గ్రీన్ బెల్ట్ మటుమాయం!
ABN , Publish Date - Jun 28 , 2026 | 12:55 AM
నగరాన్ని పచ్చదనంతో నింపాలన్న పాలకుల లక్ష్యం అధికారుల అలసత్వం కారణంగా అపహాస్యం అవుతోంది.
తమ స్వప్రయోజనాల కోసం చెట్లను తొలగిస్తున్న వ్యాపారులు
జీవీఎంసీ సిబ్బంది సహకారం
పట్టించుకోని అధికారులు
మురళీనగర్, జూన్ 27 (ఆంధ్రజ్యోతి):
నగరాన్ని పచ్చదనంతో నింపాలన్న పాలకుల లక్ష్యం అధికారుల అలసత్వం కారణంగా అపహాస్యం అవుతోంది. జాతీయ రహదారి వెంబడి గల గ్రీన్ బెల్ట్‌ను కొందరు తమ వ్యాపార కార్యకలాపాలకు అడ్డంకిగా ఉందనే ఉద్దేశంతో నేలమట్టం చేస్తున్నారు. జాతీయ రహదారికి ఇరుపక్కలా ఉత్తర నియోజకవర్గ పరిధిలో పలు వ్యాపార సముదాయాలు వెలిశాయి. బిర్లా జంక్షన్‌లో 17 అంతస్థుల సముదాయం నిర్మాణంలో ఉంది. అలాగే ఊర్వశి జంక్షన్, తాటిచెట్లపాలెం, గురుద్వారా నుంచి ఆర్‌అండ్‌బీ జంక్షన్ వరకు ఉన్న సర్వీస్ రోడ్డును ఆనుకొని వాణిజ్య భవనాలు రూపొందుతున్నాయి. వీటి మూలంగా గ్రీన్ బెల్ట్ మటుమాయమవుతోంది. ఆర్‌అండ్‌బీ జంక్షన్‌లో రెండు నెలల క్రితం బెంజ్ కార్ల షోరూమ్‌ను తెరిచారు. మారియట్ త్రీ స్టార్ ఇంటర్నేషనల్ హోటల్ గ్రౌండ్ ఫ్లోర్‌లోనే ఈ షోరూమ్ ఏర్పాటైంది. వ్యాపార ప్రచారం, షోరూమ్ లుక్ కోసం గ్రీన్ బెల్ట్‌లో మొక్కలను పథకం ప్రకారం పూర్తిగా లేపేశారు. అదే భవనంలో వస్త్ర దుకాణం, కార్ల షోరూమ్ నడుస్తుండడంతో వాణిజ్య సముదాయం ముందు భాగం అంతా ఖాళీ చేసి పార్కింగ్ అవసరాల కోసం లైన్ క్లియర్ చేసుకున్నారు.
ఏఎస్‌ఎన్ మెగా షాపింగ్ మాల్ పేరిట బిర్లా జంక్షన్‌లో పది అంతస్థుల వాణిజ్య భవనం రూపొందుతున్న క్రమంలో పచ్చదనాన్ని దశల వారీగా నేలమట్టం చేశారు. దీనిపై ‘ఆంధ్రజ్యోతి’ వరుస కథనాలు ప్రచురించింది. దీంతో గ్రీన్ బెల్ట్‌లో ఏఎస్‌ఎన్ మెగా మాల్ ఆక్రమణలు తొలగించి, తిరిగి మొక్కలు నాటారు. కానీ, పచ్చదనం నిర్మూలించే పనిమాత్రం ఆగలేదు. ఇదే దారిలో కార్ల షోరూమ్‌లు, టూ వీలర్ గోడౌన్‌లు నడుస్తున్నాయి. వాటి భవనాల ఎదుటా ఇదే తీరు. గ్రీన్ బెల్డ్ ప్రాంతంలోనే నేరుగా వ్యాపార కార్యకలాపాలు సాగుతుంటాయి. ఇదంతా జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులకు, ఉద్యాన విభాగం సిబ్బందికి, ఇంజనీరింగ్ ప్రముఖులకు కనిపించడం లేదు. వీటికి తోడు మర్రిపాలెం, పంజాబ్ హోటల్ జంక్షన్, కంచరపాలెం ప్రాంతాల్లో గ్రీన్ బెల్ట్ ఏరియాలోనే మాంసం, చేపల విక్రయాలు, చిరుతిండ్ల అమ్మకాలు, టిఫిన్ బండ్ల ఆక్రమణలతో పచ్చదనం హరించుకుపోతోంది. అధికారులు గ్రీన్ బెల్ట్ ప్రాంతాన్ని ఆక్రమణల చెర నుంచి రక్షించాలని పలువురు కోరుతున్నారు.