పెను విషాదం
ABN , Publish Date - Oct 24 , 2026 | 11:43 PM
ఒకచోట చేయి..మరోచోట కాలు, తుప్పల్లో మొండెం...ఇలా ఎక్కడ చూసినా మాంసపు ముద్దలే. చుట్టూ భయానక వాతావరణమే... అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పినకోట పంచాయతీ పీచుమామిడి గ్రామ సమీపాన శనివారం జరిగిన పేలుడు మిగిల్చిన విషాదమిది.
- అల్లూరి జిల్లా అనంతగిరి మండలం పీచుమామిడి వద్ద పేలుడు
- ఏడుగురి దుర్మరణం
- తునాతునకలైన మృతదేహాలు
అనంతగిరి/దేవరాపల్లి/పాడేరు, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): అనంతగిరి మండలం పినకోట పంచాయతీ పరిధిలోని బల్లగరువు నుంచి తునిసీబు వరకూ రోడ్డు నిర్మాణానికి ఉపయోగించే టిప్పర్‌కు డీజిల్ పంపింగ్ చేస్తుండగా సంభవించిన పేలుడులో ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. వీరిలో ముగ్గురు సజీవ దహనం కాగా, వేర్వేరు ప్రదేశాల్లో ఇద్దరి మాంసపు ముద్దలు, వంద మీటర్ల దూరంలో మహిళా ఉపాధ్యాయురాలి మృతదేహం లభ్యమయ్యాయి. మరొకరి మృతదేహం కనిపించలేదు. పేలుడు ధాటికి ఆ ప్రదేశానికి ఎవరూ వెళ్లలేకపోయారు.
ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం
పాడేరు, అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి): అనంతగిరి మండలం పినకోట పంచాయతీ పీచుమామిడి గ్రామంలో శనివారం ఉదయం జరిగిన ప్రమాదంలో మృతి చెందిన ఏడుగురి కుటుంబాలను ప్రభుత్వపరంగా ఆదుకుంటామని కలెక్టర్ టి.నిషాంతి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రమాదంలో అనంతగిరి మండలం మడ్రేబు గ్రామ ఉపాధ్యాయిని జాగరపు సునీత, మాన్యాల మణికంఠ, ఆదిబోయిన గురుపవన్, పాంగి చిరంజీవి, టింక చంద్రవంశీసింగ్, నజీర్, నారాయణరావు మృతి చెందారన్నారన్నారు. వారి కుటుంబాలకు రూ.5 లక్షలు చొప్పున కాంట్రాక్టర్ ద్వారా నష్టపరిహారాన్ని అందిస్తామని, భవిష్యత్తులో మృతుల కుటుంబీలకు ప్రభుత్వం సంపూర్ణమైన అండగా ఉంటుందని తెలిపారు.
ఇలా జరుగుతుందని అనుకోలేదు
- కన్నీరుమున్నీరైన ఇద్దరు టీచర్లు
దేవరాపల్లి: మాడ్రేబులో పనిచేస్తున్న ఉపాధ్యాయులు జాగరపు సునీత, టి.స్వాతి, దాయర్తిలో పనిచేస్తున్న జి.మాధురి రోజూ దేవరాపల్లి నుంచి పాఠశాలలకు రాకపోకలు సాగించేందుకు ద్విచక్ర వాహనదారులకు నెలవారీ కొంత మొత్తాన్ని చెల్లిస్తారు. అయితే శనివారం విశాఖనగరంలోని విశాలాక్షినగర్ నుంచి ముందుగా వచ్చిన జాగరపు సునీత ద్విచక్రవాహనదారుని కోసం దేవరాపల్లిలో వేచి ఉన్నారు. ఆ సమయంలో వ్యాన్ రావడంతో ఆమె అందులో ఎక్కి పీచుమామిడి గ్రామంలో దిగారు. అక్కడ నుంచి ద్విచక్ర వాహనదారుడికి ఫోన్ చేస్తూ వెళుతుండగా పేలుడుకు ఆమె మృతి చెందారు. రోజూ ఆమెతోపాటు వెళ్లే స్వాతి, మాధురి శనివారం అరగంట ఆలస్యంగా వచ్చారు. దీంతో వారి ప్రాణాలు దక్కాయి. అయితే ఈ ప్రమాదంలో తమ తోటి ఉపాధ్యాయిని మృతి చెందడం కలచి వేసిందని వారు కన్నీరుమున్నీరయ్యారు.
తమ్ముడిని కోల్పోయిన అన్న
బిహార్‌కు చెందిన హుస్సేన్, చంద్రవంశీ సింగ్ అన్నదమ్ములు. వీరిద్దరూ రోడ్డు నిర్మాణ పనులు చేస్తున్నారు. పేలుడు ఘటనలో తమ్ముడు చంద్రవంశీసింగ్ మృతి చెందాడు. సోదరుడి మృతదేహం లభ్యం కాకపోవడంతో హుస్సేన్ తల్లడిల్లిపోయాడు.
పెద్ద దిక్కును కోల్పోయారు
- దిక్కుతోచని స్థితిలో డ్రైవర్ కుటుంబం
పెదబయలు: మండలంలోని అడుగులపుట్టు పంచాయతీ జంగంపుట్టు గ్రామానికి చెందిన పాంగి చిరంజీవి అలియస్ చిరు (30) పేలుడు ఘటనలో మృతి చెందడంతో ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. చిరంజీవికి తల్లి, తండ్రితోపాటు నాగమ్మ, మంగమ్మ, చంద్రకళ ముగ్గురు భార్యలు. అభిరామ్, అజీత్, సాయిపల్లవి, అరవింద్, యశ్వంత్, చిన్నపాపతో కలిపి ఆరుగురు పిల్లలు ఉన్నారు. కుటుంబానికి పెద్దదిక్కు అయిన చిరంజీవి మృతి చెందడంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో ఉంది.
దురదృష్టకరం
- జిల్లా ఇన్‌చార్జి మంత్రి సంధ్యారాణి
అరకులోయ: పీచుమామిడిలో జరిగిన పేలుడులో ఏడుగురు మృతి చెందడం దురదృష్టకరమని జిల్లా ఇన్‌చార్జి మంత్రి సంధ్యారాణి అన్నారు. శనివారం ఆమె ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ ఈ దుర్ఘటన తెలిసిన వెంటనే పీచుమామిడికి బయలుదేరానని, పోలీస్ క్లియరెన్స్ లేకపోవడం, మృతదేహాలను అరకులోయ ఆస్పత్రికి తరలిస్తారని చెప్పడంతో ఇక్కడకు వచ్చానన్నారు. అయితే పీచుమామిడి ప్రాంతం అనకాపల్లికి దగ్గరవుతుందని అక్కడకు మృతదేహాలను తరలించారన్నారు. సంఘటన జరిగిన వెంటనే పోలీస్, మండల అధికారులంతా ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటలో ఆరుగురు కార్మికులు కాగా, ఒకరు టీచర్ మృతి చెందారన్నారు. ఆ టీచర్ ఇటీవల జరిగిన డీఎస్సీలో ఎంపికై విధుల్లో చేరారన్నారు. ఈ సమావేశంలో టీడీపీ అరకు, పాడేరు నియోజకవర్గాల ఇన్‌చార్జులు దొన్నుదొర, గిడ్డి ఈశ్వరి, జీసీసీ చైర్మన్ శ్రావణ్‌కుమార్, టీడీపీ జిల్లా ఎన్నికల పరిశీలకుడు, ఎమ్మెల్సీ రాజశేఖర్, నాయకులు పాల్గొన్నారు.