Share News

మాల్‌పై మహా ప్రేమ

ABN , Publish Date - Feb 27 , 2026 | 12:45 AM

Great love for the mall

మాల్‌పై మహా ప్రేమ

రివైజ్డ్‌ ప్లాన్‌ పెట్టిన వారం రోజులకే కమిషనర్‌ లాగిన్‌కు ఫైల్‌

వార్డు ప్లానింగ్‌ సెక్రటరీ రిమార్కులను దాచిపెట్టి ఉన్నతాధికారులకు ఫైల్‌ పంపిన టీపీఓ

అక్కడి నుంచి నాలుగు రోజుల్లో ఉన్నతాధికారికి...

బిల్డింగ్‌ అప్లికేషన్‌ నంబర్‌ రాగానే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌కు దరఖాస్తు చేసిన మాల్‌ యాజమాన్యం

లొసుగులు గుర్తించి దరఖాస్తును తిరస్కరించినందుకే జోన్‌ అధికారి బదిలీ

విశాఖపట్నం, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి):

నగర నడిబొడ్డున జాతీయ రహదారికి కూతవేటు దూరంలో ఒక బహుళజాతి వ్యాపార సంస్థ నిర్మిస్తున్న భారీ వాణిజ్య సముదాయం (ఇనార్బిట్‌మాల్‌)పై జీవీఎంసీ అధికారులు ఎనలేని ప్రేమ చూపించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టినప్పటికీ చూసీచూడనట్టు ఊరుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇనార్బిట్‌మాల్‌ నిర్మాణంలో లొసుగులు ఉన్నాయని గుర్తించిన ఒక అధికారిణి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ జారీకి నిరాకరిస్తే...ఆమెను ఆ జోన్‌ బాధ్యతల నుంచి తప్పించడమే కాకుండా జీవీఎంసీ నుంచి రాష్ట్ర టౌన్‌ అండ్‌ కంట్రీప్లానింగ్‌ డైరెక్టర్‌ కార్యాలయానికి సరండర్‌ చేయడంపై ‘గోల్‌మాల్‌’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’ గురువారం ప్రచురించిన కథనం జీవీఎంసీ వర్గాల్లో పెద్దఎత్తున చర్చకు దారితీసింది. అంతకుముందు మాల్‌కు రివైజ్డ్‌ ప్లాన్‌ జారీ విషయంలో కూడా అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారనే విషయం వెలుగుచూసింది. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ నుంచి సుమారు 12700 చదరపు మీటర్లు భూమిని లీజుకు తీసుకున్న బహుళజాతి వ్యాపార సంస్థ అక్కడ మాల్‌ నిర్మాణం కోసం ముందుగా ప్లాన్‌కు దరఖాస్తు చేసుకుంది. అప్పటి జీవీఎంసీ అధికారులు ప్లాన్‌ జారీచేశారు. అనంతరం మాల్‌ నిర్మాణం చేపట్టిన స్థలానికి పశ్చిమ వైపు ఉన్న కొంత భూమిలో నిర్మాణం కోసం రివైజ్డ్‌ ప్లాన్‌ కోసం 2025 నవంబరు చివర్లో దరఖాస్తు చేసుకుంది. ప్లాన్‌ దరఖాస్తును పరిశీలించిన వార్డు ప్లానింగ్‌ సెక్రటరీ ఆ భవనానికి డాక్యుమెంట్‌లో చూపినట్టుగా తూర్పు వైపున 30 అడుగులు రోడ్డు లేదని, నిర్మాణం జరుగుతున్న భూమిలో జీవీఎంసీకి గిఫ్ట్‌ రిజిస్ట్రేషన్‌ చేయకుండా నోటరీ అఫిడవిట్‌ ఇచ్చినట్టు పేర్కొంటూ నోట్‌ఫైల్‌లో రిమార్కు రాసి ఫైల్‌ను తదుపరి చర్య కోసం టీపీఓకు పంపించారు. టీపీఓ తన పరిశీలనలో వార్డు ప్లానింగ్‌ సెక్రటరీ పేర్కొన్న రిమార్కులను పట్టించుకోకుండా ప్లాన్‌ జారీ చేయవచ్చునని సిఫారసు చేస్తూ ఏసీపీకి ఫైల్‌ను పంపించారు. తర్వాత ఒక్కో అధికారి లాగిన్‌ నుంచి డిసెంబరు మొదటి వారానికి కమిషనర్‌కు చేరింది. అయితే దీనిపై కమిషనర్‌ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవంతో డీమ్డ్‌ అప్రూవల్‌ అయినట్టు సమాచారం. కమిషనర్‌ స్థాయిలో డీమ్డ్‌ అప్రూవల్‌ అయితే ఆటోమేటిక్‌గా బిల్డింగ్‌ అప్లికేషన్‌ నంబర్‌ (దాదాపు పూర్తిస్థాయి ప్లాన్‌ ఆమోదం) జారీ అయిపోతుంది. మాల్‌ యాజమాన్యం దీనిని ఆసరాగా చేసుకుని ఇటీవల ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ కోసం దరఖాస్తు చేసుకోగా, టౌన్‌ప్లానింగ్‌ అధికారి మాల్‌ను సందర్శించి కొన్ని లొసుగులు ఉన్నాయని పేర్కొన్నారు. దరఖాస్తును తిరస్కరించారు. ఈ నేపథ్యంలో సదరు అధికారిని ఆ జోన్‌ నుంచి పైఅధికారులు మార్చి, అనుకూలమైన అధికారికి ఆ జోన్‌ బాధ్యతలు అప్పగించారని, ఈ నేపథ్యంలో ఓసీ కోసం తిరిగి దరఖాస్తు రావడం, పార్షియల్‌ ఓసీని ఈ నెల మొదటివారంలో జారీచేయడం జరిగిందని సమాచారం. ఆ తరువాత ఓసీ దరఖాస్తును తిరస్కరించిన టౌన్‌ప్లానింగ్‌ అధికారిని జీవీఎంసీ నుంచి సరండర్‌ చేసినట్టు టౌన్‌ప్లానింగ్‌ విభాగంలో ప్రచారం జరుగుతోంది. ఈ తతంగం వెనుక పెద్ద మొత్తం చేతులు మారిందని, రాష్ట్రస్థాయి నుంచి ఒత్తిళ్లు రావడం కూడా మరో కారణమని చెబుతున్నారు.

Updated Date - Feb 27 , 2026 | 12:45 AM