Share News

గ్రేటర్ బడ్జెట్‌ 4,047.12 కోట్లు

ABN , Publish Date - Jan 13 , 2026 | 01:52 AM

మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ.4,047.12 కోట్లతో తయారుచేసిన బడ్జెట్‌ ముసాయిదాను స్టాండింగ్‌ కమిటీ ఆమోదించింది.

గ్రేటర్ బడ్జెట్‌ 4,047.12 కోట్లు

ముసాయిదాను ఆమోదించిన స్టాండింగ్‌ కమిటీ

త్వరలో కౌన్సిల్‌ ఆమోదానికి...

విశాఖపట్నం, జనవరి 12 (ఆంధ్రజ్యోతి):

మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ.4,047.12 కోట్లతో తయారుచేసిన బడ్జెట్‌ ముసాయిదాను స్టాండింగ్‌ కమిటీ ఆమోదించింది. సోమవారం మేయర్‌ పీలా శ్రీనివాసరావు అధ్యక్షతన స్టాండింగ్‌ కమిటీ బడ్జెట్‌ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చీఫ్‌ ఎగ్జామినర్‌ ఆఫ్‌ అకౌంట్స్‌ వాసుదేవరెడ్డి ముసాయిదాలో పొందుపరిచిన ఆదాయం, ఖర్చుల వివరాలను సభ్యులకు చదివి వినిపించారు. గతంలో ఆదాయంతో సంబంధం లేకుండా కొంచెం ఎక్కువ ఖర్చు అంచనాలతో బడ్జెట్‌ను రూపొందించేవారమని, వాస్తవ ఆదాయ, వ్యయాలు ఆధారంగా మాత్రమే బడ్జెట్‌ రూపొందించాలని మేయర్‌ పీలా శ్రీనివాసరావు, కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ ఆదేశించారన్నారు. దీంతో గత ఏడాది సెప్టెంబరు చివరి నాటికి జీవీఎంసీకి వచ్చిన ఆదాయాలను పరిగణనలోకి తీసుకుని దానికి సమానంగా ఖర్చులు ఉండేలా బడ్జెట్‌ రూపొందించామన్నారు.

వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆస్తి పన్ను ద్వారా రూ.550 కోట్లు, ఖాళీ స్థలాల పన్ను ద్వారా రూ.85 కోట్లు, స్థిరాస్తుల బదలాయింపు ద్వారా రూ.200 కోట్లు, మార్కెట్‌లు, షాపింగ్‌ కాంప్లెక్స్‌ల ద్వారా రూ.4.8 కోట్లు, ఆట స్థలాలు, ఫంక్షన్‌ హాల్స్‌ అద్దెల ద్వారా రూ.65 లక్షలు మొత్తం సాధారణ పరిపాలన ద్వారా రూ.123.26 కోట్లు ఆదాయం సమకూరుతుందని అంచనా వేశారు. అలాగే ఇంజనీరింగ్‌ నుంచి రూ.264.56 కోట్లు, ప్రాజెక్టుల ద్వారా రూ.550 కోట్లు, టౌన్‌ప్లానింగ్‌ ద్వారా రూ.543 కోట్లు, పార్కులు, లీజర్స్‌ ద్వారా రూ.30 కోట్లు, అమృత్‌ ద్వారా రూ.162 కోట్లు, డిపాజిట్లు, అడ్వాన్సులు ద్వారా రూ.382.79 మొత్తం 3,814.41 కోట్లు ఆదాయం సమకూరుతుందని అంచనా వేస్తున్నారు. ఖర్చులకు కేటాయింపులను పరిశీలిస్తే...రోడ్లు, భవనాలు, డ్రైన్లు, కల్వర్టుల నిర్మాణం కోసం అత్యధికంగా ఇంజనీరింగ్‌కు రూ.1018.18 కోట్లు, తర్వాత ప్రజారోగ్య విభాగానికి రూ.455.94 కోట్లు కేటాయించారు. సాధారణ పరిపాలనా విభాగాలకు రూ.375.82 కోట్లు, నీటి సరఫరాకు రూ.260.08 కోట్లు, లైటింగ్‌కు రూ.12.91 కోట్లు, ప్రాజెక్టులకు రూ.67.35 కోట్లు, టౌన్‌ప్లానింగ్‌కు రూ.23.93 కోట్లు, యూసీడీకి రూ.16.43 కోట్లు, విద్యకు రూ.2.25 కోట్లు, పార్కులు, లీజర్స్‌, సెమిట్రీలకు రూ.36.14 కోట్లు మొత్తం రూ.4,047.12 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు చూపించారు.

ఆదాయం ఇలా...:

సాధారణ పద్దు రూ.123.26 కోట్లు

ఇంజనీరింగ్‌ రూ.264.56 కోట్లు

ప్రాజెక్ట్స్‌ రూ.550 కోట్లు

టౌన్‌ప్లానింగ్‌ రూ.332.86 కోట్లు

యూసీడీ రూ.10.07 కోట్లు

పార్కులు రూ.30 కోట్లు

ప్రజారోగ్యం రూ.22.96 కోట్లు

నీటి సరఫరా రూ.428.07 కోట్లు

అమృత్‌ రూ.162 కోట్లు

ఇతర నిధులతో ప్రాజెక్టులు రూ.68 కోట్లు

విదేశీ సహకారంతో చేపట్టే ప్రాజెక్టులు రూ.148 కోట్లు

ఆర్థిక సంఘం నిధులు రూ.255 కోట్లు

డిపాజిట్లు అడ్వాన్సులు రూ.382.79 కోట్లు

అర్బన్‌ ఛాలెంజింగ్‌ ఫండ్‌ రూ.620 కోట్లు

మొత్తం రూ.3,814.41 కోట్లు

ఖర్చులు ఇలా:

సాధారణ పరిపాలన రూ.375.82 కోట్లు

ఇంజనీరింగ్‌ రూ.1,018.18 కోట్లు

లైటింగ్‌ రూ.129.19 కోట్లు

ప్రాజెక్ట్స్‌ రూ.67.35 కోట్లు

టౌన్‌ప్లానింగ్‌ రూ.23.93 కోట్లు

యూసీడీ రూ.16.43 కోట్లు

విద్య రూ.2.25కోట్లు

పార్కులు రూ.36.13 కోట్లు

ప్రజారోగ్యం రూ.455.94 కోట్లు

నీటి సరఫరా రూ.260.08 కోట్లు

అమృత్‌ రూ.388 కోట్లు

విదేశీ సహకారంతో

చేపట్టే ప్రాజెక్టులు రూ.68కోట్లు

ఆర్థిక సంఘం నిధులు రూ.215 కోట్లు

అర్బన్‌ఛాలెంజ్‌ఫండ్‌ రూ.650 కోట్లు

డిపాజిట్లు అడ్వాన్సులు రూ.340.82 కోట్లు

మొత్తం ఖర్చులు రూ.4,047.12 కోట్లు

Updated Date - Jan 13 , 2026 | 01:52 AM