణంగా పెరుగుతుందని రైతులు చెబుతున్నారు.
రేషన్ కార్డుదారులకు ఈకేవైసీ తప్పనిసరి
డిపోల వారీగా పెండింగ్ జాబితా అందజేత
విశాఖపట్నం, మే 7 (ఆంధ్రజ్యోతి):
రేషన్ కార్డులో పేర్లు కలిగిన వారంతా తప్పనిసరిగా ఈకేవైసీ పూర్తిచేయాలని పౌర సరఫరాల శాఖ తాజాగా ఆదేశించింది. ఈకేవైసీ పెండింగ్‌లో ఉన్న వారి వివరాలను డిపోల వారీగా డీలర్లకు పంపించింది. జిల్లాలోని 642 డిపోల పరిధిలో 5.17 లక్షల బియ్యం కార్డులు ఉండగా, 15,01,703 మంది సభ్యులు ఉన్నాయి. ఇప్పటివరకూ 14,99,961 మంది ఈకేవైసీ పూర్తిచేసుకున్నారు. ఇంకా 56,169 మంది చేయించుకోవలసి ఉంది. పాత మిషన్ ఉన్నప్పుడు ఈకేవైసీ పూర్తిచేసుకున్న వ్యక్తుల వివరాలు కొత్తమిషన్‌లో కనిపిస్తున్నాయని కొందరు డీలర్లు చెబుతున్నారు. దీనిపై జిల్లా పౌరసరఫరాల అధికారి వి.భాస్కర్ వద్ద ప్రస్తావించగా జిల్లాలో 56,169 మంది ఈకేవైసీ చేసుకోవాల్సి ఉందని, వారంతా సమీపంలో ఉన్న రేషన్ డిపోకు వెళ్లాలన్నారు.
ప్రైవేటు పాఠశాలల్లో 1,100 మందికి సీట్లు
విశాఖపట్నం, మే 7 (ఆంధ్రజ్యోతి):
ప్రైవేటు పాఠశాలల్లో రెండో దశలో 1,100మందికి ఉచితంగా సీట్లు కేటాయించారు. సీట్లు పొందిన విద్యార్థులు ఈనెల 17వ తేదీలోగా ఆయా పాఠశాలల్లో ప్రవేశాలు పొందాలని సమగ్రశిక్ష అడిషనల్ ప్రాజెక్టు కో-ఆర్డినేటర్ జె.చంద్రశేఖరరావు సూచించారు. దరఖాస్తు సమయంలో పొందుపరిచిన ఆధార్ కార్డు, ఆదాయ, కుల,జన్మ, నివాస ధ్రువపత్రం, రేషన్ కార్డు వివరాలు పాఠశాలల్లో సమర్పించాలని కోరారు. తొలి దశలో ఒకటో తరగతిలో గత నెల 4,868 మందికి సీట్లు కేటాయించారు. అందులో సుమారు 3,600 మంది వరకు ప్రవేశాలు పొందారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల పిల్లలకు ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం సీట్లు ఉచితంగా ఇవ్వాలని కేంద్రం చట్టం చేసిన విషయం తెలిసిందే.