క్యాజువాల్టీలో కాసుల కక్కుర్తి
ABN , Publish Date - Jan 05 , 2026 | 01:19 AM
ఉత్తరాంధ్ర పెద్దాస్పత్రి కేజీహెచ్‌లో రోగులను సిబ్బంది డబ్బుల కోసం వేధిస్తున్నారు.
రోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న కేజీహెచ్ సిబ్బంది
ఇవ్వకుంటే సేవల్లో జాప్యం
చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్న అధికారులు
విశాఖపట్నం, జనవరి 4 (ఆంధ్రజ్యోతి):
ఉత్తరాంధ్ర పెద్దాస్పత్రి కేజీహెచ్‌లో రోగులను సిబ్బంది డబ్బుల కోసం వేధిస్తున్నారు. కట్టు కట్టాలన్నా, వార్డుకు తరలించాలన్నా, స్ర్టెచర్‌పై తీసుకువెళ్లాలన్నా కాసులు ముట్టజెప్పాల్సిన పరిస్థితి నెలకొంది. డబ్బులు ఎందు కివ్వాలని ఎవరైనా ప్రశ్నిస్తే వారికి అందించాల్సిన సేవల ను తాత్సారం చేస్తూ తీవ్ర ఇబ్బంది పెడుతున్నారు. ఇదే పరిస్థితిని నగరానికి చెందిన ఎన్.తేజేశ్వరరావు అనే యువకుడు ఎదుర్కొన్నాడు. ఈ నెల 31న బైక్‌పై వస్తున్న తేజేశ్వరరావును రాంగ్‌రూట్‌లో వచ్చిన యువకులు బైక్‌తో ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో తేజేశ్వరరావు చేతి వేళ్లకు గాయమైంది. స్నేహితులు వెంటనే కేజీహెచ్‌లోని క్యాజు వాల్టీకి తీసుకువెళ్లారు. వైద్యుడు పరీక్షించి ఎక్స్‌రే తీయిం చారు. ఆ తరువాత కట్టు కట్టాల్సిందిగా నర్సింగ్ సిబ్బంది (మేల్)కి, వార్డు బాయ్‌కు సూచించారు. అయితే, కట్టు కట్టేందుకు సదరు సిబ్బంది డబ్బులు డిమాండ్ చేశారు. బయటకు వెళ్లి కట్టు వేయించుకునేందుకు మూడు వేలు అవుతుందని, రూ.వెయ్యి ఇస్తే కడతామని చెప్పడంతో తేజేశ్వరరావు, యువకులు ఆశ్చర్యపోయారు. తప్పనిసరి పరిస్థితుల్లో డబ్బులిచ్చి కట్టు కట్టించుకున్నారు.
అది కూడా సరిగా కట్టకపోవడంతో యువకుడు తీవ్ర ఇబ్బంది పడాల్సి వచ్చింది. రెండు వేళ్ల మధ్య ప్లాస్టర్లు అంటించాల్సి ఉన్నప్పటికీ...వేళ్ల నుంచి మోచేతి వరకు కట్టు గట్టిగా బిగించి కట్టారు. దీంతో వేళ్ల నుంచి మోచేతి వరకు వాచిపోయి యువకుడు విలవిల్లాడాడు. ఈ బాధను భరించలేక మరో ఆస్పత్రికి వెళ్లగా అక్కడి వైద్యులు చేతిని పరిశీలించి మోచేతి వరకూ వేసిన కట్టును తొలగించారు.
నిర్లక్ష్యానికి నిలువుటద్దం..
కేజీహెచ్ క్యాజువాల్టీలో వసూళ్ల వ్యవహారంపై ఎప్పటి నుంచో ఆరోపణలు వస్తున్నాయి. వార్డుకు తరలించడానికి, పరీక్షలకు తీసుకువెళ్లడానికి, ఇతర సేవలు అందించేం దుకు ఇంత అని రేటు ఫిక్స్ వసూలు చేస్తుంటారన్న ఫిర్యా దులున్నాయి. అయినా, అధికారులు పట్టించుకోకపోవడం తో సిబ్బంది ముఖ్యంగా వార్డుబాయ్‌లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.
నేటి నుంచి ఎఫ్‌ఏ-3 పరీక్షలు
విశాఖపట్నం, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పాఠశాల విద్యార్థులకు సోమవారం నుంచి ఫార్మేటివ్ అసెస్‌మెంట్ (ఎఫ్‌ఏ)-3 పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న సుమారు మూడు లక్షల మంది విద్యార్థులకు నిర్వహించనున్న పరీక్షలు ఈ నెల ఎనిమిదోతేదీ వరకు జరుగుతాయి. సబ్జెక్టు వారీగా 35 మార్కులకు ప్రశ్నపత్రాన్ని ఎస్‌సీఈఆర్‌టీ రూపొందించి ముద్రించింది. ఇప్పటికే ప్రశ్నపత్రాలు జిల్లాకు చేరాయి. ప్రతిరోజు ఉదయం ప్రాథమిక పాఠశాలల టీచర్లు సమీపంలోని క్లస్టర్ కాంప్లెక్స్ పాఠశాలల నుంచి, ఉన్నత పాఠశాలల టీచర్లు మండల విద్యాశాఖాధికారి కార్యాలయం నుంచి ప్రశ్నపత్రాలు తీసుకోవాలని జిల్లా కామన్ పరీక్షల బోర్డు కార్యదర్శి ఎంవీ కృష్ణకుమార్ తెలిపారు. ఎఫ్‌ఏ-3 పరీక్షలో ఒకటి, రెండు తరగతులకు ఎక్కువగా టీచర్ల సహాయంతో పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ప్రశ్నపత్రాలు వాట్సాప్ ద్వారా పంపే విధానం లేదని, ఎస్‌సీఈఆర్‌టీ ముద్రించిన ప్రశ్నపత్రాలు జిల్లాకు సరఫరా చేశారన్నారు.