Share News

97.74 కోట్లతో హరిత భవనం

ABN , Publish Date - Jul 22 , 2026 | 12:37 AM

విశాఖపట్నం పోర్టు శతాబ్ది ఉత్సవాల కోసం సిద్ధమవుతోంది.

97.74 కోట్లతో హరిత భవనం

పాలనా కార్యకలాపాల కోసం

వన్‌టౌన్‌ సీహార్స్‌ జంక్షన్‌ సమీపాన పోర్టు నిర్మాణం

అన్ని విభాగాలు ఒకే చోట ఉండేలా డిజైన్‌

అధునాతన కంట్రోల్‌ సెంటర్‌, డేటా హబ్‌, స్మార్ట్‌ ఆపరేషన్లకు అనుగుణంగా ఐటీ విభాగం ఏర్పాటు

18 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యం

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విశాఖపట్నం పోర్టు శతాబ్ది ఉత్సవాల కోసం సిద్ధమవుతోంది. పోర్టు ఏర్పాటైన తొలినాళ్లలో నిర్మించిన పరిపాలనా భవనం పూర్తిగా పాతబడిపోవడంతో భవిష్యత్తు అవసరాలకు తగినట్టుగా నూతన భవన నిర్మాణానికి పనులు ప్రారంభించింది. అన్ని విభాగాలు ఒకే దగ్గర ఉండేలా డిజైన్‌ చేసింది. రూ.97.74 కోట్ల అంచనా వ్యయంతో పనులు చేపట్టింది. నిర్మాణ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్‌ బిల్డింగ్‌ కనస్ట్రక్సన్‌ కార్పొరేషన్‌కు అప్పగించింది.

ప్రస్తుతం వన్‌టౌన్‌ సీహార్స్‌ జంక్షన్‌ వద్ద పోర్టు పరిపాలనా కార్యాలయం ఉన్న ప్రాంతంలోనే డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (డీసీఐ) కార్యాలయం ఉండేది. ఆ సంస్థ హెచ్‌బీ కాలనీలో సొంత భవనం నిర్మించుకొని, అక్కడకు మారిపోవడంతో డీసీఐ పాత భవనాన్ని కూలగొట్టి ఆ స్థలంలో పోర్టుకు కొత్త అడ్మిన్‌ భవనం నిర్మిస్తున్నారు. దీనికి ‘డాక్డర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ భవన్‌’ అని నామకరణం చేశారు.

ఇవీ ప్రత్యేకతలు

పోర్డు అడ్మిన్‌ భవనాన్ని గ్రౌండ్‌+9 అంతస్థుల్లో నిర్మిస్తారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌కు అనుకూలంగా అన్ని విభాగాలు ఒకే దగ్గర ఉంటాయి. పదో అంతస్థులో చైర్మన్‌ కార్యాలయం ఉంటుంది. అక్కడి నుంచి చూస్తే సముద్రం, పోర్టు అన్నీ చాలా స్పష్టంగా కనిపిస్తాయి. మొత్తం ఫ్లోర్‌ స్పేస్‌ 15,100 చ.మీ. పోర్టు దీర్ఘకాలిక అవసరాలకు ఉపయోగపడేలా తీర్చిదిద్దుతున్నారు. అధునాతన కంట్రోల్‌ సెంటర్‌గా, డేటా హబ్‌గా, స్మార్ట్‌ పోర్టు ఆపరేషన్లకు అనుగుణంగా ఐటీ విభాగం కూడా ఏర్పాటుచేస్తున్నారు. ఇది పూర్తిగా గ్రీన్‌ బిల్డింగ్‌. రెన్యువబుల్‌ ఎనర్జీతో పనిచేస్తుంది.

- ఇందులో పూర్తిగా సమావేశాలు నిర్వహించుకోవడానికి ప్రత్యేక మందిరాలు, కేఫ్‌టేరియా, ఇన్‌-హౌస్‌-ఆడిటోరియం నిర్మిస్తారు. అందులోనే శిక్షణ కార్యక్రమాలు, వర్క్‌షాపులు, అధికారిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.

- కాలుష్య ఉద్గారాలను తగ్గించడానికి సోలార్‌ విద్యుత్‌తో నడిచేలా భవనం డిజైన్‌ చేశారు. భవనానికి కార్పొరేట్‌ కళ వచ్చేలా మొత్తం అన్ని వైపులా సన్నటి అద్దాలను అమరుస్తారు.

- ఉద్యోగులు పనిచేసుకునే ప్రాంతాలన్నీ ఆహ్లాదకరంగా ఉండేలా, స్మార్ట్‌ కార్డ్‌తో ఎంట్రీ, సెక్యూరిటీ వంటి ఏర్పాట్లు చేస్తున్నారు.

మేరీటైమ్‌ హిస్టరీకి ప్రతీకగా

పోర్టుకు, విశాఖ నగరానికి విడదీయలేని బంధం ఉంది. రెండూ ఒక దానిని మరొకటి ముడిపడి అభివృద్ధి చెందుతున్నాయి. ఈ చరిత్రకు ప్రతీకగా సంప్రదాయ నౌకలో కెప్టెన్‌ టోపీ ఎలా ఉంటుందో అదే రూపంలో ఈ భవనాన్ని డిజైన్‌ చేసి నిర్మిస్తున్నారు. విశాఖ నగరానికి పోర్టు ఇచ్చే గౌరవానికి సూచికగా దీనిని డిజైన్‌ చేశారు. నిర్మాణ పనులు జూన్‌ 10వ తేదీన ప్రారంభించారు. పద్దెనిమిది నెలల్లో పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. ఇది పూర్తయితే సాగరతీరాన మరో అందమైన భవనం పోర్టు చరిత్రకు ప్రతీకగా నిలుస్తుంది.


భోగాపురం సభకు 2,000 బస్సులు

ఆర్టీసీ అధికారుల నిర్ణయం

నెల్లూరు నుంచి శ్రీకాకుళం జిల్లా వరకూ గల డిపోల నుంచి సేకరణ

ద్వారకా బస్‌స్టేషన్‌, జూలై 21 (ఆంధ్రజ్యోతి):

విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా జరిగే బహిరంగ సభకు జనాలను తరలించేందుకు సుమారు రెండు వేల బస్సులు నడపాలని ఆర్‌టీసీ ప్రధాన కార్యాలయం నిర్ణయించింది. నెల్లూరు నుంచి శ్రీకాకుళం జిల్లా వరకూ గల డిపోల నుంచి బస్సుల సేకరణ, ఆపరేషన్‌, నిర్వహణ, పార్కింగ్‌, సిబ్బందికి భోజన, వసతి సౌకర్యాల కల్పన వంటివి ఆర్‌టీసీ విజయనగరం జోనల్‌ కార్యాలయం చూడనున్నది. వచ్చే నెల ఒకటో తేదీన భోగాపురం విమానాశ్రయాన్ని భారత ప్రధాని నరేంద్రమోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసే బహిరంగ సభకు అన్ని ప్రాంతాల నుంచి టీడీపీ, బీజేపీ, జనసేన కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యేందుకు ఆసక్తి చూపుతున్నారు. వారికి రవాణా సౌకర్యాలు సమకూర్చేందుకు ఆర్టీసీ ఈ ప్రత్యేక బస్సులు ఏర్పాటుచేస్తోంది. డిమాండ్‌కు అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచడం లేదా కుదించడం జరుగుతుందని విశాఖ రీజనల్‌ మేనేజర్‌ బి.అప్పలనాయుడు తెలిపారు.


నేడు ‘తల్లికి వందనం’

జిల్లాలో 2,29,792 మంది విద్యార్థులు, 1,54,945 మంది తల్లులు

రూ.13 వేలు చొప్పున రూ.298.72 కోట్లు జమ

విశాఖపట్నం, జూలై 21 (ఆంధ్రజ్యోతి):

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘తల్లికి వందనం’ పథకం కింద జిల్లాలో అర్హులైన విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో బుధవారం నుంచి నగదు జమ కానుంది. ప్రభుత్వ, ప్రైవేటు (గుర్తింపు పొందిన) పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో అర్హులైన వారికి ఈ పథకం వర్తిస్తుంది. ఒక్కో విద్యార్థికి రూ.15 వేల చొప్పున ప్రభుత్వం మంజూరుచేస్తుండగా, ఇందులో రూ.2 వేలు పాఠశాల/కళాశాల నిర్వహణ కోసం కేటాయించి, మిగిలిన రూ.13 వేలను ఆయా విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నది. అయితే ప్రస్తుతం రెండో తరగతి నుంచి పదో తరగతి వరకు, ఇంటర్‌ రెండో సంవత్సరం చదువుతున్న వారికి మాత్రమే డబ్బులు జమ చేస్తున్నది. ఇందుకు జిల్లాలో 2,29,792 మంది విద్యార్థులు అర్హులుగా గుర్తించింది. వారి తల్లులైన 1,54,945 మంది ఖాతాల్లో సుమారు రూ.298.73 కోట్లు జమ కానున్నాయి. గడిచిన ఏడాది 1.94 లక్షల మంది విద్యార్థులకు రూ.13 వేలు చొప్పున జమ చేశారు. ఈ ఏడాది విద్యార్థుల సంఖ్య సుమారు 36 వేలు, తల్లుల సంఖ్య 23 వేలు పెరిగింది. ఇక కొత్తగా ఒకటో తరగతిలో, ఇంటర్‌ మొదటి సంవత్సరంలో చేరిన వారికి రెండో విడతలో ‘తల్లికి వందనం’ పథకం కింద నగదు సాయం అందుతుందని అధికారులు వెల్లడించారు. బుధవారం నుంచి సచివాలయాల వద్ద తల్లికి వందనం పథకానికి సంబంధించిన అర్హులు, అనర్హుల జాబితాలను ప్రదర్శించనున్నారు.


స్టీల్‌ ప్లాంటులో రాజీనామాలకు బ్రేక్‌!

డైరెక్టర్‌ ఆమోదిస్తేనే ప్రాసెస్‌

కొత్త మార్గదర్శకాలు జారీ

విశాఖపట్నం, జూలై 21 (ఆంధ్రజ్యోతి):

స్టీల్‌ ప్లాంటు యాజమాన్యం రూటు మార్చింది. జీతాల్లో కోతలు, అదనపు పనిగంటలు తట్టుకోలేక ఇప్పటికే పలువురు రాజీనామా చేసి వెళ్లిపోయారు. అయితే ఇకపై ఉద్యోగులను వదులుకోకూడదని నిర్ణయించింది. ఎవరైనా ఉద్యోగి రాజీనామా చేస్తే ముందుగా ఆ దరఖాస్తును సంబంధిత విభాగం ఆపరేషనల్‌ డైరెక్టర్‌కు పంపాలని, అక్కడ ఆమోదం పొందాకే దానిని ప్రాసెస్‌ చేయాలని మంగళవారం మానవ వనరుల విభాగం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతకు ముందు ఇలాంటి రాజీనామాలను విభాగాధిపతి ప్రాసెస్‌ చేసి పంపితే ఆమోదించేవారు.

ఇప్పుడు ప్లాంటులో ఉద్యోగుల సంఖ్య తగ్గిపోయింది. మూడు విడతలుగా వీఆర్‌ఎస్‌ అమలు చేసి 1,700 మందిని ఇళ్లకు పంపించేశారు. గత రెండేళ్లలో ఇక్కడ భవిష్యత్తు లేదని భావించి సుమారు 500 మంది ఉద్యోగులు రాజీనామా చేసి వెళ్లిపోయారు. ఇప్పుడు ప్లాంటును నడపడానికి సీనియర్లు లేకుండా పోయారు. ఉన్నవారు 8 గంటల డ్యూటీ అయితే 12 గంటలు పనిచేస్తున్నారు. ఇటీవల సమావేశాలు, నివేదికల పేరుతో రోజుకు 3 నుంచి 5 గంటలు అదనంగా పనిచేయిస్తున్నారు. దాంతో రాజీనామా చేసే వారి సంఖ్య పెరుగుతోంది. వాటికి ఆమోదం ఇచ్చుకుంటే పోతే...ఉత్పత్తికి ఆటంకం కలుగుతుందని యాజమాన్యం మేల్కొంది. అత్యవసరంగా రాజీనామాలపై ఆంక్షలు పెడుతూ ఆదేశాలు జారీచేసింది. కొత్తవారిని తీసుకోకుండా, ఉన్నవారిని తొలగించుకుంటూ పోతూ పనిభారం వేయడాన్ని ఉద్యోగులు, అధికారులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఢిల్లీలోని ఉక్కు మంత్రిత్వ శాఖ చెప్పినట్టు చేయడం వల్ల ఇప్పుడు ప్లాంటులో ఇబ్బందుల్లో పడిందని ప్రతి ఒక్కరూ ఆరోపిస్తున్నారు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నిస్తున్నారు.

Updated Date - Jul 22 , 2026 | 12:37 AM