ఆదివాసీలకు మరింత శక్తి
ABN , Publish Date - Aug 13 , 2026 | 12:25 AM
అభివృద్ధి, సంక్షేమానికి దూరంగా కొండకోనల్లో కాయకష్టంతో జీవనం సాగించే ఆదివాసీ సమాజానికి మరింత ’శక్తి’నివ్వాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ‘స్ట్రెంతనింగ్ హేబిటేట్ అండ్ ఆదివాసీ నాలెడ్జి సిస్టం త్రూ ట్రెడిషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ (శక్తి)’ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు గాను రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ జీవో నంబర్:100ను జారీ చేసింది.
ప్రత్యేక కార్యక్రమంతో ఆదివాసీ వ్యవస్థ బలోపేతానికి సర్కారు నిర్ణయం
గ్రామసభలు, షెడ్యూల్డ్ ప్రాంత చట్టాలు, సంస్కృతి, సంప్రదాయాలకు రక్షణ
ప్రభుత్వ శాఖల సమన్వయంతో సమగ్ర గిరిజనాభివృద్ధికి చర్యలు
తాజాగా జీవో: 100 జారీ చేసిన రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
అభివృద్ధి, సంక్షేమానికి దూరంగా కొండకోనల్లో కాయకష్టంతో జీవనం సాగించే ఆదివాసీ సమాజానికి మరింత ’శక్తి’నివ్వాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ‘స్ట్రెంతనింగ్ హేబిటేట్ అండ్ ఆదివాసీ నాలెడ్జి సిస్టం త్రూ ట్రెడిషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ (శక్తి)’ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు గాను రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ జీవో నంబర్:100ను జారీ చేసింది.
కూటమి ప్రభుత్వం ఆదివాసీ వ్యవస్థలోని మూలలను బలోపేతం చేయడం ద్వారా వారి ఆచారాలు, సంస్కృతి, సంప్రదాయాలు, వారి హక్కులు, చట్టాలను పరిరక్షించి, భవిష్యత్తు తరాలకు అందించాలని భావిస్తున్నది. అందుకు గాను స్థానికులతో కమిటీలను ఏర్పాటు చేసి, ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణలో పని చేసేలా కృషి చేస్తుంది. ప్రధానంగా పంచాయతీరాజ్, రెవెన్యూ, విద్య, వైద్య, గిరిజన సంక్షేమం, అటవీ, వ్యవసాయ, తదితర ప్రభుత్వ శాఖలు గ్రామసభతో సమన్వయంగా పని చేయాలని జీవో:100లో స్పష్టంగా పేర్కొంది. అలాగే ఆదివాసీల సమగ్రాభివృద్ధికి ఉద్దేశించిన శక్తి కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేసేందుకు ఆయా శాఖలకు చెందిన అధికారులు, ఉద్యోగులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
పాడేరు ఐటీడీఏ పరిధిలో గిరిజనులకు ఎంతో మేలు
రాష్ట్రంలోనే పెద్దదైన స్థానిక ఐటీడీఏ పరిధిలో గిరిజనులకు రాష్ట్ర ప్రభుత్వ ప్రకటించిన శక్తి కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని సామాజిక వేత్తలు, మానవ శాస్త్ర నిపుణులు భావిస్తున్నారు. జిల్లాలోని పాడేరు, జి.మాడుగుల, చింతపల్లి, జీకేవీధి, కొయ్యూరు, పెదబయలు, ముంచంగిపుట్టు, హుకుంపేట, డుంబ్రిగుడ, అరకులోయ, అనంతగిరి మండలాల్లోని 244 గ్రామ పంచాయతీల్లో ఏడు లక్షల మంది గిరిజనులున్నారు. వారి అభివృద్ధి, సంక్షేమానికి ఐటీడీఏ ద్వారా వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే గత కొన్నాళ్లుగా ఐటీడీఏలకు నిధుల కేటాయింపులు తగ్గడంతో పాటు అధికారులు ఆశించిన స్థాయిలో గిరిజన సంక్షేమానికి చర్యలు చేపట్టడం లేదనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో ఆదివాసీ సమాజాన్ని మూలలతో బలోపేతం చేయాలనే లక్ష్యంతో శక్తి వంటి ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించడంతో ఐటీడీఏ సైతం బలోపేతమై సమగ్ర గిరిజనాభివృద్ధికి బాటలు పడతాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.
శక్తి కార్యక్రమం ప్రధాన లక్ష్యాలివే..
- గ్రామసభల ద్వారా షెడ్యూల్డ్ ప్రాంతాల్లో స్వపరిపాలనను బలోపేతం చేయడం.
- అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వాములను చేయడం.
- భూమి, నీరు, అడవులు, సహజ వనరులను రక్షించడం.
- గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించడం.
- సంక్షేమం, విద్య, వైద్య సేవలను మెరుగుపరచడం.
- పారదర్శకత, జవాబుదారీతనం, సోషల్ ఆడిట్ చేయడం.
- పెసా చట్టంపై ప్రజలకు సంపూర్ణ అవగాహన కల్పించడం.
- గ్రామ స్థాయిలో ఆదివాసీ సమాజం మరింత పటిష్ఠంగా ఉండేందుకు గాను గ్రామసభ, హక్కుల కమిటీ, అలాగే వనరుల వినియోగం, నవీకరణ కమిటీ, పండుగలు, సంస్కృతి, క్రీడల కమిటీ, సంక్షేమం, విద్యా కమిటీల ఏర్పాటు.
- ఆయా కమిటీల్లో 50 శాతం మహిళలుండడంతో పాటు కనీసం రెండు సంవత్సరాల కాల పరిమితితో అవి పని చేస్తాయి.