Share News

‘మహా’ ఉత్కంఠ

ABN , Publish Date - Nov 02 , 2026 | 01:37 AM

గ్రేటర్‌ విశాఖపట్నం మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ)లో ఎన్నికల సందడి ముగిసింది.

‘మహా’ ఉత్కంఠ

ఆసక్తికరంగా సాగిన గ్రేటర్‌ ఎన్నికలు

ఫలితాలపై సర్వత్రా చర్చ

అత్యధిక వార్డుల్లో కూటమి అభ్యర్థులకు అనుకూల వాతావరణం

నగర అభివృద్ధికి ‘కూటమి’ ప్రభుత్వ అండదండలు అవసరమన్న ఓటర్లు

కొన్నిచోట్ల వైసీపీ అభ్యర్థులకు సానుకూల పవనాలు

నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలను ప్రస్తావించిన పలువురు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

గ్రేటర్‌ విశాఖపట్నం మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ)లో ఎన్నికల సందడి ముగిసింది. ఓటర్లు తమ తీర్పును బ్యాలెట్‌ బాక్సుల్లో నిక్షిప్తం చేశారు. ఇప్పుడు అందరిలోనూ ఫలితాలపై ఆసక్తి నెలకొంది. గ్రేటర్‌ పీఠాన్ని దక్కించుకునేదెవరోనన్న చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే, క్షేత్రస్థాయిలో పరిస్థితిని తెలుసుకునేందుకు ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధులు యత్నించినప్పుడు పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. నగర పరిధిలోని మెజారిటీ వార్డుల్లో కూటమి ప్రభుత్వం పట్ల సానుకూలత వ్యక్తమైంది. కొన్ని వార్డుల్లో మాత్రం పోటీ వాతావరణం కనిపించింది.

నగర పరిధిలోని పలు ప్రాంతాల్లో ఓటర్లను పలకరించగా దాదాపు 50 శాతం మంది తాము ఎవరికి ఓటేశామన్న విషయాన్ని వెల్లడించేందుకు ఇష్టపడలేదు. వీరిలో ఎక్కువ మంది ఎవరైనా ఒకటేనన్న అభిప్రాయాన్ని వ్యక్తంచేయడం గమనార్హం. ఓటు వృథా చేసుకోకూడదన్న ఉద్దేశంతో పోలింగ్‌ కేంద్రానికి వచ్చినట్టు పేర్కొన్నారు. ఇక మిగిలిన వారిలో సగానికిపైగా కూటమి అభ్యర్థులకు ఓటేశామని చెప్పగా, మిగిలినవారు వైసీపీ అభ్యర్థులకు ఓటేసినట్టు వెల్లడించారు.

కూటమికి సానుకూల అంశాలు..

కూటమికి ఓటేశామని చెప్పిన వారిలో ఎక్కువమంది అభివృద్ధి గురించి ప్రస్తావించారు. కూటమి గెలిస్తే నగర అభివృద్ధి మరో స్థాయికి చేరుకుంటుందని కృష్ణా కళాశాలలో ఓటేసిన రాజేంద్ర పేర్కొన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీని గెలిపించుకుంటేనే అభివృద్ధి సమాంతరంగా ముందుకు సాగుతుందని, లేదంటే ఇబ్బందులు పడాల్సి ఉంటుందని లక్ష్మీ తరుణి అనే మహిళ చెప్పారు. విశాఖపట్నం అభివృద్ధిలో టీడీపీ పాత్ర మరువలేనిదని, దాన్ని కొనసాగించాలంటే మేయర్‌ పీఠాన్ని కూటమి గెలుచుకోవడం తప్పనిసరి అని సీతమ్మధార వద్ద ఓటు హక్కు వినియోగించుకున్న నవీన్‌ అనే యువకుడు తెలిపాడు. నగరంలో తొలి నుంచి తెలుగుదేశం పార్టీకి పట్టు ఉందని, అది కొనసాగుతుందని ఈ ఎన్నికల ఫలితాలు మరోసారి రుజువు చేస్తాయని శివకృష్ణ అనే యువకుడు పేర్కొన్నాడు. కూటమి పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, నాయకుల మధ్య సంబంధాలు ఎలా ఉన్నప్పటికీ ఈ ఎన్నికల్లో విజయం ఖాయమని పృథ్వీ అనే యువకుడు, ప్రసన్న అనే యువతి తెలిపారు. రానున్న రోజుల్లో విశాఖ నగరానికి జాతీయ స్థాయిలో గుర్తింపు రావాలంటే కూటమి అభ్యర్థులు గెలుపు కీలకం కాబట్టే ఆలోచించి ఓట్లేశామని మల్లిక, శిరీష అనే యువతులు తెలిపారు.

ధరల పెరుగుదల ప్రస్తావన...

వైసీపీ అభ్యర్థులకు ఓటేశామని చెప్పిన వారిలో ఎక్కువ మంది నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు. సాధారణ, మధ్య తరగతి ప్రజలు బతికే పరిస్థితి కనిపించడం లేదని, ఇక్కడ ఓటుతో ప్రభుత్వానికి బుద్ధి చెబితే ధరల నియంత్రణకు చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నట్టు రవికుమార్‌ అనే ప్రైవేటు ఉద్యోగి పేర్కొన్నారు. ధరల పెరుగుదలతో తమలాంటి సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు 20వ వార్డులో ఓటు హక్కు వినియోగించుకున్న చంద్రకళ అనే మహిళ వెల్లడించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని, అందుకే వైసీపీకి ఓటేసినట్టు మల్లిక్‌ అనే యువకుడు తెలిపాడు. నగర పరిధిలో పర్యావరణానికి హాని కలిగించే విధంగా కూటమి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని, వాటికి అడ్డుకట్ట పడాలంటే జీవీఎంసీ ఎన్నికల్లో కూటమి ఓడిపోవాలని అందుకే వైసీపీ అభ్యర్థికి ఓటు వేసినట్టు అక్కయ్యపాలెంలో ఓటు హక్కు వినియోగించుకున్న సత్యనారాయణ అనే వృద్ధుడు వెల్లడించారు.

Updated Date - Nov 02 , 2026 | 01:37 AM